Gold Price May Cross Rs 80000: బంగారం సాధారణ భారతీయుడికి అందనంత ఎత్తుకు ఎదిగింది, సరికొత్త జీవితకాల రికార్డ్ స్థాయికి చేరింది. పెరుగుతున్న పడిసి రేట్లను చూసి మదుపర్లు సంబరపడుతుంటే, పండుగ సీజన్‌లో నగలు కొనేదెట్లా అంటూ ప్రజలు డీలా పడుతున్నారు.
పండగ సీజన్ డిమాండ్, అమెరికాలో వడ్డీ రేట్ల కోత ప్రభావం పుత్తడిపై కనిపిస్తోంది. అంతర్జాతీయ & దేశీయ మార్కెట్లలో ఎల్లో మెటల్ ప్రకాశం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం, దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం (24 కేరెట్లు) ధర రూ.77,000 దాటింది.
మంగళవారం, అమెరికన్ మార్కెట్‌లో స్పాట్ & ఫ్యూచర్ డీల్స్ రెండింటిలోనూ గోల్డ్ రేటు విపరీతంగా పెరిగింది. US గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఔన్సుకు (28.35 గ్రాములు) 2,661.60 డాలర్ల స్థాయికి పెరిగింది. ఆ ఎఫెక్ట్‌తో, ఇండియాలో బంగారం ధర 77 వేల రూపాయలను దాటి పెరిగింది.
వడ్డీ రేట్లు చౌకగా మార్చిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్
దేశీయ & అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడి సరికొత్త గరిష్ట స్థాయికి చేరడానికి కారణం అమెరికన్ కేంద్ర బ్యాంక్ అయిన 'ఫెడరల్ రిజర్వ్' (US FED). అమెరికాలో, ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ తగ్గింపులు ఈ ఏడాది చివర్లో, 2025లోనూ కొనసాగుతాయని హింట్ కూడా ఇచ్చింది. దీనివల్ల షేర్ల నుంచి బంగారం, క్రిప్టో వరకు వివిధ ఆస్తి తరగతులు ప్రయోజనం పొందుతున్నాయి. ఇటీవల, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ తన రేటును మార్కెట్ ఊహించిన (0.25 శాతం) పర్సెంటేజీ కంటే ఎక్కువగా, 0.50 శాతం తగ్గించింది.
మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్లు
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మరింత ముదిరి, లెబనాన్‌పై దాడుల వరకు పరిస్థితి వెళ్లింది. అంటే, ఉద్రిక్తతల స్థాయి నుంచి యుద్ధం స్థాయి వరకు పరిస్థితి క్షీణించింది. అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడులను రక్షించే సురక్షిత పెట్టుబడి సాధనం (సేఫ్ హెవెన్) గోల్డ్‌కు రిరాకీ పెరగడానికి ఇది కూడా ఒక కారణం.
బంగారం రేటు రూ.80 వేలకు చేరొచ్చు!
దేశీయంగా చూస్తే, మరికొన్ని రోజుల్లో పండుగల పరంపర ఊపందుకోనుంది. దరసా నవరాత్రులు, ఆ తర్వాత దీపావళి, దంతేరస్ వంటి పండుగలు వస్తున్నాయి. ఈ సీజన్‌లో భారతీయులు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. పండుగల శుభ సందర్భాల్లో కనీసం ఒక గ్రాము బంగారమైనా కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఇది కాకుండా... నవరాత్రుల తర్వాత దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అవుతుంది. పెళ్లిళ్ల సీజన్ (Wedding season 2024) సాంప్రదాయకంగా బంగారం కొనుగోళ్లు & ధరలు పెరిగే కాలం. ఈసారి కూడా వెడ్డింగ్ సీజన్‌లో బంగారానికి భలే గిరాకీ ఉంటుందని అంచనా. ఈ కారణాల వల్ల రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు రూ.80,000 స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరో ఆసక్తికర కథనం: భయంకరంగా పెరిగిన పుత్తడి, రూ.లక్ష పైన వెండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి