Gold Loan Interest Rate: బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే అన్ని రుణాల కంటే, బంగారం మీద తీసుకునే రుణం చాలా మెరుగైన ఎంపిక. ఎందుకంటే, గోల్డ్ లోన్ మీద ఇతర రుణాల కంటే తక్కువ వడ్డీ రేటు ఉంటుంది, సులభంగా లోన్ దొరుకుతుంది.
బంగారాన్ని తనఖా పెట్టుకుని ఇచ్చే రుణాలను సురక్షిత రుణంగా బ్యాంకులు పరిగణిస్తాయి. అయితే, బంగారం ప్రస్తుత విలువను లెక్కించిన తర్వాత మాత్రమే రుణ మొత్తాన్ని మంజూరు చేస్తాయి. తక్కువ వడ్డీ రేట్లకు బంగారం రుణాలు ఇస్తున్న ఐదు బ్యాంకుల సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. మీ అనుకూలతను బట్టి వీటిలో ఒకదాన్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు.
ఏయే బ్యాంకులు చౌకగా బంగారు రుణాలు అందిస్తున్నాయి?
HDFC బ్యాంక్ బంగారం రుణం మీద 7.20 శాతం నుంచి 16.50 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజుగా రుణం మొత్తంలో 1 శాతం తీసుకుంటోంది.
కోటక్ మహీంద్ర బ్యాంక్ బంగారం రుణం మీద 8% నుంచి 17% వడ్డీని వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఛార్జీగా 2% మొత్తాన్ని, దీనిపై GSTని తీసుకుంటోంది.
సౌత్ ఇండియన్ బ్యాంక్ 8.25 శాతం నుంచి 19 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తోంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.45 శాతం నుంచి 8.55 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది. మంజూరు చేసిన రుణంలో 0.5 శాతాన్ని ప్రాసెసింగ్ ఛార్జీగా తీసుకుంటోంది.
ఫెడరల్ బ్యాంక్ బంగారం రుణం మీద 9.49 శాతం వడ్డీని వసూలు చేస్తోంది.
ఒకవేళ మీరు రైతు అయితే, మీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని బ్యాంక్‌లో చూపిస్తే, మీరు తీసుకునే బంగారం రుణంపై వడ్డీ ఇంకా తగ్గుతుంది.
గోల్డ్ లోన్ మొత్తం
ఏ బ్యాంకు అయినా, బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకునే వినియోగదార్లకు, మొత్తం బంగారం విలువలో 75 శాతం నుంచి 90 శాతాన్ని రుణంగా ఇస్తుంది. ఈ పరిధిలో, మీ అవసరాన్ని బట్టి మీకు ఎంత రుణం కావాలో తీసుకోవచ్చు.
గోల్డ్ లోన్ కాల వ్యవధి - తిరిగి తీర్చే పద్ధతులు
సాధారణంగా, బంగారం రుణాన్ని తిరిగి తీర్చడానికి ఒక ఏడాది కాల వ్యవధిని మాత్రమే బ్యాంకులు ఇస్తాయి. మీ దగ్గర డబ్బులు ఉంటే, ఈ కాల గడువు కంటే ముందే అప్పు తీర్చేయవచ్చు. తద్వారా వడ్డీ మొత్తం తగ్గుతుంది. మొత్తం రుణాన్ని ఒకేసారి చెల్లించలేకపోతే, మీకు వీలయినప్పుడల్లా కొంత మొత్తం మొత్తం చొప్పున రుణం ఖాతాలో జమ చేసుకుంటూ వెళ్లి ఏడాదిలోగా మొత్తం తీర్చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. ఒకవేళ ఏడాది లోపు మీరు గోల్డ్ లోన్ తీర్చలేకపోతే, దానిని రెన్యువల్ చేయించాల్సి ఉంటుంది. అంటే, ఆ ఏడాది మీరు రుణం తీర్చి, మళ్లీ కొత్త రుణం తీసుకున్నట్లుగా బ్యాంకులు అదే రుణాన్ని రెన్యువల్ చేస్తాయి. మొదటి ఏడాదికి వడ్డీతో పాటు మళ్లీ అన్ని రకాల ఛార్జీలను వసూలు చేస్తాయి.
గోల్డ్ లోన్ తీర్చడానికి ఇంకో మార్గం కూడా ఉంది. తొలి ఏడాదిలో మీరు తీసుకున్న మొత్తంలో కొంతమేర చెల్లించి, మిగిలిన మొత్తాన్ని కొత్త లోన్ తీసుకున్నట్లుగా రెండో ఏడాది కోసం రెన్యువల్ చేయించుకోవచ్చు. ఉదాహరణకు మీరు రూ. లక్ష రుణం తీసుకుంటే, ఏడాది ముగిసేనాటికి మీరు 50 వేలు చెల్లించాలని భావిస్తే అంత మొత్తమే చెల్లించవచ్చు. మిగిలిన రూ. 50 వేలను కొత్త లోన్ రూపంలో బ్యాంక్‌లు రెన్యువల్ చేస్తాయి. అంటే, రెండో ఏడాదిలో, ఆ రూ. 50 వేలు, దాని మీద వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.
అదనపు రేట్లపై ఆరా తీయండి
మీరు గోల్డ్ లోన్ తీసుకోబోతున్నట్లయితే, ఆ బ్యాంక్ ఇస్తున్న వడ్డీ ఆఫర్ ఏమిటో ముందుగా తెలుసుకోండి. దీంతో పాటు, రుణంపై వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు, పేపర్ వర్క్, ఆలస్య చెల్లింపుపై జరిమానా వంటి ఇతర ఛార్జీలు గురించి కూడా తెలుసుకోవడం ముఖ్యం.