Noida International Airport: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో నిర్మిస్తున్న 'నొయిడా అంతర్జాతీయ విమానాశ్రయం' పనులు దాదాపు పూర్తయ్యాయి. యమునా నది ఒడ్డున ఉన్న జేవార్‌ ‍‌(Jewar) పట్టణంలో నిర్మిస్తున్న ఈ విమానశ్రయం దేశంలోనే అతి పెద్దది (Largest Airport In India). ఇది ప్రారంభమైతే... మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే వాళ్లకు, విదేశాల నుంచి భారత్‌ వచ్చే వాళ్లకు మరిన్ని ఫ్లైట్‌ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఎయిర్‌ ప్యాసెంజర్ల సంఖ్య, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది. ఎయిర్‌ కనెక్టివిటీ అనుకూలంగా మారితే దేశంలోకి కొత్త కంపెనీలు వస్తాయి, ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి.


నొయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ‍‌(Inauguration of Noida International Airport) రోజున.. ఈ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌ గాల్లోకి ఎగురుతాయి. అదే సమయంలో... ఏకంగా 250 అంతర్జాతీయ కంపెనీలు కూడా రిబ్బన్ కట్ చేస్తాయి. నొయిడా అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు, అదే రోజున, యమున డెవలప్‌మెంట్ అథారిటీ ‍‌(Yamuna Development Authority) ప్రాంతంలో 250 కంపెనీలు కూడా ప్రారంభోత్సవాలు పెట్టుకున్నాయి. ఈ కంపెనీల ప్రారంభంతో దాదాపు రెండున్నర లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.


అక్టోబర్‌లో విమానాశ్రయం ప్రారంభం
జేవార్‌లో నిర్మిస్తున్న నొయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయని యమున డెవలప్‌మెంట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అరుణ్ వీర్ సింగ్ చెప్పారు. నిర్మాణం చివరి దశలో ఉందని, వచ్చే నెల (2024 జులై) చివరి నాటికి మొత్తం పని పూర్తవుతుందన్నారు. అక్టోబర్‌ నుంచి ఈ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానాలు ఎగురుతాయని భావిస్తున్నట్లు అరుణ్ వీర్ సింగ్‌ తెలిపారు.


కొత్త ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం
కొత్తగా ప్రారంభించనున్న 250 కంపెనీల గురించి కూడా సీఈవో మాట్లాడారు. వాటిలో 126 కంపెనీలు టాయ్ పార్క్‌లో, 81 కంపెనీలు అపెరల్ పార్క్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కొత్త ఉద్యోగాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. జేవార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గరలో ఏర్పాటయ్యే కంపెనీలన్నీ ప్రధానంగా మహిళలకు ఉపాధి కల్పించాలన్న విషయంపై ఇప్పటికే చర్చ జరిగిందని, నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిపారు.


దిల్లీ నుంచి దాదాపు 75 కి.మీ. దూరంలో ఉన్న జేవార్‌ పట్టణంలో నొయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ నిర్మిస్తున్నారు. ఇక్కడ ఫ్లైట్‌ దిగి దిల్లీకి వెళ్లడానికి, దిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌ ఎక్కడానికి అనుకూలంగా ఉంటుంది. నొయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశలో ఒక రన్‌వే, ఒక టెర్మినల్‌ నిర్మిస్తున్నారు. ఏటా 1.20 కోట్ల మంది ప్రయాణీకుల రాకపోకలను నిర్వహించే సామర్థ్యం ఉంటుంది. నాలుగో దశ పూర్తయిన తర్వాత ఈ విమానాశ్రయం సంవత్సరానికి 7 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చు.            


నొయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానించేందుకు 61 కి.మీ. రైల్వే లైన్‌ నిర్మిస్తున్నారు. జేవార్‌లోని విమానాశ్రయాన్ని - దిల్లీ NCR, ముంబై, కోల్‌కతాను అనుసంధానించడం ఈ రైల్వే లైన్‌ లక్ష్యం. 


మరో ఆసక్తికర కథనం: జనం చెవుల్లో ఫూట్ర్‌ పెట్టొద్దు, జ్యూస్‌ ప్యాకెట్లపై ఆ నంబర్‌ తీసేయండి