FM Nirmala Sitharaman:
ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు సమావేశం అవుతున్నారు. భారత బ్యాంకింగ్ రంగంపై విస్తృత సమీక్ష నిర్వహిస్తున్నారు. వడ్డీరేట్ల పెంపుతో అంతర్జాతీయ ఆర్థిక రంగం ఒత్తిడిలో ఉంది. అమెరికా, యూరప్ బ్యాంకులు ఉన్నట్టుండి దివాలా తీస్తున్నాయి. 180కి పైగా అమెరికా బ్యాంకులు కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బ్యాంకింగ్ రంగంపై నిర్వహిస్తున్న మొదటి పూర్తి స్థాయి సమీక్ష ఇదే. ప్రొడక్టివ్ సెక్టార్లకు అడ్డంకుల్లేకుండా రుణాలు ఇవ్వడం సహా బడ్జెట్ ప్రతిపాదనలపై నేడు చర్చించనున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC), స్టాండప్ ఇండియా, ప్రధాన్ మంత్రి ముద్రా యోజన, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ సహా వివిధ పథకాల లక్ష్యాల పురోగతిని సమీక్షిస్తారు.
వచ్చే ఆర్థిక ఏడాది కోసం బ్యాంకుల ఆర్థిక సమ్మిళత్వం, రుణాల్లో వృద్ధి, ఆస్తుల నాణ్యత, మూలధన సేకరణ, వ్యాపార అభివృద్ధి ప్రణాళికలను నిర్మలా సీతారామన్ సమీక్షిస్తారని తెలిసింది. అలాగే బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల, మొండి బకాయిల వసూళ్ల గురించీ చర్చించనున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆస్తుల నాణ్యత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. ఫలితంగా స్థూల ఎన్‌పీఏ నిష్పత్తి బాగా తగ్గింది. 2018 మార్చిలో 14.6 శాతంగా ఉన్న నిష్పత్తి 2022 డిసెంబర్‌కు 5.53 శాతానికి తగ్గింది.
బ్యాంకుల పటిష్ఠత కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం 4R వ్యూహాన్ని అమలు చేస్తోంది. లక్షాలు పెట్టుకోవడం, మొండి బకాయిలను వసూలు చేయడం, మూలధన సేకరణ, ఆర్థిక రంగంలో సంస్కరణలను చేపట్టింది. బలహీనంగా ఉన్న బ్యాంకులను విలీనం చేసి పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేస్తోంది. విస్తృతంగా టెక్నాలజీని ప్రవేశపెడుతోంది. దాంతో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి కఠిన పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేలా బ్యాంకింగ్ రంగం మారింది.
ప్రభుత్వ సంస్కరణల వల్ల 2021-22లో రూ.66,543 కోట్లుగా ఉన్న మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం ఈ ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికానికి రూ.70,167 కోట్లకు పెరిగింది. 2018లో రూ.4.52 లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్ విలువ 2022, డిసెంబర్‌కు రూ.10.63 లక్షల కోట్లకు చేరుకుంది. అసెట్ క్వాలిటీ మెరుగవ్వడంతో ఏడాది కాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు లాభాల బాట పట్టాయి. రీరేటింగ్‌తో 50-150 శాతం మేర ర్యాలీ చేశాయి. నిఫ్టీ బ్యాంకు సూచీ అన్ని రంగాలను బీట్ చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.