LPG Gas Cylinder Price May Fall: సెప్టెంబర్‌లో నెల మీకు తీపి కబురు చెప్పడానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ మొదటి రోజున (01 September 2024), దేశంలో సామాన్య ప్రజలందరూ గుడ్‌న్యూస్ వినే ఛాన్స్ ఉంది. సామాన్యులకు ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తెస్తుందన్న వార్తలు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సెప్టెంబర్ ఒకటో తేదీన, ఎల్‌పీజీ సిలిండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద బహుమతి ఇవ్వొచ్చు. గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ (Domestic LPG Cylinder) & వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ (Commercial LPG Cylinder) ధరలను సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించవచ్చు.
గ్యాస్ సిలిండర్ రేటు ఎంత తగ్గొచ్చు?
సెప్టెంబర్ మొదటి రోజున, దేశంలోని కోట్లాది మంది వినియోగదార్లకు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం ఇచ్చేలా, 14 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ రేటును 50 రూపాయలు తగ్గించొచ్చు. వాణిజ్య సిలిండర్ ధర కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ రేటు 60 రూపాయల నుంచి 70 రూపాయల వరకు తగ్గనున్నట్లు నేషనల్ మీడియా రిపోర్ట్ చేసింది.
LPG సిలిండర్ ధర 50 రూపాయలు తగ్గితే, మీరు దానిని 760 రూపాయలకే కొనుగోలు చేయొచ్చు. సబ్సిడీ సిలిండర్‌ను మీరు 460 రూపాయలకే ఇంటికి తీసుకెళ్లొచ్చు. పీఎం ఉజ్వల యోజన (Pradhan Mantri Ujjwala Yojana - PMUY) కింద ఒక్కో వంట గ్యాస్ సిలిండర్‌పై ఇప్పటికే రూ. 300 సబ్సిడీ లభిస్తోంది. ఏజెన్సీ నుంచి సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు పూర్తి ధర చెల్లించాలి, కొన్ని రోజుల తర్వాత రూ. 300 సబ్సిడీ డబ్బు లబ్ధిదారు బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. దేశంలో కోట్ల మంది ప్రజలు ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఆగస్టు ప్రారంభంలో పెరిగిన రేటు
ఆగస్టు ప్రారంభం (01 August 2024) నుంచి 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ల ధర 8 నుంచి 9 రూపాయల వరకు పెరిగింది. దీనికి ముందు, కమర్షియల్ సిలిండర్ల రేటు వరుసగా నాలుగు నెలల పాటు తగ్గింది. అయితే, గత కొన్ని నెలలుగా గృహావసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్‌లో, గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ (Domestic Gas Cylinder Price In Hyderabad) సుమారు రూ. 855 ధర పలుకుతోంది. విజయవాడ (Domestic Gas Cylinder Price In Vijayawada) సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇదే ధరకు సిలిండర్ అందుబాటులో ఉంది.
పెట్రోల్ & డీజిల్ కూడా చౌకగా మారొచ్చు!
భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెట్రోల్ & డీజిల్ ధరలను తగ్గిస్తూ సెప్టెంబర్ 01న నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతం, దేశంలోని చాలా నగరాల్లో లీటరు పెట్రోల్ ధర 100 రూపాయలపైనే ఉండగా, లీటర్ డీజిల్ రేటు 90 రూపాయలు దాటింది. సెప్టెంబర్ నుంచి, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 6 రూపాయలు, డీజిల్‌పై 5 రూపాయలు తగ్గించే ఛాన్స్ ఉంది.
అయితే, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు విషయంపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే, సాధారణ ప్రజలు చాలా ఉపశమనం పొందుతారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తక్కువగా ఉండటం వల్ల గ్యాస్ & పెట్రో రేట్లు తగ్గుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరో ఆసక్తికర కథనం: స్పైస్‌జెట్ ఉద్యోగులకు 3 నెలలు జీతం కట్, బలవంతంగా సెలవులు