Bloomberg Billionaires Index: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, అదానీ గ్రూప్ సంస్థల (Adani Group of Companie) చైర్మన్ అయిన గౌతమ్ అదానీ ‍‌(Gautam Adani) మరోసారి సంపన్నుల జాబితా నుంచి ఒక స్థానం కిందకు జారారు. 


బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ (Amazon CEO Jeff Bezos) గౌతమ్ అదానీని దాటి మళ్లీ మూడో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ నాలుగో స్థానానికి దిగి వచ్చారు.


బిలియనీర్ల జాబితాలో తగ్గిన అదానీ స్థాయి 
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, గౌతమ్ అదానీ ఆస్తులు ఇప్పుడు 120 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (2023 జనవరి 1-24 తేదీల మధ్య) ఆయన నికర సంపద విలువ 683 మిలియన్‌ డాలర్ల మేర తగ్గింది. కేవలం గత 24 గంటల్లోనే 872 మిలియన్‌ డాలర్ల విలువను కోల్పోయారు. అందవల్లే కుబేరుల లిస్ట్‌లో కింద పడ్డారు. మరోవైపు.. జెఫ్ బెజోస్ ఆస్తులు ప్రస్తుతం 121 బిలియన్ డాలర్లు. 2023లో ఇప్పటి వరకు, తన నికర విలువకు 13.8 బిలియన్‌ డాలర్లను ఆయన జోడించారు.


మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్
ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) 188 బిలియన్ డాలర్ల సంపదతో బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 2023లో ఇప్పటి వరకు, తన నికర విలువకు 26 బిలియన్‌ డాలర్లను ఆయన జోడించారు. ఆర్నాల్ట్‌ సంపదలో ఎక్కువ భాగం, అతని దిగ్గజ ఫ్యాషన్ కంపెనీ LVMH నుంచి వస్తోంది. LVMHలో ఆర్నాల్ట్‌కు 48% వాటా ఉంది. ప్యారిస్ కేంద్రంగా LVMH Moet Hennessy Louis Vuitton డిజైనర్ అప్పారెల్‌ పని చేస్తోంది. దీంతోపాటు, ఆర్నాల్ట్‌కు ఫైన్‌ వైన్స్‌, రిటైల్ బిజినెస్‌ కూడా ఉన్నాయి. ఆర్నాల్ట్ బ్రాండ్లను (Christian Dior, Fendi, Bulgari, Tiffany & Co., champagne house Moet & Chandon‌) సంపన్నుల మాత్రమే భరించగలరు. 


రెండో స్థానంలో మస్క్ మామ
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Tesla CEO Elon Musk) బిలియనీర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు, ఆయన నికర విలువ 145 బిలియన్‌ డాలర్లు. 2023లో ఇప్పటి వరకు, ఎలాన్ మస్క్ తన నికర విలువకు 8.21 బిలియన్‌ డాలర్లు జోడించారు. 2022లో ఎలాన్ మస్క్ నికర విలువలో అతి భారీగా క్షీణించింది. అందువల్లే, గత ఏడాది చివర్లో తొలి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయారు.


టాప్‌-10లో కనిపించని అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (Reliance Chairman Mukesh Ambani) బిలియనీర్ల జాబితా నుంచి మరింత పడిపోయి ఇప్పుడు 84.7 బిలియన్ డాలర్ల సంపదతో 12వ స్థానంలో నిలిచారు. అంటే, టాప్ 10 లిస్ట్ నుంచి బయటకి వచ్చేశారు. 


ఇటీవలి కాలంలో, స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు క్షీణించడంతో గౌతమ్‌ అదానీ, ముఖేష్‌ అంబానీ నికర సంపద విలువ తగ్గింది.


స్వాతంత్ర్యం తర్వాత రూపాయి-డాలర్‌ ప్రయాణం ఎలా సాగింది, రూ.83 స్థాయికి ఎందుకు పడింది?