New Mobile Connection Rules: కొత్త మొబైల్ సిమ్ కార్డ్ (SIM Card) తీసుకోవాలంటే అతి త్వరలోనే రూల్స్ మారబోతున్నాయి. భారత టెలికాం మంత్రిత్వ శాఖ, కొత్త మొబైల్ కనెక్షన్ కొనుగోలు నిబంధనలను (New SIM Card Rules) మార్చింది. కొత్త రూల్స్ కొత్త సంవత్సరం నుంచి, అంటే 01 జనవరి 2024 నుంచి అమల్లోకి వస్తాయి.
పూర్తిగా పేపర్‌లెస్ ఈ-కేవైసీకి (Paperless e-KYC)
దేశంలో డిజిటలైజేషన్‌ను (Digitization) ప్రోత్సహించేందుకు టెలికాం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది, కొత్త సిమ్ కార్డు తీసుకునే విధానాన్ని పూర్తిగా పేపర్‌లెస్ ఈ-కేవైసీకి మారుస్తోంది. ప్రస్తుతం, ఒక వ్యక్తి కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలంటే దాని కోసం ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ అప్లికేషన్ ఫారంతో పాటు ఆధార్ కార్డ్ జిరాక్స్, ఫొటో ఇవ్వాలి. కొన్ని కంపెనీలు ఇప్పటికే పేపర్‌లెస్ విధానాన్ని ఫాలో అవుతున్నా, కొన్ని చోట్ల ఇప్పటికీ పేపర్ ఆధారిత అప్లికేషన్ విధానమే నడుస్తోంది. ఈ పద్ధతిని పూర్తిగా నిషేధించి, సంపూర్ణంగా డిజిటల్ కేవైసీకి మారాలన్నది టెలికాం మంత్రిత్వ శాఖ ఉద్దేశం.
కేవైసీ రూల్స్‌లో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల్లో భాగంగా, కొత్త రూల్ తీసుకువస్తున్నట్లు టెలికాం విభాగం (DoT) ఓ ప్రకటన విడుదల చేసింది. 2012 నుంచి అనుసరిస్తున్న పేపర్ విధానానికి ఇకపై చెల్లుచీటీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
మరో ఆసక్తికర కథనం: మహిళల కోసం గోల్డెన్ టిప్స్ - బంగారం, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ - ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?
ఇకపై అలాంటి ట్రిక్స్ పని చేయవు
డిజిటల్ కేవైసీకి (Digital KYC) మారడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. పేపర్ విధానాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు వందల సంఖ్యలో సిమ్ కార్డులు తీసుకుంటున్నారు. వాటిని అక్రమాలకు, అసాంఘిక కార్యక్రమాలకు, దేశ విద్రోహ చర్యలకు ఉపయోగిస్తున్నారు. పైగా, ఒక వ్యక్తికి తెలీకుండా అతని పేరిట సిమ్ కార్డులు పొందుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో, అమాయకులు పోలీసు కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది. పేపర్‌లెస్ ఈ-కేవైసీకి మారితే, అక్రమార్కుల ట్రిక్స్ పని చేయవు, ఇష్టం వచ్చినట్లు కొత్త సిమ్‌లు తీసుకోవడానికి వీలవదు.
2024 జనవరి 01 నుంచి, ఏ వ్యక్తయినా కొత్త సిమ్/మొబైల్ కనెక్షన్ తీసుకోవాలంటే, డిజిటల్ కేవైసీని పూర్తి చేయాలి. ఇది కాకుండా, పాత నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. ఒక వ్యక్తి ఒకేసారి ఎక్కువ సిమ్ కార్డులను కొనుగోలు చేయాలంటే, కమర్షియల్ కనెక్షన్ ద్వారా మాత్రమే పొందడానికి వీలవుతుంది. కొత్త సిమ్ కార్డ్ తీసుకునే సమయంలో, సిమ్ కార్డ్ కొనుగోలుదారుతో పాటు విక్రేత కూడా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
పేపర్‌లెస్ ఈ-కేవైసీ విధానం వస్తే, టెలికాం కంపెనీలకు పేపర్ ఖర్చు తగ్గుతుంది, వాటిని వెరిఫై చేసే సమయం మిగులుతుంది. టెలికాం మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు స్వాగతించాయి.
మరో ఆసక్తికర కథనం: జియోట్యాగింగ్ లేకుండా పన్ను మినహాయింపు రాదు, ఈ టెక్నాలజీని ఎలా వాడాలో తెలుసుకోండి