Aiden Markram SRH:


ఐపీఎల్‌ మాజీ విన్నర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త కెప్టెన్‌ను నియమించింది. దక్షిణాఫ్రికా క్రికెటర్‌ అయిడెన్‌ మార్‌క్రమ్‌కు పగ్గాలు అప్పగించింది. భువనేశ్వర్‌ కుమార్‌కు కెప్టెన్సీ అనుభవం ఉంది. కుర్రాడు అభిషేక్‌ శర్మ పంజాబ్‌ టీ20 జట్టుకు నాయకుడు. టీఎన్‌పీఎల్‌లో వాషింగ్టన్‌ సుందర్‌కు అనుభవం ఉంది. పంజాబ్‌ కింగ్స్‌, కర్ణాటక జట్లను మయాంక్‌ అగర్వాల్‌ నడిపించాడు. మరి వీరిని కాదని హైదరాబాద్‌ సఫారీనే ఎందుకు ఎంచుకొంది? ఏదైనా తప్పు చేసిందా? నిర్ణయం వెనక లాజిక్‌ ఏంటి?


ఇదీ పరిస్థితి!


మూడు సీజన్ల నుంచి ప్రదర్శన దిగజారింది కానీ! నిజానికి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మంచి జట్టే! అరంగేట్రం నుంచీ చక్కని పోటీనిచ్చింది. అభిమానుల మనసులు గెలుచుకుంది. కింగ్‌ కోహ్లీ భీకర ఫామ్‌ను ధాటిగా ఎదుర్కొని 2016లో కప్పు ముద్దాడింది. హైదరాబాద్‌ను రెండో ఇంటిగా మార్చేసుకున్న డేవిడ్‌ వార్నర్‌తో విభేదాలు సన్‌రైజర్స్‌ కొంప ముంచాయి. వీవీఎస్‌ లక్ష్మణ్ వెళ్లిపోయాక కోచింగ్‌ బృందంలో అంతర్గత సమస్యలు మొదలయ్యాయి. రెండేళ్లుగా కేన్‌ విలియమ్సన్‌ సైతం ఏమీ చేయలేకపోయాడు. అతడిని వదిలేసిన సన్‌రైజర్స్‌ జట్టును ప్రక్షాళన చేసింది. ప్రస్తుతం కుర్రాళ్లు, సీనియర్ల మేళవింపుతో మెరుగ్గానే కనిపిస్తోంది. వీరిని నడిపించేందుకు అయిడెన్‌ మార్‌క్రమ్‌ సరైన వాడిగా భావించింది. ఇందుకు కొన్ని కారణాలు లేకపోలేదు.


ప్రపంచకప్‌ అందించాడు!


దక్షిణాఫ్రికా జట్టెప్పుడూ భీకరమే! అద్భుతమైన ఆటగాళ్లు ఉంటారు. కానీ మెగా టోర్నీల్లో కనీసం గ్రూప్‌ స్టేజీ దాటకుండానే చోకర్స్‌గా మిగిలిపోతుంటారు. అలాంటి దేశానికి తొలి ప్రపంచకప్‌ అందించిన నాయకుడు అయిడెన్‌ మార్‌క్రమ్‌దే! 2014లో అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిపించాడు. జాతీయ జట్టులో అరంగేట్రం చేసినప్పటి నుంచే చక్కని ప్రదర్శనలతో మెప్పించాడు. రెండేళ్లకే ఫామ్‌ కోల్పోయి సతమతమైనా పరిణతి సాధించి బలంగా పుంజుకున్నాడు. టెస్టు, వన్డే, టీ20ల్లో రాణిస్తూ అన్ని ఫార్మాట్ల ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. వివిధ దేశాల్లో టీ20 లీగులు ఆడటంతో పొట్టి క్రికెట్లో స్థిరత్వం పెరిగింది. 2022 ఐపీఎల్‌ సీజన్లోనూ సన్‌రైజర్స్‌ను అతడే ఆదుకొన్నాడు. ఓపెనింగ్‌, వన్‌డౌన్‌, మిడిలార్డర్లో ఏ పాత్రనైనా పోషించగలడు. చక్కని లెగ్‌బ్రేక్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను పడగొట్టగలడు. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అతడి టెక్నిక్‌కు ఫిదా అవ్వడం గమనార్హం.


ఎస్‌ఏ20 గెలిపించాడు


ఈ ఏడాది దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఎస్‌ఏ20 లీగు నిర్వహించింది. ఇందులో ఆరు జట్లనీ ఐపీఎల్‌ ఫ్రాంచైజీలే కొనుగోలు చేశాయి. అందులో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ ఒకటి. ఐపీఎల్‌ కోచింగ్‌ బృందం, ఆటగాళ్లనే ఇందులోనూ భాగం చేశారు. అయిడెన్‌ మార్‌క్రమ్‌ను సారథిగా ఎంపిక చేశారు. స్వదేశంలో అతడు సన్‌రైజర్స్‌ యాజమాన్యం ఆశలు నిలబెట్టాడు. అరంగేట్రం ఎస్‌ఏ20 విజేతగా నిలిపాడు. నాయకుడు, బ్యాటర్‌, బౌలర్‌గా అన్ని పాత్రల్లో విజయవంతం అయ్యాడు. 127 స్ట్రైక్‌రేట్‌తో 369 పరుగులు చేశాడు. ఒక సెంచరీ బాదేశాడు. 6.19 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. రాలెఫ్ వాన్‌డర్‌ మెర్వీ, మార్కో జన్‌సెన్‌ వంటి బౌలర్లను అద్భుతంగా వినియోగించుకున్నాడు. అంతేకాకుండా చాలా మ్యాచుల్లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి పరుగుల్ని నియంత్రించాడు. పైగా చివరి రెండు టీ20 ప్రపంచకప్పుల్లో మార్‌క్రమ్‌ ఆటతీరు అదుర్స్‌ అనే చెప్పాలి.


ఈ మేళవింపునకు కరెక్టే!


అండర్‌-19 క్రికెట్‌ నుంచే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న అయిడెన్‌ మార్‌క్రమ్‌ ఐపీఎల్‌లోనూ ఆకట్టుకొనే అవకాశాలు ఎక్కువే! ఇక్కడి పిచ్‌లపై అవగాహన ఉంది. ఎస్‌ఏ20 కోచింగ్‌ బృంద సభ్యులే ఇక్కడా ఉంటారు. మేనేజ్‌మెంట్‌ అండదండలు మెండుగా ఉన్నాయి. ఆటగాళ్లూ బాగున్నారు. వారితో సమన్వయం బాగుంది. అభిషేక్ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, హ్యారీ బ్రూక్‌, మయాంక్‌ అగర్వాల్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌తో పాటూ మార్‌క్రమ్‌ కీలకంగా బ్యాటింగ్‌ చేస్తాడు. భువీ, నటరాజన్‌ వంటి సీనియర్‌ పేసర్లు ఉన్నారు. కార్తీక్‌ త్యాగీ, మార్కో జన్‌సెన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ వంటి యువ పేసర్లు వైవిధ్యం తీసుకొస్తారు. వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌, తనూ బ్యాటింగ్‌తో పాటు స్పిన్‌ వేయగలరు. ఆదిల్‌ రషీద్‌, మయాంక్‌ మర్కండే వంటి స్పిన్నర్లనూ ఉపయోగించుకోగలడు. వనరులన్నీ సవ్యంగా ఉన్నాయి కాబట్టి మార్‌క్రమ్‌ ఎంపిక సరైందేనని అనిపిస్తోంది.