Delhi Assembly Elections : దేశ రాజధాని ఢిల్లీలో 70 స్థానాలకు జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోపే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అతిషి, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియాతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అందుకోసం దాదాపు 30వేల మంది పోలీసులతో పాటు 220 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు.
ఢిల్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
- ఓటింగ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎస్టేట్ లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.
- కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గాంధీ నిర్మాణ్ భవన్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- ఢిల్లీ ముఖ్యమంత్రి, కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ తరపున పోటీ చేస్తోన్న అభ్యర్థి అతిషి ఓటు వేయడానికి ముందు కల్కాజీ ఆలయంలో ప్రార్థనలు చేశారు.
- జంగ్‌పురా నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆప్ నేత, ఎమ్మెల్యే అభ్యర్థి మనీష్ సిసోడియా తన భార్యతో కలిసి ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేశారు.
- భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆయన సతీమణి తుగ్లక్ క్రెసెంట్ లోని పోలీంగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నేను ముందస్తు ఓటరుని. ప్రజలు మార్పు కోసం సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను" అని అన్నారు.
- కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఆయన భార్య లక్ష్మీ పురితో పాటు ఇతర కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఆనంద్ నికేతన్ లో ఓటు వేశారు.
- వీరందరితో పాటు ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అపూర్వ చంద్ర, బీజేపీకి చెందిన అరవిందర్ సింగ్ లవ్లీ , బన్సూరి స్వరాజ్ లాంటి పలువురు ఆయా ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఆప్ నేతలపై కేసులు
ఓ పక్క ఓటింగ్ జరుగుతుండగా, మరో పక్క ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆప్ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 4న ఫతే సింగ్ మార్గ్‌లో ఒక అధికారి పనికి ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై కేసు నమోదైంది. ఆమెతో పాటు ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఓఖ్లా ఎమ్మెల్యేగా ఉన్న ఖాన్.. మంగళవారం రాత్రి జకీర్ నగర్‌లో 100 మందికి పైగా మద్దతుదారులతో ప్రచారం చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఈ కేసు నమోదు చేశారు. ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 223, బహిరంగ సమావేశాలను నిషేధించే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126 కింద కేసు ఫైల్ చేశారు.
70 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోన్న 699 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.56 కోట్ల మంది ఓటర్లు ఈ రోజు నిర్ణయించనున్నారు. ఓటర్లలో 83.76 లక్షల మంది పురుషులు, 72.36 లక్షల మంది మహిళలు, 1,267 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. ముఖ్యంగా, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 2015, 2020లో జరిగిన చివరి రెండు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించింది. 2013 వరకు వరుసగా 15 సంవత్సరాలు ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, గత 27 సంవత్సరాలుగా ఢిల్లీలో బీజేపీ అధికారంలో లేదు. ఈ రోజు ఒకే దశలో పోలింగ్ జరుగుతుండగా, ఈ ఫలితాలు ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు.