India GDP Data: ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతం చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం, జీడీపీ వృద్ధి రేటు అంచనాల కంటే మెరుగ్గా ఉంది. జనవరి-మార్చి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.1 శాతం చొప్పున వృద్ధి చెందింది. దీంతో, మొత్తం 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదైంది, సూపర్‌ స్పీడ్‌ ఎకానమీగా నిలిచింది.


అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2021-22లో GDP రేటు 9.1 శాతంగా ఉంది. అదే ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి కాలంలో 4 శాతం వృద్ధి రేటు నమోదైంది.


జీడీపీ వేగం బాగా పెరిగింది
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO), బుధవారం సాయంత్రం, GDP వృద్ధి రేటు డేటాను విడుదల చేసింది. డేటా ప్రకారం, మార్చి త్రైమాసికంలో, 6.1 శాతం వృద్ధితో భారత ఆర్థిక వ్యవస్థ పనితీరులో మంచి వేగం కనిపించింది. మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.1 శాతంగా ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్ అంచనా వేసింది. అంతకుముందు డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 4.5 శాతంగా ఉంది.


ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన అంచనాల్లో, 2022-23 ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 7 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేశారు. వాస్తవంగా, ఆ అంచనాలకు మించి 7.2 శాతం వృద్ధిని భారత్‌ సాధించింది.


తలసరి GDP
మార్చి త్రైమాసికంలో దాదాపు అన్ని రంగాలు మెరుగ్గా పని చేశాయి. వ్యవసాయ రంగం 5.5 శాతం వృద్ధిని నమోదు చేయగా, తయారీ రంగం 4.5 శాతం, గనులు 4.3 శాతంగా నమోదయ్యాయి. నిర్మాణ రంగం ఆకర్షణీయంగా 10.4 శాతం వృద్ధిని సాధించింది. 2022-23లో భారతదేశ తలసరి GDP రూ. 1,96,983గా ఉంది. రాబోయే నెలల్లో ఆర్థిక వృద్ధి వేగం మరింత పుంజుకునే అవకాశం ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు 13.1 శాతంగా ఉండవచ్చని NSO అంచనా వేసింది. గత అంచనా 13.2 శాతంగా ఉంది. అదే సమయంలో, జులై-సెప్టెంబర్‌లో వృద్ధి రేటు 6.2 శాతంగా ఉండవచ్చని అంచనా.


అధికారిక గణాంకాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 3.3 లక్షల కోట్ల డాలర్లకు (దాదాపు 272.41 లక్షల కోట్ల రూపాయలు) చేరింది. భారత ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ఇది సులభతరం చేస్తుందని ఎక్స్‌పర్ట్స్‌లు చెబుతున్నారు. అంతకుముందు, 2021-22లో ఇది 2.8 లక్షల కోట్ల డాలర్లుగా (234.71 లక్షల కోట్ల రూపాయలు) ఉంది. ఈ ప్రకారం, నామినల్‌ జీడీపీ గత అంచనా 15.4 శాతాన్ని మించి 16.1 శాతం వృద్ధి చెందిందని NSO వెల్లడించింది.


నిరాశపరిచిన ఆర్థిక లోటు గణాంకాలు 
జీడీపీ గణాంకాలను ఎన్‌ఎస్‌ఓ విడుదల చేయడానికి ముందే ఆర్థిక లోటు గణాంకాలు విడుదలయ్యాయి. ఆ లెక్కల ప్రకారం, 2022-23లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు GDPలో 6.4 శాతానికి సమానం. ఆర్థిక మంత్రిత్వ శాఖ 'సవరించిన అంచనాలు'లోనూ ఇదే ద్రవ్య లోటును లక్ష్యంగా పెట్టుకుంది. రూపాయల్లో చెప్పుకుంటే, ద్రవ్యలోటు రూ. 17,33,131 కోట్లుగా నమోదైంది. 2023-24లో ద్రవ్య లోటును GDPలో 5.9 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


గణాంకాల ప్రకారం, 2023 ఏప్రిల్ నెలలో ఆర్థిక లోటు రూ. 1.34 లక్షల కోట్లు. ఇది మొత్తం సంవత్సరం లక్ష్యంలో 7.5 శాతానికి సమానం. 2022 ఏప్రిల్‌లో నమోదైన ఆర్థిక లోటు, ఆ మొత్తం ఏడాది లక్ష్యంలో 4.5 శాతంగా ఉంది. ఇప్పుడు ఆ లోటు పెరిగింది.


తగ్గిన పరిశ్రమల వృద్ధి 
 ఏప్రిల్ నెలలో పారిశ్రామికోత్పత్తికి ఎదురుదెబ్బ తగిలింది. ఆ నెలలో, 8 ప్రధాన పరిశ్రమల వృద్ధి రేటు వార్షిక ప్రాతిపదికన 3.5 శాతంగా ఉంది. మార్చి నెలలో ఈ సూచీ 3.6 శాతంగా నమోదైంది. మొత్తం 2022-23 ఆర్థిక సంవత్సరంలో, ఎనిమిది ప్రధాన పరిశ్రమలు 7.7 శాతం చొప్పున వృద్ధి చెందాయి. 2021-22లో ఈ రేటు 10.4 శాతంగా ఉంది.


మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: జెట్‌ స్పీడ్‌లో పెరిగిన సూపర్‌ స్టాక్స్‌, మళ్లీ ఇదే రిపీట్‌ అవ్వొచ్చు!