Co - working Share:
ఆఫీస్ లీజింగ్‌లో కో-వర్కింగ్ స్పేస్ రంగం దుమ్మురేపుతోంది. 2022-23 ఆర్థిక ఏడాదితో పోలిస్తే 23 శాతం వృద్ధి నమోదు చేసింది. రాబోయే రెండు మూడేళ్లలో 15-20 శాతం పెరుగుతుందని అనరాక్ రీసెర్చ్ వెల్లడించింది. ఫ్లెక్సీ ఆఫీస్ ప్లేస్‌లకు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది.
రెగ్యులర్ ఆఫీస్ లీజింగ్ 2020 ఏడాదిలో రికార్డు సృష్టించింది. దేశంలోని అగ్రగామి ఏడు నగరాల్లో 43 మిలియన్ స్క్వేర్ ఫీట్లతో శిఖర స్థాయికి చేరుకుంది. దాంతో పోలిస్తే 2023లో లీజింగ్ 12 శాతం మేర తగ్గిపోయింది. ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు రాకపోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణాలు. టాప్ 7 నగరాల్లో ఆఫీస్ లీజింగ్ 36.11 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు తగ్గిపోయింది.
పుణె నగరం కో-వర్కింగ్ స్పేస్ లావాదేవీల్లో రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది 40 శాతం వాటా దీని సొంతం. 30 శాతంతో బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. నగరంలోని కో వర్కింగ్ స్పేస్, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల పరిశ్రమలు మార్కెట్ లీడర్లుగా అవతరించాయి. కమర్షియల్ స్పేస్ డిమాండ్‌లో వరుసగా 33, 29 శాతం వాటా ఆక్రమించాయి.
ఈ ట్రెండ్ బెంగళూరుకే పరిమితం కాలేదని అనరాక్ తెలిపింది. స్థిర కార్యాలయ ఖర్చులకు కంపెనీలు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయని పేర్కొంది. ఫ్లెక్సీ ఆఫీస్ స్పేస్‌లో కోల్‌కతా సైతం అధిక వాటా కలిగి ఉంది. ఆఫీస్ లీజింగ్‌లో ఐటీ, ఐటీఈఎస్‌దే ఆధిపత్యం. లావాదేవీల వాటాలో 36 శాతం వీటిదే. నగరంలోని మొత్తం ఆఫీస్ లీజింగ్‌లో కో వర్కింగ్ స్పేస్‌ది 21 శాతం వాటా.
భవిష్యత్తులోనూ కో వర్కింగ్ రంగం మరింత వృద్ధిని సాధిస్తుందని అనరాక్ అంచనా వేసింది. పని తీరులో ప్రాథమిక మార్పులు రావడంతో భవిష్యత్తులోనూ రెగ్యులర్ ఆఫీస్ లీజింగ్ తగ్గుతుందని తెలిపింది. కరోనా తర్వాత కార్యాలయంలో పనిచేయడంపై యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయాల ప్రభావం అలాగే కొనసాగుతుందని మైహెచ్‌క్యూ సీఈవో, కో ఫౌండర్ ఉత్కర్ష కవాత్ర అంటున్నారు.
'ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రప్పించాలని తీసుకున్న నిర్ణయంపై చాలా కంపెనీలు పశ్చాత్తాపం చెందుతున్నాయి. సమయంతో పాటు ముందుకు సాగలేకపోతున్నామనే అసమర్థత నుంచి ఈ నిర్ణయం వచ్చింది. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో లేఆఫ్‌లతో సమానంగా అట్రిషన్ రేటు పెరిగింది. మళ్లీ పాత రోజులకు అలవాటు పడేలా చేయాలనుకున్న నిర్ణయం ప్రతికూల పరిణామాలకు దారితీసింది' అని ఉత్కర్ష అన్నారు.
హైబ్రీడ్ వర్క్ కల్చర్‌ను కొనసాగించడమే మంచిదని మరికొందరు విశ్లేషకులు అంటున్నారు. ఎక్కువ శాతం మంది ఫ్లెక్సిబిలిటీని (Flexibility) కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌కు ఇదెంతగానో ఉపయోగపడుతోందని వెల్లడించింది. రెండు వర్గాలకూ ఇది విన్ విన్ సిచ్యువేషన్‌గా తెలిపింది.
సీల్ హెచ్‌ఆర్, ఎకనామిక్ టైమ్స్ సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించాయి. వివిధ రంగాల్లోని 3800 పైగా ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. వారిలో 76 శాతం మందికి పైగా ఉద్యోగులు హైబ్రీడ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ కంపెనీలు ఆఫీసులకు రమ్మని ఒత్తిడి చేస్తే, ఫ్లెక్సిబిలిటీకి అంగీకరించకపోతే ఇతర అవకాశాలను అన్వేషిస్తామని 73 శాతం మంది కుండ బద్దలు కొట్టారు. ఇక 35 శాతం మంది కార్యాలయాల్లో ఎక్కువ రోజులు పనిచేయాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు.