టీమిండియా యువ బ్యాటర్‌, స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌పై వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రయన్‌ లారా పొగడ్తల వర్షం కురిపించాడు. తన రికార్డులను బద్దలుకొట్టే సత్తా శుభ్‌మన్‌ గిల్‌కే ఉందని తేల్చేశాడు. రానున్న భవిష్యత్తులో గిల్‌ ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడని లారా  ప్రశంసల జల్లు కురిపించాడు. ఆధునిక తరం క్రికెటర్లలో గిల్‌ అత్యంత ప్రతిభావంతుడని కొనియాడాడు. తన ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టగల సత్తా కేవలం గిల్‌కు మాత్రమే ఉందంటూ అతడిని ఆకాశానికెత్తాడు.


2004లో ఇంగ్లాండ్‌తో టెస్టులో లారా అజేయంగా 400 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లోనూ అత్యధిక పరుగుల రికార్డు బ్రయాన్‌ లారా పేరిటే ఉంది. 1994లో డర్హమ్‌తో కౌంటీ మ్యాచ్‌లో వార్విక్‌షైర్‌ తరఫున లారా అజేయంగా 501 స్కోరు సాధించాడు. ఈ రికార్డులు దశాబ్దాలుగా అలాగే ఉన్నాయి. దీని దరిదాపుల్లోకి కూడా ఇప్పటివరకూ ఏ బ్యాట్స్‌మెన్‌ రాలేదు. ఇప్పుడు తన రికార్డులను బద్దలు కొట్టడం గురించి స్వయంగా లారానే స్పందించాడు. గిల్‌ మాత్రమే ఈ రికార్డులు బద్దలు కొట్టగలడని తేల్చేశాడు. 



 తన రెండు రికార్డుల్ని గిల్‌ బద్దలు కొట్టగలడని.. నవ తరం ఆటగాళ్లలో గిల్‌ అత్యంత ప్రతిభావంతుడని లారా అన్నాడు. రానున్న కాలంలో క్రికెట్‌ను శుభ్‌మన్‌ గిల్‌ శాసిస్తాడని.. చాలా పెద్ద రికార్డుల్ని తిరగ రాస్తాడని నమ్ముతున్నానని కొనియాడాడు. గిల్‌ ఇప్పటికే వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించాడని... ఐపీఎల్‌, ఐసీసీ టోర్నీల్లోనూ లో ఎన్నో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడాడని గుర్తు చేశాడు. తన మాటలు గుర్తు పెట్టువాలని.. రాసిపెట్టుకోండని కూడా లారా అన్నాడు. గిల్‌ ఒకవేళ కౌంటీ క్రికెట్‌ ఆడితే నా 501 నాటౌట్‌ రికార్డును.. అదే విధంగా టెస్టుల్లో నా అత్యధిక స్కోరు 400 పరుగులను దాటేస్తాడని అన్నాడు. భవిష్యత్తులో గిల్‌ కచ్చితంగా వీలైనన్ని ఎక్కువ ఐసీసీ టోర్నమెంట్లు గెలుస్తాడని లారా శుబ్‌మన్‌ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా సౌతాఫ్రికా టూర్‌లో భాగంగా గిల్‌ టీ20, టెస్టు సిరీస్‌ ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు.



ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌-2023లో సత్తా చాటాడు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో నాలుగు అద్భుత అర్ధ శతకాల సాయంతో 354 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్‌ డేవిడ్‌ మలాన్‌, టీమిండియా పేస్‌ స్టార్ మహ్మద్‌ సిరాజ్‌ను వెనక్కి నెట్టి... సెప్టెంబర్ నెలకు ఉత్తమ ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. సెప్టెంబర్‌ నెలలో గిల్‌ 80 సగటుతో 480 పరుగులు చేశాడు. సెప్టెంబర్‌లో ఆడిన ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ గిల్‌ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ర్యాంకింగ్స్‌లో గిల్ నంబర్‌వన్‌ స్థానం సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ను గిల్ వెనక్కి నెట్టేశాడు. ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్ 830 పాయింట్లతో ముందున్నాడు. ఇటీవ‌ల మంచి ఫామ్‌లో ఉన్న గిల్‌.. ఆ స్థానాన్ని ఆక్రమించిన నాలుగ‌వ ఇండియ‌న్ బ్యాట‌ర్‌గా నిలిచాడు. గ‌తంలో స‌చిన్ టెండూల్క‌ర్‌, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ మాత్రమే నెంబ‌ర్ వ‌న్ బ్యాట‌ర్ స్థానాన్ని ఆక్రమించారు. ఇక అతి తక్కువ ఇన్నింగ్స్‌ల పరంగా వేగంగా ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్ ధోని మొదటి స్థానంలో ఉన్నాడు. ధోని 38 ఇన్నింగ్స్‌ల్లోనే నంబర్ వన్ బ్యాటర్‌గా నిలవగా.. గిల్ 41 ఇన్నింగ్స్‌ల్లో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. అలాగే ఈ ఘనత దక్కించుకున్నఅతి పిన్న వేయస్కుడు కూడా గిల్లే.