RBI MPC Meeting February 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) మూడు రోజుల సమావేశం ఈ రోజు ‍(05 ఫిబ్రవరి 2025) ప్రారంభం అయింది. RBI కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. సంజయ్‌ మల్హోత్రా, 2024 డిసెంబర్‌లో, మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ స్థానంలో సీట్‌లోకి వచ్చారు. ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ఫలితాలను 07 ఫిబ్రవరి 2025, శుక్రవారం నాడు ప్రకటిస్తారు. దేశంలో రెపో రేట్‌ సహా కీలక ఆర్థికాంశాల్లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తారు. రెపో రేట్‌ను బట్టి బ్యాంక్‌ వడ్డీ రేట్లు మారతాయి. 

వడ్డీ రేటు తగ్గింపు అంచనాస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇటీవల ఇచ్చిన రిపోర్ట్‌ ప్రకారం, రెపో రేట్‌ తగ్గింపు చక్రంలో భాగంగా, మొత్తం 75 బేసిస్ పాయింట్లను (bps) ఆర్‌బీఐ తగ్గించవచ్చు. ఈ 75 bpsలో, ప్రస్తుత మీటింగ్‌లో కొంత తగ్గింపును, అక్టోబర్ 2025 సమావేశంలో మరికొంత తగ్గింపును ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఇక్రా (ICRA) రిపోర్ట్‌ను బట్టి, ఇప్పుడు రెపో రేట్‌ను తగ్గించకపోవచ్చు, వడ్డీ రేట్లను తగ్గించే నిర్ణయం ఏప్రిల్ లేదా జూన్ 2025 RBI MPC సమావేశాల వరకు వాయిదా పడవచ్చు. ఆ ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో, ప్రపంచ పరిణామాలు & డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనతను పరిగణనలోకి తీసుకుంటే, RBI తొందరపడి నిర్ణయం తీసుకోదు.

ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు గత నాలుగు సంవత్సరాలలోనే అత్యల్ప స్థాయిలో ఉంది. ద్రవ్యోల్బణం రేటు స్థిరంగా 5% పైనే ఉంది. 2024 డిసెంబర్‌లో జరిగిన చివరి RBI MPC సమావేశంలో, నగదు నిల్వ నిష్పత్తి (CRR)ని 50 బేసిస్ పాయింట్లు తగ్గించడం వల్ల బ్యాంకుల వద్ద ఎక్కువ నగదు అందుబాటులోకి వచ్చింది.      

ద్రవ్యోల్బణం అదుపులో ఉంది, ఆర్‌బీఐ జాగ్రత్తగా ఉందిరిజర్వ్ బ్యాంక్ ప్రధాన లక్ష్యం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, 2% నుంచి 6% పరిధిలో నిర్వహించడం. 2024 డిసెంబర్‌లో, రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.22 శాతానికి తగ్గింది, ఇది RBI నిర్దేశించిన పరిధిలోనే ఉంది. అయితే, RBI, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను 4.5% నుంచి 4.8%కి పెంచింది, ఇది ఆందోళన కలిగించే విషయం.     

శుక్రవారం కోసం ఎదురు చూస్తున్న స్టాక్‌ మార్కెట్‌భారత ప్రభుత్వం, బడ్జెట్‌ 2025 ద్వారా మధ్య తరగతి ప్రజలకు పన్ను ఉపశమనం ఇచ్చింది. దీనికి కొన్ని రోజుల ముందు, బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ. 1.5 లక్షల కోట్లను చొప్పించనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో పాటు 5 బిలియన్‌ డాలర్ల స్వాప్ ఆక్షన్‌ను కూడా నిర్వహిస్తుంది. ఈ నిర్ణయాలు దేశీయ వినియోగాన్ని & డిమాండ్‌ను పెంచుతాయని నిపుణులు భావిస్తున్నారు. తద్వారా, కన్జ్యూమర్‌ కంపెనీలు లాభపడతాయి. కాబట్టి, ఇప్పుడు స్టాక్‌ మార్కెట్ దృష్టి మొత్తం ఫిబ్రవరి 7న RBI కొత్త గవర్నర్‌ చేయబోయే ప్రకటనలపై ఉంది.

మరో ఆసక్తికర కథనం: రూ.12 లక్షలు కాదు, రూ.13.70 లక్షల ఆదాయంపైనా 'జీరో టాక్స్‌'!, మీరు ఈ పని చేస్తే చాలు