Direct to Mobile Broadcasting: ప్రస్తుతం దేశంలో దాదాపు 20 కోట్ల కుటుంబాల్లో మాత్రమే టెలివిజన్లు (టీవీ) ఉన్నాయి. న్యూస్ పెట్టమని నాన్న.. సీరియల్ కావాలని అమ్మ.. సినిమానో, క్రికెట్ మ్యాచో చూస్తామని పిల్లలు గొడవ పడడం, అలగడం వంటివి ఒక్క టీవీ ఉన్న కుటుంబాల్లో సాధారణంగా కనిపించే దృశ్యాలు. ఇకపై ఇలాంటి చికాకులకు చెల్లుచీటీ పడనుంది.
డైరెక్ట్-టు-మొబైల్ (DTM) టెక్నాలజీ
ఇప్పుడు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. ఎంత పేదింటిలోనైనా కనీసం ఒక్క స్మార్ట్‌ఫోన్ అయినా ఉంటోంది. భారతదేశంలో 60 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. ఫీచర్ ఫోన్ల వాడుతున్న వాళ్లను కూడా కలిపితే ఈ సంఖ్య 120 కోట్లుగా ఉంది. 80 కోట్ల బ్రాడ్ బ్యాండ్ (ఇంటర్నెట్) కనెక్షన్లు ఉన్నాయి. దీనిని బేస్ చేసుకుని కొత్త టెక్నాలజీని డెవలప్ చేశారు. అదే 'డైరెక్ట్ టు మొబైల్' (DTM) టెక్నాలజీ. దీనివల్ల, ఇంటర్నెట్‌తో అనుసంధానించిన స్మార్ట్ ఫోన్ ఇకపై టీవీలా మారబోతోంది. టీవీలో వచ్చే ప్రతి కార్యక్రమాన్ని స్మార్ట్ ఫోన్‌లో మనం చూడవచ్చు.
'డైరెక్ట్ టు హోమ్'కు (DTH) అప్‌గ్రేడ్ వెర్షన్ లాంటి 'డైరెక్ట్ టు మొబైల్' (DTM) సాంకేతికత ఇప్పటికే సిద్ధంగా ఉంది. డైరెక్ట్ టు హోమ్ పద్ధతిలో మన ఇంటి డాబా మీదకు సిగ్నల్స్ వస్తాయి. డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ అంతకన్నా ఒక ఆకు ఎక్కువే చదివింది. సిగ్నల్స్‌ను నేరుగా ఇంటి లోపలకే తీసుకొస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా యాంటెన్నాలు బిగించుకోవాల్సిన తతంగం లేదు.
ఐఐటీ కాన్పూర్, శాంఖ్య ల్యాబ్స్ కలిసి, డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్ మీద బెంగళూరులో ప్రయోగాత్మకంగా (పైలెట్ ప్రాజెక్ట్) అధ్యయనం చేశాయి. అక్కడ సానుకూల ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ రిపోర్ట్ ఇంకా బయటకు రాలేదు.
ఇప్పుడు... దిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో (National Capital Region - NCR) ఈ టెక్నాలజీ మీద మరో పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నారు. ఎంచుకున్న ప్రదేశంలోని ప్రజలకు DTM సిగ్నల్స్ అందుబాటులోకి తెచ్చి, ఆ అనుభవాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరిస్తారు.
డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్ కాస్టింగ్ ఎలా పని చేస్తుంది?
డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్ కాస్టింగ్ దాదాపు FM రేడియోలాగే పని చేస్తుంది. నిర్దిష్ట ఫ్రీక్వెన్సీని అందుకునేందుకు FM రేడియో పరికరాల్లో ఒక రిసీవర్ లేదా యాంటెన్నా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లకు రిసీవర్ అవసరం లేదు. బ్రాడ్ బ్యాండ్, బ్రాడ్ కాస్ట్ టెక్నాలజీలను కలుపుతారు. దీంతో, బ్రాడ్ బ్యాండ్‌తో కనెక్ట్ అయిన స్మార్ట్ ఫోన్లలో డిజిటల్ టీవీ కార్యక్రమాలు కనిపిస్తాయి. తద్వారా, స్మార్ట్ ఫోన్లకు మల్టీ మీడియా కంటెంట్ నేరుగా అందుతుంది. ఇకపై, ఇంట్లో ఎవరికి వాళ్లు నచ్చిన ఛానెల్ వాళ్లు పెట్టుకుని, నచ్చిన ప్రోగ్రామ్ చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.
డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్ కాస్టింగ్ వల్ల వీక్షకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి, టెలివిజన్ మీడియాకు ఇది చాలా పెద్ద వార్త. DTM అమల్లోకి వస్తే, టెలివిజన్ మీడియా ఔట్ రీచ్ చాలా ఎక్కువగా ఉంటుంది.