Adani Stock Sale: 


బిలియనీర్‌ గౌతమ్ అదానీ మళ్లీ దూకుడు కనబరుస్తున్నారు. మూడు కంపెనీల్లో వాటాలు అమ్మడం ద్వారా రూ.11,330 కోట్లు (1.38 బిలియన్‌ డాలర్లు) సమీకరించారు. మొత్తం నాలుగేళ్లలో వివిధ ఇన్వెస్టర్ల నుంచి తొమ్మిది బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడి సేకరించారు.


'పదేళ్ల పారదర్శక పెట్టుబడి నిర్వహక ప్రణాళిక అమలుకు మేం కట్టుబడ్డాం. ఇందులో భాగంగా మా కంపెనీల్లో కొంత వాటాను విక్రయించాలని 2016లోనే ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ మధ్య కాలంలో మూడు కంపెనీల్లో వాటాల విక్రయం ద్వారా అదానీ కుటుంబం రూ.11,330 కోట్ల మేర సేకరించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ లిమిటెడ్‌లో వాటాలు అమ్మేసింది' అని కంపెనీ తెలిపింది.


'వాటాల అమ్మకం ద్వారా గ్రూప్‌ స్థాయిలో అధిక మూలధనం అందుబాటులో ఉంటుంది. దీనిని రాబోయే 12-18 నెలల్లో అప్పులు తీర్చేందుకు, అభివృద్ధి కోసం వినియోగిస్తాం' అని అదానీ గ్రూప్‌ వెల్లడించింది. కాగా షేర్‌ సేల్‌కు మూడు కంపెనీల బోర్డులు ఆమోదం తెలిపాయి. మార్కెట్లో గ్రూప్‌ పేరు ప్రతిష్ఠలు మళ్లీ పెరుగుతాయని భావిస్తోంది. వాటాల విక్రయం ద్వారా  అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.12,500 కోట్లు, అదానీ ట్రాన్స్‌మిషన్‌ రూ.8500 కోట్లు, అదానీ రెన్యూవబుల్‌ ఎనర్జీ కంపెనీ రూ.12,300 కోట్లు సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.


హిండెన్‌ బర్గ్‌ నివేదికతో అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువలో చాలా వరకు నష్టపోయింది. రూ.20,000 కోట్ల ఫాలో ఆన్‌ ఆఫర్‌నూ నిలిపివేసింది. పెట్టుబడిదారులు పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ చేసినప్పటికీ  తిరిగి వారికి డబ్బులు చెల్లించేసింది. అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఎలాంటి పొరపాట్లు జరగలేదని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నివేదిక ఇవ్వడంతో మళ్లీ కంపెనీ షేర్లు పుంజుకున్నాయి. అమెరికాకు చెందిన జీక్యూజీ పాట్నర్స్‌ రూ.15,446 కోట్ల పెట్టుబడి పెట్టింది. మరికొన్ని రోజులకే రెండోసారీ ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం.


ప్రస్తుతం అదానీ గ్రూప్‌ల అతిపెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. అతిపెద్ద గ్లోబల్‌ ఇన్వెస్టర్లు తమ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం తమపై నమ్మకం, ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని అదానీ గ్రూప్‌ వెల్లడించింది. 


ఈ ఏడాది జనవరి 24న, గౌతమ్ అదానీ కంపెనీపై అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ ఒక నివేదిక విడుదల చేసింది. అందులో అదానీ గ్రూప్‌పై చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి గౌతమ్ అదానీ కంపెనీ షేర్లు భారీగా పతనమై, మార్కెట్ విలువ క్షీణించింది. దీంతో పాటు, గౌతమ్ అదానీ నికర విలువ కూడా కుప్పకూలింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ రిపోర్ట్‌ రావడానికి ముందు ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్న అదానీ, అక్కడి నుంచి ఒక్క నెల రోజుల్లోనే 36 వ స్థానానికి పడిపోయారు. ఆ తర్వాత అదానీ గ్రూప్ చాలా వరకు కోలుకుంది.


భారతదేశం, ఆసియాలో రెండో అత్యంత సంపన్న వ్యక్తి అయిన గౌతమ్ అదానీ తన కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో 07 జూన్‌ 2023 ఒక్క రోజే 52.5 మిలియన్ డాలర్లు సంపాదించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ‍‌(Bloomberg Billionaires Index) ప్రకారం, ఇప్పుడు గౌతమ్ అదానీ ఆస్తుల విలువ (Gautam Adani Net Worth) 62.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే, ఈ ఏడాది గౌతమ్ అదానీ ఆస్తిలో 58.2 బిలియన్ డాలర్లు కరిగిపోయింది.