Tamilnadu News: తమిళనాడు రాష్ట్రంలో అల్పాహార పథకం అమలు అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ అల్పాహార పథకంపై తెలంగాణ సర్కారు అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఉన్నత అధికారులు గురువారం చెన్నై వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సీఎం పేషీ అధికారిణి ప్రియాంక వర్ఘీస్, సీనియర్‌ సిటిజన్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హొళికేరి, మహిళలు, దివ్యాంగులు.. తదితరులు రాయపురంలోని వంటశాలను పరిశీలించారు. అల్పాహారం తయారు చేసేందుకు కావాల్సిన సామగ్రి, పాఠశాలలకు ఎలా చేర్చాలి వంటి విషయాలను తెలుసుకొని.. అల్పాహారం రుచి చూశారు. తర్వాత రాయపురం ఆరత్తూన్‌ రోడ్డులోని కార్పొరేషన్‌ ఉర్దూ పాఠశాలకు వెళ్లిన ఈ అధికారులు అందరూ... విద్యార్థులకు అల్పాహారం నాణ్యత, పంపిణీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అల్పాహారం పథకం ద్వారా ఎంత మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు, ఈ పథకంపై విద్యార్థుల తల్లిదండ్రుల స్పందన ఎలా ఉంది అని పథకం సమన్వయ అధికారి ఇళమ్‌ భగవత్‌, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.






ఇటీవలే తమిళనాడులో ప్రారంభించిన అల్పాహార పథకం


జస్టిస్ పార్టీ పాలన ప్రారంభం నుండి 2021 వరకు తమిళనాడులో కేవలం మధ్యాహ్న భోజన పథకాలు మాత్రమే ఉన్నాయి. కానీ వందేళ్ల తర్వాత అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ట్విట్టర్ వేధికగా వెల్లడించారు. ఈ అల్పాహార పథకం ప్రతిరోజూ 17 లక్షల మంది విద్యార్థుల ఆకలిని తీరుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఆకలితో ఉన్నారనే వార్తలు రాకూడదని.. వారు చదువుకునేందుకు కావాల్సిన అన్నింటిని తమ సర్కారు అందజేస్తుందని పేర్కొన్నారు.