Rupee-Dollar Value Since 1947: అమెరికాను ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా, అగ్రరాజ్యంగా పరిగణిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా. అగ్రరాజ్య ప్రభుత్వంతో పాటు, ఆ దేశ కరెన్సీ అయిన డాలర్ (Dollar) కూడా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను శాసిస్తుంది. అమెరికన్‌ డాలర్ కంటే విలువైన ఇతర దేశాల కరెన్సీలు కూడా ఉన్నాయి. అయినా, ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన కరెన్సీగా అమెరికన్‌ డాలర్‌ను లెక్కేస్తున్నారు. ప్రతి దేశం ఇతర దేశాలతో అమెరికన్‌ డాలర్లలో మాత్రమే వ్యాపారం చేస్తుంది. విదేశీ పెట్టుబడిదార్లు ఒక దేశంలో డాలర్ల రూపంలోనే పెట్టుబడులు పెడతారు. కాబట్టే, బెంచ్‌మార్క్ కరెన్సీగా డాలర్ చలామణీ అవుతోంది. ప్రపంచంలోని ఇతర కరెన్సీల విలువను కూడా ఇది నిర్ణయిస్తుంది. అదేవిధంగా మన దేశ రూపాయి విలువను కూడా డాలర్ మార్చేస్తుంది.


1947లో ఒక డాలర్ విలువ రూ.4.16
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 నుంచి, భారతీయ కరెన్సీని డాలర్‌తో కొలవడం ప్రారంభించారు. అంతకు ముందు బ్రిటిష్ పాలన కారణంగా పౌండ్‌తో రూపాయి విలువ లెక్కించే వాళ్లు. 1947లో ఒక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ 4 రూపాయల 16 పైసలుగా ఉంది. 1950 నుంచి 1966 వరకు డాలర్‌తో రూపాయి విలువ రూ. 4.76 గా ఉంది. ఆ తర్వాతి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ భారీగా క్షీణించడం, విదేశాల నుంచి తీసుకున్న అప్పులు పేరుకుపోవడం, 1962లో భారత్- చైనా యుద్ధం, 1965లో భారత్- పాకిస్థాన్ యుద్ధం, 1966లో తీవ్ర కరవు కారణంగా దేశానికి ఆర్థిక కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. దీంతో, ఒక డాలర్‌తో రూపాయి మారకపు విలువ 1967లో రూ. 7.50 కి దిగి వచ్చింది. ముడి చమురు సరఫరా సంక్షోభం కారణంగా 1974లో డాలర్‌తో రూపాయి విలువ రూ. 8.10 కి తగ్గింది. ఆ తరువాత దేశంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం, భారీగా విదేశీ రుణాలు తీసుకోవడంతో భారత కరెన్సీ భారీ స్థాయిలో పతనమైంది. అక్కడి నుంచి దశాబ్ద కాలం పాటు రూపాయి పతనం కొనసాగింది. 1990లో, ఒక డాలర్‌తో రూ. 17.50 స్థాయికి రూపాయి పడిపోయింది.


1990 తర్వాత భారీ పతనం
1990లో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది. భారతదేశానికి విదేశీ అప్పుల భారం ఎక్కువైంది. భారత ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 39 శాతం రుణాల మీద వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆర్థిక లోటు 7.8 శాతానికి చేరుకుంది. రుణాల ఎగవేతదారుగా (డిఫాల్టర్‌) మారే దశకు భారత్‌ చేరుకుంది. ఆ సమయంలో, ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో, 1991లో ఆర్థిక సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైంది. 1992లో డాలర్‌తో రూపాయి విలువ రూ. 25.92 కి పడిపోయింది. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక డాలర్‌ విలువ రూ. 45.32 గా ఉంది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది తర్వాత ఒక్క డాలర్ విలువ 63 రూపాయలుగా మారింది. ఆ తర్వాత కూడా రూపాయి బలహీనత కొనసాగింది. 2021లో ఒక డాలర్ విలువ రూ. 74.57 కి సమానమైంది.


2022లో రూపాయి బలహీనత
2022లో, ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి US సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే ప్రక్రియను ప్రారంభించింది. ఆ తర్వాత విదేశీ పెట్టుబడిదార్లు భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. ఆ విధంగా రూపాయి విలువ మరింత దిగజారింది. దీంతో పాటు, భారత దేశ విదేశీ మారకపు నిల్వలు 640 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయి నుంచి 530 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2022లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 10 శాతం పడిపోయింది, రూ. 83 కనిష్ట స్థాయికి చేరింది. 


ప్రస్తుతం ఒక డాలర్‌తో రూపాయి మారకపు విలువ రూ. 81.71 కి చేరువలో ఉంది.