Free Credit Score on WhatsApp: క్రెడిట్ స్కోర్ చూసుకోవాలంటే గతంలో డబ్బులు కట్టాల్సి వచ్చేది. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు డబ్బులు వసూలు చేస్తుంటే, మరికొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఉచితంగా క్రెడిట్ స్కోరును అందిస్తున్నాయి. అయితే, ఉచిత క్రెడిట్ స్కోర్ కోసం మనం ఆ సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి లేదా, యాప్ డౌన్‌లోడ్ చేసుకుని చూసుకోవాలి. ఇప్పుడు ఆ అవసరం కూడా లేకుండా, వాట్సాప్ ద్వారా పూర్తి ఉచితంగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా క్రెడిట్ స్కోర్ తెలుసుకునే ఫెసిలిటీని ప్రముఖ క్రెడిట్ బ్యూరో సంస్థ ఎక్స్‌పీరియన్ (Experian) లాంచ్ చేసింది. మన దేశంలో, వాట్సాప్ ద్వారా క్రెడిట్ స్కోర్ తెలుసుకునే సేవల్ని ప్రారంభించిన తొలి సంస్థ ఇదే.
క్రెడిట్ స్కోర్ అంటే?
మన ఆర్థిక క్రమశిక్షణకు ఆధార్ కార్డ్ లాంటిది ఈ క్రెడిట్ స్కోర్. బ్యాంకులు, NBFCలు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే వ్యక్తిగత రుణాలు, హౌస్ లోన్లు, బంగారం మీద తీసుకునే అప్పులు, క్రెడిట్ కార్డ్ ఔట్‌స్టాండింగ్, 'బయ్ నౌ పే లేటర్' వంటివాటిని తిరిగి సరిగా చెల్లిస్తున్నామో లేదో చెప్పే మూడు అంకెల సంఖ్యే క్రెడిట్ స్కోర్. ఇది 300-900 మధ్య ఉంటుంది. తీసుకున్న రుణాల మీద చేసే చెల్లింపుల ఆధారంగా 300-900 మధ్య ఒక నంబర్‌ను క్రెడిట్ సంస్థలు క్రెడిట్ స్కోర్‌గా మీకు కేటాయిస్తాయి. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే ఉంటే, మనకు అంత పరపతి ఉన్నట్లు లెక్క.
స్కోర్ పరమార్థం
800 నుంచి 900 : ఎక్స్‌లెంట్ లేదా అద్భుతమైన స్కోరు
740 నుంచి 799: వెరీ గుడ్ లేదా చాలా బాగుంది
670 నుంచి 739: గుడ్ లేదా బాగుంది
580 నుంచి 669: ఫెయిర్ లేదా పర్లేదు
300 నుంచి 579: పూర్ లేదా అస్సలు బాగోలేదు
మంచి స్కోర్ - భలే ప్రయోజనాలు
మీరు ఏదైనా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ దగ్గరకు లోన్ కోసం వెళ్తే, వాళ్లు మొదటగా చూసేది క్రెడిట్ స్కోర్‌నే. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే పెద్ద మొత్తంలో రుణాలను ఆఫర్ చేస్తాయి. మంచి స్కోర్ ఉన్నవాళ్లకు వడ్డీ రేట్ల విషయలో బేరమాడే శక్తి కూడా ఉంటుంది. మీరు కోరుకున్న రేటుకే అప్పు కావాలన్నా, రుణ పరిమితి పెరగాలన్నా, కొత్త క్రెడిట్ కార్డులు అవసరమున్నా, ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంక్‌కు లోన్ మార్చుకోవాలన్నా వెంటనే ఓకే అవుతుంది. అంటే, మీకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఒక్కోసారి ప్రాసెసింగ్ ఛార్జీలను తగ్గిస్తారు, లేదా పూర్తిగా మాఫీ చేస్తారు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే, ఇలాంటి ప్రయోజనాలేవీ అందవు.
ఈ స్టెప్స్ ఫాలో అయ్యి, వాట్సాప్ ద్వారా ఉచితంగా క్రెడిట్ స్కోర్ తెలుసుకోండి
1. 9920035444 నంబరుకు వాట్సాప్‌లో ‘Hey’ అని మెసేజ్ చేయండి.
2. ఆ తర్వాత.. మీ పేరు, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబరు వంటి వివరాలు నమోదు చేయాలి.
3. ఎక్స్‌పీరియన్ నుంచి మీకు OTP వస్తుంది. దాని ద్వారా మీ వివరాల్ని కన్‌ఫర్మ్ చేయాల్సి ఉంటుంది.
4. వివరాల కన్ఫర్మేషన్ పూర్తి కాగానే మీ క్రెడిట్ స్కోర్ మెసేజ్ రూపంలో అందుతుంది.
5. ఒక పూర్తి రిపోర్ట్ కూడా మీ ఈ-మెయిల్‌కు వస్తుంది.
పాస్‌వర్డ్‌తో కూడిన రిక్వెస్ట్ కాబట్టి, మీ స్కోర్ పక్కవాళ్లకు తెలిసే అవకాశం ఉండదు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మెసేజ్ రూపంలో పాస్‌వర్డ్ వస్తుంది.