కరోనా వైరస్‌పై విజయం సాధించేందుకు మరో ఆయుధం అందుబాటులోకి వచ్చింది! శ్వాస రంధ్రాల్లోనే వైరస్‌ను మట్టుపెట్టే నాసల్‌ స్ప్రే మందును గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటిక‌ల్ భారత్‌ విపణిలో ప్రవేశపెట్టింది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ స్ప్రేను FabiSpray®  బ్రాండుతో విక్రయించనుంది. కొవిడ్‌ తీవ్రతను తగ్గించేందుకు ఇదెంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఫాబి స్ప్రే అత్యవసర వినియోగం, మార్కెటింగ్‌కు డ్రగ్స్‌ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమ‌తి ఇచ్చింది.


ముక్కు రంధ్రాలు, శ్వాసనాళాల్లోని కొవిడ్-19 వైర‌స్‌ను నిర్మూలించడానికి ఫాబి స్ప్రేను రూపొందించారు. ముక్కులోని మ్యుకోసా ద్వారా స్ప్రే చేసిన‌ప్పుడు వైరస్‌ను ఊపిరి తిత్తుల్లోకి వెళ్లకుండా ఆ మందు పనిచేస్తుంది.  'కొవిడ్-19 మ‌హ‌మ్మారిపై పోరాటంలో మా భాగస్వామ్యం కాలకంగా ఉండాలని భావించాం.  నైట్రిక్ ఆక్సైడ్ నాసల్‌ స్ప్రే (FabiSpray®)కు అనుమ‌తులు వచ్చినందుకు, శానొటైజ్‌తో క‌లిసి దానిని ఆవిష్కరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. కొవిడ్-19 చికిత్సలో ఇదో మెరుగైన యాంటీవైర‌ల్ అస్త్రంగా పనిచేస్తుందని మా నమ్మకం' అని గ్లెన్‌మార్క్‌ కంపెనీ వివరించింది.


మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలు


* భారత్‌లో 20 ప్రాంతాల్లో కొవిడ్‌ రోగులపై మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. డ‌బుల్-బ్లైండ్, ప్యారలల్‌ ఆర్మ్, మ‌ల్టీసెంట‌ర్ అధ్యయానాలను 306 మంది రోగులుపై నిర్వహించారు. నైట్రిక్ ఆక్సైడ్ నాసల్‌ స్ప్రే సామ‌ర్థ్యం, భద్రతను పరీక్షించారు. ఆసుపత్రుల్లో చేరని రోగులపైనా అధ్యయనం చేశారు.
* కరోనా టీకా తీసుకోని రోగులు, మధ్య, పెద్ద వయస్కులు, ఇత‌ర ఆరోగ్య సమస్యలున్న రోగుల్లో  అధ్యయనం చేశారు.
* ఎన్ఓఎన్ఎస్ గ్రూపులో వైరల్ లోడ్ తగ్గినట్టు రుజువైంది. ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదు!
* తొలి 24 గంట‌ల్లో వైర‌ల్ లోడును ఎన్ఓఎన్ఎస్ 95% త‌గ్గిస్తుండ‌గా, 72 గంటల్లో 99%కు పైగా త‌గ్గిస్తోంది.
* భార‌త్‌లో నిర్వహించిన మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో  తొలి 24 గంట‌ల్లో 94% త‌గ్గిస్తుండ‌గా, 48 గంట‌ల్లో 99% త‌గ్గించింది. ఇది శానొటైజ్ యూకేలో నిర్వహించిన ఎన్‌హెచ్ఎస్ ట్రయల్స్‌కు సరిపోతోంది.
* అమెరికాలోని ఓ యూనివ‌ర్సిటీలో చేసిన ప‌రిశోద‌న‌లో నాసల్‌ స్ప్రే ద్వారా  ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఎప్సిలాన్ వేరియంట్లను 2 నిమిషాల్లో 99.9% చంపుతున్నట్టు రుజువైంది.  
* నైట్రిక్ ఆక్సైడ్ నాసల్‌ స్ప్రే వైరల్ లోడ్‌ను తగ్గించి ఆర్‌టీ-పీసీఆర్ నెగిటివిటీని పెంచింది. సంక్రమణ గుణాన్నీ తగ్గిస్తోందని అధ్యయనంలో పాల్గొన్న వైద్యుడు శ్రీకాంత్‌ కృష్ణమూర్తి అన్నారు.


Also Read: ఐపీవో క్రేజ్‌ - పెట్టుబడి పెట్టే ముందు ఇవి గుర్తుపెట్టుకుంటే నష్టాలు రావు!


Also Read: ఈ షేరులో మీరు రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే 20 నెలల్లో రూ.18 లక్షలు సంపాదించేవారు!