Global Economy:


ప్రపంచ వ్యాప్తంగా ఆహారం, విద్యుత్‌, ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒకవైపు ఆర్థిక మాంద్యం (Economy Slowdown) భయాలు వెంటాడుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఫలితంగా అన్ని దేశాల్లోనూ ద్రవ్యోల్బణం (Inflation) పైకి చేరింది. కేంద్ర బ్యాంకులు రెపోరేట్లు తగ్గించే పరిస్థితే కనిపించడం లేదు. రెండు నెలలు ఉపశమనం లభించినా అమెరికా (US Inflation), ఐరోపాలో (Euro Inflation) మళ్లీ ప్రధాన ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పుతోంది.


ఫెడరల్‌ రిజర్వు ప్రకారం అమెరికాలో ధరలు గతేడాదితో పోలిస్తే 5.4 శాతం పెరిగాయి. ప్రధాన ద్రవ్యోల్బణం 4.7 శాతం పెరిగింది. ఐరోపాలో ప్రధాన ఉత్పత్తుల ధరలు రికార్డులు స్థాయిలో 5.3 శాతానికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్‌, న్యూజిలాండ్‌లోనూ ఇదే పరిస్థితి. అయితే వేగంగా అభివృద్ధి చెందుతున్న మెక్సికో, బ్రెజిల్‌, మలేసియా వంటి దేశాల్లో తగ్గుదల కనిపించడం సంతోషకరం.


జనవరి నెలలో ఎవరూ ఊహించని విధంగా వినియోగదారులు అనూహ్యంగా కొనుగోళ్లు చేపట్టారని అమెరికా ఫెడరల్‌ రిజర్వు తెలిపింది. ఇది వడ్డీరేట్లు పెంచాల్సిన ఒత్తిడి కల్పించింది. ఇక వ్యాపార కార్యకలాపాలు బాగానే సాగుతున్నాయి. ఫిబ్రవరిలో సేవల రంగంలో మెరుగుదల కనిపించింది. కొనుగోలు శక్తిని పెంచింది. 


ఐరోపాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జనవరిలో ఊహించన విధంగా ద్రవ్యోల్బణం పెరిగిందని యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు వెల్లడించింది. వచ్చే నెలలో మరో 50 బేసిస్‌ పాయింట్ల మేర రెపోరేట్లు పెంచుతామని సూచించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో కొన్ని తరాల తర్వాత ధరలు షాకిస్తున్నాయని పేర్కొంది. బ్రిటన్‌ గతేడాది ఎన్నడూ లేనంత వేగంగా వలసదారులకు వీసాలు ఇచ్చింది. చదువుకొనేందుకు విద్యార్థులు వస్తున్నారు. పనిచేసే ఉద్యోగులూ పెరిగారు. ఫలితంగా ఆహార పదార్థాలకు డిమాండ్‌ పెరిగింది.


ఫిబ్రవరిలో మెక్సికో ద్రవ్యోల్బణం ఊహించిన దానికన్నా ఎక్కువే తగ్గింది. దాంతో వడ్డీరేట్ల భారం తగ్గించేందుకు విధాన రూపకర్తలకు కాస్త అవకాశం దొరికిందని అనుకుంటున్నారు. వరుసగా తొమ్మిదో నెలలోనూ ఇక్కడ ద్రవ్యోల్బణం తగ్గింది. జనవరిలో మలేసియా ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఇలా జరగడం ఇది రెండోసారి. బహుశా వడ్డీరేట్ల పెంపు నుంచి ఉపశమనం దొరకొచ్చు. ఇక జపాన్‌లోని భారీ ఆటోమొబైల్‌ పరిశ్రమలు వేతనాలు పెంచేందుకు అంగీకరించాయని తెలిసింది.


దశాబ్దాల తర్వాత ఇజ్రాయెల్‌లో వడ్డీరేట్ల పెంపు కొనసాగుతోంది. న్యూజిలాండ్‌ 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కొరియా సెంట్రల్‌ బ్యాంకు మళ్లీ రెపోరేటు పెంపునకు సిద్ధమవుతోంది. భారీ భూకంపం తర్వాత వడ్డీరేట్లు స్వల్పంగా తగ్గించి టర్కీ ఊరటనిచ్చింది. ఇక భారత్‌లో రిజర్వు బ్యాంకు లక్షిత ద్రవ్యోల్బణం 6 శాతం కన్నా కాస్త అధికంగా ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.