DMart Q3 results: అవెన్యూ సూపర్‌మార్ట్స్ (DMart) అదరగొట్టింది! 2021, డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.586 కోట్ల ఏకీకృత నికర లాభం ఆర్జించింది. దాదాపు 24.6 శాతం వృద్ధి నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో రాధాకిషన్ దమానీకి చెందిన డీమార్ట్ రూ.470 కోట్ల నికర లాభం నమోదు చేయడం గమనార్హం.
ఆపరేషన్స్ రాబడి 22 శాతం పెరిగి రూ.9065 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇది రూ.7,432 కోట్లు కావడం గమనార్హం. కాగా శుక్రవారం డీమార్ట్ షేర్లు 0.5 శాతం లాభపడి రూ.4,730 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. లాభాన్ని మినహాయిస్తే ఖర్చులు సైతం బాగానే పెరిగాయి. ఏడాది క్రితం ఇది రూ.6,977 కోట్లు ఉండగా ఇప్పుడు 21.72 శాతం పెరిగి రూ.8,493 కోట్లుగా ఉంది.
ఇక నివేదికల ప్రకారం 2022 ఆర్థిక ఏడాదిలో కంపెనీ చివరి తొమ్మిది నెలల ఆదాయం రూ.22,190 కోట్లుగా ఉంది. అంతకు ముందు ఇది రూ.16,731 కోట్లు. ఎఫ్‌వై 22 తొమ్మిది నెలల నికర లాభం రూ.1066 కోట్లుగా ఎఫ్‌వై 21 తొమ్మిది నెలల నికర లాభం రూ.686తో పోలిస్తే చాలా పెరిగింది.
'డీమార్ట్ స్టోర్ల ఆదాయం గతేడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో 22 శాతం పెరిగింది. గ్రాస్ మార్జిన్ మాత్రం కాస్త తగ్గింది. సాధారణ మర్చండైజ్, దుస్తుల విక్రయాలు కాస్త తగ్గాయి. నిత్యావసరాలు, ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు బాగా పెరిగాయి. ద్రవ్యోల్బణం, తక్కువ అవకాశాలు కొన్ని విభాగాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలను మరింత సమర్థంగా కొనుగోళ్లకు ఉపయోగించుంటాం. మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. స్థానిక ప్రభుత్వాల నిబంధనలను అనుసరించి మా విక్రయాలు ఉంటాయి. ఉద్యోగులు, వినియోగదారుల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం' అని డీమార్ట్ సీఈవో, ఎండీ నెవిల్ నోరోన్హ చెప్పారు.
Also Read: PAN-Aadhaar Linking: పాన్‌తో ఆధార్ లింక్ చేయలేదా? పదివేల ఫైన్ తప్పదు మరి!!