Delhi Liquor Policy Case:


విచారణకు హాజరు..


ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాను మరోసారి విచారిస్తోంది సీబీఐ. వారం రోజుల కిందటే విచారణకు పిలుపు వచ్చినప్పటికీ గడువు కోరారు సిసోడియా. రాష్ట్ర బడ్జెట్ తయారు చేసే పనిలో ఉన్నానని, అది పూర్తయ్యే వరకూ గడువు ఇవ్వాలని అడిగారు. ఈ మేరకు సీబీఐ విచారణ తేదీని ఇవాళ్టికి (ఫిబ్రవరి 26) మారింది. లిక్కర్ స్కామ్‌ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సిసోడియా. ఇప్పటికే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది. అయితే...సీబీఐ ఛార్జ్‌షీట్‌లో నిందితుల జాబితాలో సిసోడియా పేరు లేదు. కానీ...కచ్చితంగా మనీ లాండరింగ్ జరిగిందని తేల్చి చెబుతోంది. సిసోడియా మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టి పారేస్తున్నారు. తన ఇంట్లోనూ, బ్యాంక్‌ లాకర్‌లోనూ తనిఖీలు చేశారని, కానీ వాళ్లకు ఏ ఆధారాలూ లభించలేదని తేల్చి చెప్పారు. ఢిల్లీ విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నానని వెల్లడించారు. ఈ అభివృద్ధిని ఆపేయాలన్న దురుద్దేశంతోనే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఆరోపణలపై స్పందించారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో ఎలాంటి స్కామ్‌లు జరగలేదని తేల్చి చెప్పారు. ఇది కేవలం మనీశ్ సిసోడియాపై కుట్ర అని అన్నారు. ప్రస్తుతం సిసోడియా సీబీఐ విచారణకు హాజరైన క్రమంలో త్వరలోనే ఆయనను అధికారులు అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని కేజ్రీవాల్ కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. త్వరలోనే ఆయన జైలు నుంచి విడుదలవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ట్విటర్‌లో ఓ పోస్ట్ కూడా చేశారు. 


"మనీశ్...మీకు భగవంతుడు తోడుగా ఉన్నాడు. లక్షలాది మంది విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీ వెంట ఉన్నాయి. దేశం కోసం, సమాజ ఉన్నతి కోసం జైలుకు వెళ్తున్నారు. జైలుకు వెళ్లినంత మాత్రాన అవినీతికి పాల్పడినట్టు కాదు. దీన్ని ఓ గౌరవంగా భావించండి. మీరు త్వరలోనే జైలు నుంచి విడుదవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు మొత్తం ఢిల్లీ పౌరులు మీ కోసం ఎదురు చూస్తుంటారు" 


-అరవింద్‌ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 






అంతకు ముందు మనీశ్ సిసోడియా ఓ ట్వీట్ చేశారు. CBI విచారణకు హాజరవుతున్నట్టు చెప్పారు. 


"ఇవాళ మరోసారి CBI విచారణకు హాజరవుతున్నాను. విచారణలో భాగంగా అధికారులకు పూర్తిగా సహకరిస్తాను. నెలల పాటు నన్ను జైల్లో పెట్టినా నేను లెక్క చేయను. నేను భగత్ సింగ్ ఫాలోవర్‌ని. దేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించారు. తప్పుడు కేసుల కారణంగా జైలుకు వెళ్లడం పెద్ద విషయమే కాదు" 


-మనీశ్ సిసోడియా, ఢిల్లీ డిప్యుటీ సీఎం