Rising Tomato, Onion Prices: మన దేశంలో సామాన్యుడి భోజనం బిల్లు మళ్లీ పెరిగింది, ముద్ద మింగుడు పడడం లేదు. పెరుగుతున్న కూరగాయల రేట్లతో ‍‌(vegetable prices in India) ఇటు శాఖాహారం, అటు మాంసాహారం రెండిటి బడ్జెట్‌ మారింది. నాన్‌-వెజ్‌ (non-veg) వండాలంటే టమాటాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, మిర్చి, కొత్తిమీర వంటి వెజిటేరియన్‌ పదార్థాలు ఉండాలి. కాబట్టి, మాంసాహారం కోసం చేసే ఖర్చు కూడా పెరిగింది.


పెరిగిన టమాటాలు, ఉల్లిపాయల ధరలు
క్రిసిల్‌ రోటీ రైస్ రేట్ ఇండెక్స్ (CRISIL's Roti Rice Rate Index) ప్రకారం, గత నెలలో (2023 నవంబర్‌) టమాటాలు, ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగాయి. క్రిసిల్‌ రీసెర్చ్‌ డేటాను బట్టి, గత నెలలో, ఇంట్లో వండే శాఖాహార వంటల బడ్జెట్‌ 10% పెరిగింది. అదే సమయంలో మాంసాహారం కోసం చేసే ఖర్చు 5% పెరిగింది. విడివిడిగా చూస్తే... నవంబర్‌ నెలలో ఉల్లిపాయల రేట్లు (Onion prices in India) 93% పెరిగాయి, టొమాటో ధరలు (Tomato prices in India) 15% పెరిగాయి. 


సాధారణ శాఖాహార భోజనం మరింత ప్రియం
ధరాఘాతం వల్ల... రోటీ, అన్నం, పప్పు, కూర, పెరుగుతో కూడిన సాధారణ శాఖాహార భోజనం తయారీ ఖర్చు గత సంవత్సరం నవంబర్‌ నెల (2022 నవంబర్‌) కంటే ఈ సంవత్సరం నవంబర్‌ నెలలో 9% పెరిగింది. పప్పులది వెజ్ థాలీ (veg thali) ధరలో 9% వాటా. వీటి రేటు కూడా గత సంవత్సరం కంటే ఇప్పుడు 21% పెరిగాయి, భోజనం భారాన్ని పెంచాయి.


మరో ఆసక్తికర కథనం: మీ ఆధార్‌ కార్డ్‌ డెడ్‌లైన్‌ అతి దగ్గర్లో ఉంది, గడువు దాటకముందే జాగ్రత్త పడండి


మాంసాహార ప్రియులకు కాస్త ఉపశమనం 
నాన్-వెజ్‌ భోజనం తయారీ ఖర్చుది కూడా ఇదే పంథా. రోటీ, అన్నం, పప్పు బదులు చికెన్ (బ్రాయిలర్), పెరుగుతో కూడిన సాధారణ మాంసాహార భోజనం ఖర్చు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగింది. అయితే, బ్రాయిలర్ చికెన్‌ రేట్లు తగ్గడం వల్ల, ఓవరాల్‌ రేటులో 5% పెరుగుదల మాత్రమే కనిపిస్తోంది. నాన్-వెజ్ థాలీ (non-veg thali) ధరలో బ్రాయిలర్‌ వాటా 50% ఉంటుంది. అందువల్లే, కూరగాయల రేట్లు పెరిగినా మాంసాహార ప్రియులకు ఉపశమనం దొరికింది.        


రేట్లు పెరగడానికి ప్రధాన కారణాలు
ఉల్లి, టమాటా ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు రెండు. 1. పండుగల సీజన్‌ కారణంగా డిమాండ్ పెరగడం, 2. సరైన వర్షాలు లేక ఖరీఫ్ సీజన్‌లో ఉత్పత్తి తగ్గడం.      


ఈ ఏడాది జనవరి-మే కాలంలో ఉల్లి, టొమాటోల రేట్లు తగ్గాయి, జులై-ఆగస్టులో పెరిగాయి. ఆగస్టు నెలలో టమాటా రేట్లు చుక్కల్లోకి చేరాయి, సామాన్య జనానికి పట్టపగలే చుక్కులు చూపించాయి. టమాటా రేట్ల వల్ల ఆ నెలలో శాఖాహార భోజనం తయారీ ఖర్చు 24% పెరిగింది. అదే సమయంలో మాంసాహార భోజనం తయారీ ఖర్చు 13% పెరిగింది.       


మరో ఆసక్తికర కథనం: కొత్త సిమ్‌ తీసుకోవాలంటే కొత్త రూల్స్‌, ఇకపై ట్రిక్స్‌ పని చేయవు