Consumer Court Slaps Flipkart: కస్టమర్‌కు డెలివెరీ చేసిన నాసిరకం ఆహార ఉత్పత్తిని తిరిగి తీసుకోనందుకు, ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కస్టమర్‌కు రూ. 10,000 చెల్లించాలని ముంబైలోని జిల్లా వినియోగదారుల ఫోరం (district consumer forum) ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను, ఆ ప్రొడక్ట్‌ సెల్లర్‌ను ఆదేశించింది. 'నో రిటర్న్ పాలసీ' (no return policy) కారణంగా ఆ ఉత్పత్తిని వాపసు అంగీకరించలేకపోవడం అన్యాయమైన వాణిజ్య విధానం కావడంతో పాటు ఫ్లిప్‌కార్ట్ సేవల విషయంలోనూ లోపమని జిల్లా వినియోగదారుల ఫోరం అభిప్రాయపడింది. తన మార్కెట్‌ప్లేస్ ద్వారా విక్రయించే ఉత్పత్తుల నాణ్యతను చూసుకోవాల్సిన బాధ్యత ఫ్లిప్‌కార్ట్‌పై ఉందని స్పష్టం చేసింది.


ఈ కేసు ఫైల్‌ చేసింది గోరేగావ్ (Goregaon) నివాసి తరుణ రాజ్‌పుత్ (Taruna Rajput). ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఆ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లోని సెల్లర్‌ మీద ఆమె కేసు ఫైల్‌ చేశారు. తన ఫిర్యాదులో ఫ్లిప్‌కార్ట్ డైరెక్టర్లను కూడా చేర్చారు. అయితే, కంపెనీ డైరెక్టర్లపై కేసును కొట్టేసిన న్యాయస్థానం, ఫ్లిప్‌కార్ట్ & విక్రేతకు మాత్రం గట్టిగా మొట్టికాయలు వేసింది.


కేసు ఏమిటంటే...
09 అక్టోబర్ 2023న, తరుణ రాజ్‌పుత్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఉంచిన హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ఆఫ్ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ (నిమ్మ రుచి) (Herbalife Nutrition of Fresh Energy Drink Mix (lemon flavoured)) 13 స్మాల్‌ ప్లాస్టిక్ కంటైనర్‌ కోసం 5 విడతలుగా ఆర్డర్‌లు చేశారు. ఇందుకోసం రూ. 4,641/- చెల్లించారు. ఆర్డర్‌ చేసిన 5 రోజులకు, అంటే 2023 అక్టోబర్ 14న ఆ ఆహార ఉత్పత్తిని ఆమె ఇంటి వద్దకు డెలివరీ చేశారు. ఆమె, వాటిని వెంటనే వినియోగించకుండా పక్కన పెట్టారు. ఆహార ఉత్పత్తులు వచ్చిన వారం తర్వాత, అంటే 2023 అక్టోబరు 21న, ఆ కంటైనర్‌లు తెరిచారు. అయితే, అప్పటికే ఆ ఆహార ఉత్పత్తి రంగు, ఆకృతి మారిపోయాయి.


ఆ ఉత్పత్తి లేబుల్‌పై QR కోడ్ కూడా లేకపోవడాన్ని తరుణ రాజ్‌పుత్ గమనించారు. అమె వెంటనే ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేశారు. తనకు నకిలీ ఉత్పత్తిని అంటగట్టారని, దానిని వెనక్కు తీసుకుని అసలు ఉత్పత్తిని పంపాలని ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ను కోరారు. అయితే, ఆ ఉత్పత్తికి ఎలాంటి రిటర్న్ పాలసీ లేదని చెప్పిన ఫ్లిప్‌కార్ట్, తరుణ రాజ్‌పుత్ అభ్యర్థనను తిరస్కరించింది.



కస్టమర్‌కు కోపం వచ్చింది
ఆ తర్వాత, ఆమె ఆ ఉత్పత్తి ఫొటోలు తీసి ఫ్లిప్‌కార్ట్‌కు పంపారు. అయినా ఫ్లిప్‌కార్ట్‌ పట్టించుకోలేదు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చి, వినియోగాదారుల ఫోరంలో కేసు నమోదు చేశారు. వినియోగాదారుల ఫోరంలో న్యాయమూర్తికి ఆ నాసిరకం ఉత్పత్తి ఫొటోలను కూడా చూపారు.


'నో రిటర్న్ పాలసీ' కారణంగా, పాడైపోయిన ఉత్పత్తిని వెనక్కు తీసుకోకపోవడం సమంజసం కాదని జిల్లా వినియోగదారుల ఫోరం అభిప్రాయపడింది. సదరు సెల్లర్‌ అన్యాయపూరిత వాణిజ్య పద్ధతిని అవలంబించిందని, ఫ్లిప్‌కార్ట్‌ సర్వీస్‌లోనూ కొంత లోపం ఉందని వ్యాఖ్యానించింది.


హానికారక లేదా నకిలీ ఉత్పత్తిని అంటగట్టినట్లు వాదించిన తరుణ రాజ్‌పుత్‌, తనకు రూ. 50 లక్షలు నష్ట పరిహారం చెల్లించేలా ఫ్లిప్‌కార్ట్‌ను ఆదేశించాలని ఫోరంను కోరారు. అయితే, హానికరమైన పదార్థాలు లేదా ఉత్పత్తి నకిలీదని రుజువు చేయడంలో ఆమె విఫలమైంది కాబట్టి, కోర్టు ఆమె విజ్ఞప్తిని అనుమతించలేదు.


ఫిర్యాదిదారు ఫ్లిప్‌కార్ట్‌కు చెల్లించిన రూ. 4,641 తిరిగి ఇచ్చేయాలని, దీంతోపాటు రూ. 10,000 ఫైన్‌ కూడా చెల్లించాలని జిల్లా వినియోగదారుల ఫోరం ఫ్లిప్‌కార్ట్‌ను ఆదేశించింది. 21 అక్టోబరు 2023 నుంచి, డబ్బు చెల్లింపు జరిగే వరకు 9% వడ్డీ కూడా ఫిర్యాదుదారుకి చెల్లించాలని కూడా ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను, దాని విక్రేతను కోర్టు ఆదేశించింది.


మరో ఆసక్తికర కథనం: ఇక నుంచి QR కోడ్‌తో కొత్త పాన్ కార్డ్‌లు - "ఫ్రీ"గా తీసుకోవచ్చు