GQG Partners co founder Rajiv Jain: జనవరి 24, 2023న, షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్‌ తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్‌ నెత్తిన దురదృష్టం తాండవమాడింది. కొన్ని స్టాక్స్ 85 శాతం వరకు కూడా పడిపోయాయి. ఇన్వెస్టర్లలో తిరిగి నమ్మకం కలిగించేందుకు గౌతమ్‌ అదానీ, అదానీ గ్రూప్‌ చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించలేదు. ఆ సమయంలో రంగంలోకి వచ్చారు రాజీవ్‌ జైన్‌. మునిగిపోతున్న అదానీ నౌకను రిపేర్‌ చేసి, మళ్లీ స్టెడీగా నిలబెట్టారు.


అదానీ గ్రూప్‌లోని నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లను ఏకంగా రూ. 15,446 కోట్లకు కొనుగోలు చేసి, ఆ గ్రూప్‌ మొత్తానికి తిరిగి జవసత్వాలు ఇచ్చారు రాజీవ్‌ జైన్‌. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లను కొనుగోలు చేసిన జీక్యూజీ పార్టనర్స్ (GQG Partners) సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ రాజీవ్ జైన్. రాజీవ్ జైన్ భారీ కొనుగోళ్ల తర్వాత అదానీ గ్రూప్ కంపెనీలపై ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగింది. అదానీ పోర్ట్‌ఫోలియోలోని అన్ని స్టాక్‌లు దూసుకుపోయాయి.


ఎవరీ రాజీవ్ జైన్?
రాజీవ్ జైన్ GQG పార్టనర్స్ ఛైర్మన్ & చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్. GQG పెట్టుబడి వ్యూహాన్ని రచించేది ఈయనే. దీనికి ముందు, వోంటోబెల్ అసెట్ మేనేజ్‌మెంట్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ & ఈక్విటీస్ హెడ్‌గా పని చేశారు. 1994లో పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా తన కెరీర్‌ను రాజీవ్‌ జైన్‌ ప్రారంభించారు. కేవలం ఏడు సంవత్సరాల్లో $92 బిలియన్ల సంస్థగా GQGని తీర్చిదిద్దారు. ఇంత తక్కువ సమయంలో ఏ ఇతర స్టార్టప్ కూడా నిధులు సేకరించి ఉండదు.


అదానీ గ్రూప్‌ మీద ఎందుకంత ప్రేమ?
అదానీ గ్రూప్‌లో షేర్లు కొన్న తర్వాత, ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూతో రాజీవ్ జైన్ మాట్లాడారు. అదానీ గ్రూప్‌లో తాను ఎందుకు పెట్టుబడులు పెట్టారో వివరించారు. అదానీ గ్రూప్‌నకు అద్భుతమైన ఆస్తులు ఉన్నాయని, అవి చాలా ఆకర్షణీయమైన విలువలతో లభిస్తున్నాయని అన్నారు. గత ఐదేళ్లుగా అదానీ గ్రూప్ స్టాక్స్‌పై ఒక కన్నేసి ఉంచారట. అయితే గ్రూప్ షేర్ల వాల్యుయేషన్‌ ఎక్కువగా ఉందని అప్పుడేమీ షేర్లు కొనలేదట. భారతదేశ విమాన ట్రాఫిక్‌లో 25 శాతం అదానీ విమానాశ్రయానిదేనని, దేశవ్యాప్త కార్గో పరిమాణంలో 25 నుంచి 40 శాతం అదానీ ఓడరేవులదేనని వివరించారు. తన ప్రస్తుత పెట్టుబడి సరైందేనని రుజువవుతుందని రాజీవ్ జైన్ ఆశాభావం వ్యక్తం చేశారు.


దూసుకెళ్లిన అదానీ గ్రూప్‌ స్టాక్స్‌
అదానీ గ్రూప్‌లో రాజీవ్ జైన్ కొనుగోళ్ల తర్వాత అదానీ స్టాక్స్‌ దూసుకుపోయాయి, గరిష్టంగా లాభపడ్డాయి. అదానీ గ్రూప్‌ మార్కెట్ క్యాప్ ఒక్క రోజులో దాదాపు రూ. 70,000 కోట్లు పెరిగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.