Nandan Nilekani Crypto Project: క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ప్రాజెక్టును తాను ఆరంభించలేదని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని (Nandan Nilekani) స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో (Social Media) ప్రచారం అవుతున్న వార్తలన్నీ నకిలీవని వెల్లడించారు. అలాంటివి నమ్మొద్దని సూచించారు. అలాంటి పోస్టులను క్లిక్ చేయకుండా అవన్నీ నకిలీ వార్తలుగా రిపోర్టు చేయాలని తెలిపారు.


నిజమెంత?


ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని క్రిప్టో కరెన్సీ ప్రాజెక్టును మొదలు పెట్టినట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతోంది. అవి ఆయన దృష్టికి రావడంతో అవన్నీ అవాస్తవమని మంగళవారం ట్వీట్‌ చేశారు. ఆరోగ్యకరమైన డిజిటల్‌ లైఫ్‌ కోసం సోషల్‌ మీడియాను నియంత్రించాలని ఆయన సూచించారు. నీలేకని కేవలం ట్విటర్‌ను మాత్రమే వాడతారు. తన ఫాలోవర్లకు సమాచారం చేరవేసేందుకే ఉపయోగపడుతుందనే దీనిని ఉపయోగిస్తారు. ఆయన వాట్సాప్‌ను ఉపయోగించరని ఆయన ఐఫోన్‌ (iPhone) హోమ్‌స్క్రీన్‌ చిత్రం ద్వారా తెలుస్తోంది!


అంతా అవాస్తవం


'నేనో క్రిప్టో ప్రాజెక్టును లాంచ్‌ చేసినట్టు కొన్ని సోషల్‌ మీడియా వేదికల్లో పోస్టులను మీరు చూసే ఉంటారు. ఇది అవాస్తవం (Fake news)! అలాంటి పోస్టులను క్లిక్‌ చేయకండి. అది తప్పుదారి పట్టించే సమాచారం లేదా వార్తగా మీరు ఉపయోగిస్తున్న సోషల్‌ మీడియాలో రిపోర్టు చేయండి' అని నీలేకని ట్వీట్‌ చేశారు.


Asset Classగా ఓకే!


క్రిప్టో కరెన్సీ  (Cryptocurrency) నియంత్రణ గురించి నందన్‌ నీలేకని గతంలో మాట్లాడారు. 'ఒక అసెట్‌ క్లాస్‌గా క్రిప్టో కరెన్సీని ప్రోత్సహించాలి. అలాంటి అసెట్‌పూల్‌ ఉండటం మంచిదే.  ఒక అసెట్‌ క్లాస్‌గా భారత్‌ దానిని పరిగణించాలి. వికేంద్రీకరణ రూపంలో డబ్బు చేసుకోవడమే క్రిప్టోలో గొప్పదనం. అందుకే అందరూ దాన్ని ప్రమోట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాటి విలువ పెరుగుతోంది. వికేంద్రీకరణ రూపంలో డబ్బును తయారు చేసే సాంకేతికత చరిత్రలో ఇప్పటి వరకూ లేదు' అని ఆయన పేర్కొన్నారు.


Also Read: సేఫ్టీ ఫస్ట్, తక్కువ ధరలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కార్లు ఇవే!


Also Read: క్రెడిట్‌ కార్డు అప్పు తీర్చాలా - సింపుల్‌గా ఈ 10 చిట్కాలు పాటించండి!