PM Modi:


కేంద్ర ప్రభుత్వం హరిత ఇంధనానికి పెద్ద పీట వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. దేశ ప్రవేటు రంగానికి స్వచ్ఛ ఇంధన వనరులు 'బంగారు గనులు లేదా చమురు క్షేత్రాల' వంటివన్నారు. బడ్జెట్‌ తర్వాత నిర్వహించిన మొదటి వెబినార్‌లో ఆయన మాట్లాడారు.


కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో కొన్ని ప్రాధామ్య అంశాలను ప్రకటించింది. వీటిని పక్కగా అమలు చేసేందుకు ప్రజల నుంచి సలహాలు, ఆలోచనలను స్వీకరిస్తోంది. ఇందుకోసం 12 వరుస వెబినార్‌లను నిర్వహించనుంది. గురువారం జరిగిన తొలి వెబినార్‌లో హరిత ఇంధన రంగం వృద్ధి గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. భారత సౌర, పవన, బయోగ్యాస్‌ సామర్థ్యాలు బంగారు గనులు, చమురు క్షేత్రాలకు తక్కువేమీ కాదన్నారు. పునరుత్పాదక ఇంధన వనరులు భారీ సంఖ్యలో స్వచ్ఛ ఇంధన ఉద్యోగాలు సృష్టించగలవని ధీమా వ్యక్తం చేశారు.


'భారత హరిత ఇంధన అభివృద్ధి వ్యూహంలో వాహన తుక్కు విధానానిది కీలక పాత్ర. మనం మూడు లక్షల వాహనాలను తుక్కుగా మార్చబోతున్నాం. భారత భవిష్యత్తు రక్షణకు ఈ బడ్జెట్‌ ఒక అవకాశం. ఇందులో ప్రవేశపెట్టిన విధానాలను అమలు చేసేందుకు  మనం కలిసికట్టుగా వేగంగా పనిచేయాలి' అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.


ప్రపంచ హరిత ఇంధన మార్కెట్లో భారత్‌ కీలక పాత్ర పోషించేందుకు కేంద్ర బడ్జెట్‌ సాయపడుతుందని మోదీ పేర్కొన్నారు. మన తర్వాతి తరాల భవిష్యత్తుకు శంకుస్థాపన చేశామన్నారు. అందుకు తగ్గట్టే విధానాలు ఉన్నాయన్నారు.


భారత్‌ ఇప్పటికే E20 ఇంధన విధానానికి శ్రీకారం చుట్టింది. ఇంధనంలో 20 శాతం ఇథనాల్‌ను కలపడమే ధ్యేయం. 2013-14లో పెట్రోల్‌లో 1.53 శాతం ఇథనాల్‌ కలుపుతుండగా 2022కు అది 10.17 శాతానికి పెరిగింది. గతంలో నిర్దేశించుకున్న 2030తో పోలిస్తే 2025-25లోనే 20 శాతం లక్ష్యాన్ని చేరుకొనేందుకు ప్రయత్నిస్తోంది.


ఈ బడ్జెట్లో ప్రభుత్వం గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌, ఎనర్జీ ట్రాన్సిషన్‌, ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్ట్స్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ ఎవాక్యుయేషన్‌, గ్రీన్‌ క్రెడిట్‌ ప్రోగ్రామ్‌, పీఎం ప్రణామ్, గోబర్‌ధన్ స్కీమ్, భారతీయ ప్రాక్రుతిక్‌ కేటి, బయో ఇన్‌పుట్‌ రిసోర్సెస్‌ సెంటర్‌, మిస్టీ, అమృత్‌ ధారోహర్‌, కోస్టల్‌ షిప్పింగ్‌ వెహికిల్‌ రిప్లేస్‌మెంట్‌ వంటి ప్రాజెక్టులను చేపడుతున్నామని వెల్లడించింది.