PAN-Aadhaar Linking: మీ పాన్‌కు ఆధార్‌ను అనుసంధానించారా? చేయకపోతే వెంటనే చేసేయండి. 2022, ఏప్రిల్ 1లోపు చేయకపోతే చిక్కుల్లో పడతారు. మీ పాన్ పనిచేయడం ఆగిపోతుంది. ఆ తర్వాత మీరు దేనికోసమైనా పాన్ ఇచ్చిన ప్రతిసారీ రూ.10వేలు జరిమానా కట్టాల్సి వస్తుంది.
వాస్తవంగా పాన్‌తో ఆధార్ అనుసంధానం గడువుకు 2021, డిసెంబర్ 31 చివరి తేదీ. ప్రజల నుంచి విజ్ఞప్తి రావడంతో ఈ గడువును 2022, మార్చి 31కు పొడగించింది. ఇప్పటికే చాలాసార్లు పొడిగించిన నేపథ్యంలో మరోసారి ఇందుకు అవకాశం ఇవ్వకపోవచ్చు.
ఒకవేళ మీరు పాన్‌కు ఆధార్ అనుసంధానం చేయకపోతే మీ పాన్ కార్డు ఇన్‌యాక్టివ్ అవుతుంది. మార్చి తర్వాత పనిచేయదు. ఆ తర్వాత మీ పాన్ కార్డు వివరాలు ఎందులోనైనా ఇచ్చినప్పుడు డిఫాల్టర్‌గా తేలితే రూ.10వేల జరిమానా విధిస్తారు. ఇలా డిఫాల్టర్‌గా తేలిన ప్రతిసారీ పదివేల పైకం చెల్లించకతప్పదు. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం పాన్‌కు ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
'ఎవరైనా వ్యక్తులు తమ పాన్ ఇన్‌ఆపరేటివ్‌గా మారినప్పుడు సంబంధిత విషయాన్ని కచ్చితంగా తెలియజేయాలి. అలా వివరాలు తెలియజేయని పక్షంలో చట్ట ప్రకారం అతడు పాన్ వివరాలు సమర్పించలేదనే అర్థం. అలాంటప్పుడు డిఫాల్టర్‌గా తదనంతర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని ఇంతకు ముందే కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ ప్రకటించింది.
పాన్ అనేది ఇప్పుడో నిత్యావసర పత్రంగా మారిపోయింది. ప్రతి ఆర్థిక అవసరాలకూ పాన్ వినియోగం తప్పనిసరి. బ్యాంకుల్లో రూ.50వేలకు పైగా విలువైన లావాదేవీలు చేపట్టేందుకు, భూములు, షేర్లు కొనుగోళ్లు చేసేటప్పుడు, డిపాజిట్లు చేసినప్పుడు పాన్ కచ్చితంగా ఉండాల్సిందే.
Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి.
నకిలీ పాన్ కార్డులపై కఠిన చర్యలు
ఈ మధ్య కాలంలో నకిలీ పాన్ కార్డు కేసులు ఎక్కువ కావడంతో ఆదాయపన్ను శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఏది నకిలీదో ఏది అసలైందో తెలుసుకొనేందుకు పాన్ కార్డులకు క్యూఆర్ కోడ్ జత చేస్తోంది. ఈ క్యూఆర్ కోడ్ నిజమైన పాన్ ఏదో, నకిలీ పాన్ ఏదో సులభంగా గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మీరూ అసలు, నకిలీ పాన్ కార్డులను గుర్తించొచ్చు. ఇందుకోసం మీరు ఆదాయపన్ను శాఖ నుంచి ఒక యాప్ సాయం తీసుకోవాల్సి ఉంటుంది.
అసలు, నకిలీ పాన్ కార్డులను గుర్తించే ప్రక్రియ
పాన్ కార్డు అసలు, నకిలీ తెలుసుకొనేందుకు ముందుగా మీరు ఆదాయపన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వాలి.
మొదట www.incometax.gov.in/iec/foportal ను సందర్శించాలి.
ఆ తర్వాత 'వెరిఫై యువర్ పాన్' ఆప్షన్ క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీ ముందు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటున్న పాన్ సమాచారం మొత్తం ఫిల్ చేయాలి.
పాన్ కార్డు సంఖ్య, పేరు, పుట్టిన రోజు, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
ఇవన్నీ ఎంటర్ చేయగానే మీరు ఇచ్చిన సమాచారం మ్యాచ్ అవుతుందో లేదో సమాచారం మొబైల్‌కు వస్తుంది.
ఈ సమాచారం ద్వారా మీరు పరిశీలిస్తున్న పాన్ కార్డు సరైందో కాదో తెలుసుకోవచ్చు.