RBI Gold Reserves: గత కొన్ని నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నా, పసిడి కొనుగోళ్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దూకుడు చూపిస్తోంది, ఒక బంగారు గనిలా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో (February 2023), 3 టన్నుల బంగారాన్ని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసింది. దీంతో, RBI వద్ద బంగారం నిల్వలు 790.2 టన్నులకు (Gold Reserves at RBI) పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్‌ వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.


ఆర్‌బీఐ దగ్గర 8 శాతం బంగారం                   
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council) లెక్క ప్రకారం... ఫిబ్రవరి నెలలో బంగారం కొనుగోలు తర్వాత, ప్రపంచంలోని మొత్తం బంగారం నిల్వల్లో 8 శాతం ఇప్పుడు భారత్‌ వద్ద ఉంది. డేటా ప్రకారం, 2022 మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి కాలం) ముగింపు నాటికి భారతదేశం వద్ద మొత్తం 760.42 టన్నుల బంగారం ఉంది. రెండో త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌ కాలం) ముగింపు నాటికి 767.89 టన్నులు, మూడో త్రైమాసికం (జులై - సెప్టెంబర్‌ కాలం) ముగింపు నాటికి 785.35 టన్నులు, 2022 నాలుగో త్రైమాసికం (అక్టోబర్‌ - డిసెంబర్‌ కాలం) ముగింపు నాటికి 787.40 టన్నుల నిల్వలు ఉన్నాయి. అంటే, గత ఏడాది కాలంలోనే దాదాపు 30 టన్నుల బంగారాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసింది.


మెరుగైన రాబడి & సురక్షితమైన పెట్టుబడి                      
ప్రపంచ ఆర్థిక వృద్ధిలో మందగమనం కారణంగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్‌లో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మెరుగైన రాబడి & సురక్షితమైన పెట్టుబడి కోసం గోల్డ్‌ మీద ఆర్‌బీఐ ఫోకస్‌ పెట్టింది, బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేసింది. 2020 జూన్ - 2021 మార్చి మధ్య కాలంలో 33.9 టన్నుల బంగారాన్ని ఆర్‌బీఐ కొనుగోలు చేసింది. 2021-22లో, దీనికి దాదాపు రెట్టింపు, అంటే 65 టన్నుల బంగారాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసింది. 2020 ఏప్రిల్ - 2022 సెప్టెంబర్ మధ్య కాలంలో ఏకంగా 132.34 టన్నుల బంగారాన్ని బయ్‌ చేసింది. ఇదే సమయంలో, దేశంలోని మొత్తం భారతీయుల వద్ద కలిపి దాదాపు 25,000 టన్నుల పసిడి పోగు పడి ఉంది.


45.20 బిలియన్ డాలర్ల విలువైన బంగారం                             
ఆర్‌బీఐ వద్ద ఉన్న బంగారాన్ని డాలర్లలోకి మార్చి చూస్తే, ఆ పసిడి విలువ 45.20 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఆర్‌బీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం... దేశంలో పసిడి విలువ భారీగా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం మాత్రమే కాదు, రిజర్వ్‌ బ్యాంక్‌ చేపట్టిన ఇలాంటి భారీ కొనుగోళ్లు కూడా కారణమే. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనత కారణంగా కూడా బంగారం ధర పెరిగింది. 


ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రపంచవ్యాప్తంగా అన్ని సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లు చేపడుతున్నాయి. ఈ ఎపిసోడ్‌లో RBI కూడా భాగమైంది.