FPIs Realty Stocks: విదేశీ ఫండ్ మేనేజర్ల చల్లని చూపు కారణంగా ఇండియన్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ మళ్లీ రాడార్‌లోకి వచ్చాయి. 2022 డిసెంబర్ 1-15 తేదీల మధ్య కాలంలో, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (foreign portfolio investors - FPIలు) 3,150 కోట్ల రూపాయలను, ప్రాపర్టీ డెవలపర్స్ షేర్లలోకి పంప్ చేశారు. ఈ కాలంలో, ఇండియన్ స్టాక్ మార్కెట్‌లోకి FPIలు తీసుకొచ్చిన మొత్తంలో ఇది ఏకంగా 35% లేదా మూడో వంతు భాగం.
FPIలు గత ఏడాది కాలంగా రియల్ ఎస్టేట్ స్టాక్స్‌ను స్థిరంగా అమ్ముకుంటూ వచ్చారు. ఈ రంగానికి సంబంధించి, గత 12 నెలల్లో 10 నెలలు నికర విక్రయదారులుగా (net sellers) ఊరేగారు, ఈ కాలంలో ₹6,055 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ షేర్లను విక్రయించారు. తాజాగా, రూటు మార్చారు, తిరిగి కొనడం మొదలు పెట్టారు.
రియల్ ఎస్టేట్ స్టాక్స్ మీద ఇష్టం ఎందుకు?
"నివాస, వాణిజ్య నిర్మాణ విభాగాల్లో డిమాండ్ పెరుగుతోంది. ఈ కారణం వల్ల రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడులను ఆకర్షిస్తోంది. డీఎల్‌ఎఫ్ (DLF), ఒబెరాయ్ (Oberoi), గోద్రెజ్ ప్రాపర్టీస్ (Godrej Properties) వంటి రియల్ ఎస్టేట్ మేజర్ల స్టాక్ ధరలు గత ఏడాది కాలంగా ఎదుగుబొదుగూ లేకుండా ఉన్నాయి. ఇప్పుడు వాటికి అవకాశాలు పెరుగుతున్నాయి" అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమార్ చెబుతున్నారు.
కోటక్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ ముర్తుజా ఆర్సివాలా లెక్క ప్రకారం... "మూడు లిస్టెడ్ REITలు (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు) వాటి ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్ గ్రోత్ ద్వారా FY2022 - FY2025 మధ్య కాలంలో 15-20% ఆదాయ వృద్ధిని అందిస్తాయి. పెద్ద ఐటీ కంపెనీల ఫిజికల్ ఆక్యుపెన్సీ, రిటర్న్ టు ఆఫీస్ స్ట్రాటజీలు పెరగడం వల్ల పెద్ద మొత్తంలో కమర్షియల్ స్పేస్ అవసరమవుతోంది. అందువల్లే పెట్టుబడిదారులు ఈ సెక్టార్ మీద దృష్టి సారిస్తున్నారు".
కన్జ్యూమర్ సర్వీసెస్ మీదా FPIల ఆసక్తి
2022 డిసెంబర్ 1-15 తేదీల మధ్య కాలంలో... రియల్ ఎస్టేట్ కాకుండా, కన్జ్యూమర్ సర్వీసెస్‌లోకి రూ. 2676 కోట్లు, FMCG షేర్లలోకి రూ. 2649 కోట్లు, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్‌లోకి రూ. 1984 కోట్ల పెట్టుబడులను FPIలు తీసుకొచ్చారు. గత ఐదు నెలలుగా కన్జ్యూమర్ సర్వీసెస్ షేర్లలో నెట్ బయ్యర్స్‌గా కొనసాగుతున్నారు. ఈ కాలంలో దాదాపు ₹14,000 కోట్లను ఈ ఒక్క విభాగంలోకే పంప్ చేశారు.
కొంత కాలంగా బ్యాంకులు, ఆర్థిక సేవల స్టాక్స్‌లోకి ₹14,205 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన విదేశీ మదుపుదారులు, మొదటిసారి, డిసెంబర్ మొదటి పక్షం రోజుల్లో ₹209 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
2022 డిసెంబర్ 15వ తేదీ నాటికి, FPIల కేటాయింపుల్లో అత్యధిక మొత్తం ఆర్థిక సేవల రంగానికి (32.69 శాతం) దక్కింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.