Inflation Risk: 


పెరిగిన టమాట, పచ్చిమిర్చి ధరలతోనే ప్రజలు అల్లాడుతున్నారు! అన్ని కూరగాయాల ధరలూ కొండెక్కడంతో ఏం తినాలి మొర్రో అని మొత్తుకుంటున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టుగా మారుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో బియ్యం (Rice Prices), గోధుమలు సహా తృణధాన్యాల కొరత ఏర్పడుతుందని అంటున్నారు. ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందని అంచనా వేస్తున్నారు.


తృణధాన్యాల (Cereals) కొరత ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందని హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్‌ రిపోర్టు హెచ్చరిస్తోంది. పెరిగిన టమాట ధరలు అసలు సమస్యే కాదని మరికొన్ని రోజుల్లో తగ్గుతాయని తెలిపింది. ధాన్యం కొరత ఏర్పడితే ప్రమాదం ముంచుకొస్తుందని ఎకానమిస్టులు ప్రాంజుల్‌ భండారి, ఆయుషీ చౌదరీ అంటున్నారు. వినియోగదారుల ధరల సూచీలో బియ్యం, గోధుమల వంటి ధాన్యాల వెయిటేజీ దాదాపుగా 10 శాతం ఉంటుందని వెల్లడించారు.


2024 ఆర్థిక ఏడాదిలో ద్రవ్యోల్బణం (Inflation) ఐదు శాతం వరకు ఉంటుందని హెచ్‌ఎస్‌బీసీ అంచనా వేసింది. తృణధాన్యాల ధరలు పెరిగితే మాత్రం మరింత తీవ్ర రూపం దాలుస్తుందని పేర్కొంది. రాబోయే రోజుల్లో వచ్చే వర్షపాతం, వరి నాట్ల (Paddy) సమాచారం అత్యంత కీలకం అవుతుందని తెలిపింది. ఆగ్నేయ భారతంలో తక్కువ పంట సాగు, తూర్పు, దక్షిణ భారతంలో తక్కువ వర్షపాతం వంటివి వరిసాగుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని వెల్లడించింది. ఎగుమతులకు అంతరాయం కలిగిస్తుంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా బియ్యం, గోధుమల ధరలు పెరుగుతాయి.


వీటితో పాటు నల్ల సముద్రం నుంచి ఉక్రెయిన్‌ నౌకాశ్రయాలకు ఆయుధాల నౌకలు వస్తుండటంతో రష్యా హెచ్చరించింది. ఫలితంగా గోధుమల ధర పెరిగింది. దీనికి ఎల్‌నినో తోడైంది. ఆహార పదార్థల ధరలు పెరగడంతో జూన్‌లో రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ మూడు నెలల గరిష్ఠానికి చేరుకుంది. ఇలాంటప్పుడు ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపును కొనసాగించక తప్పని పరిస్థితి నెలకొంటుంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో కేంద్ర ప్రభుత్వంపై ధరలు తగ్గించాల్సిన ఒత్తిడి నెలకొంది. అందుకే సాధారణ తెల్లబియ్యం ఎగుమతులను నిషేధించింది.


తరచూ మారుతున్న వాతావరణం తృణధాన్యాల ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణం అవుతోందని క్రిసిల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. టమాటాలు, ఇతర కూరగాయల ధరల పెరుగుదలకు ఇదే కారణమని వెల్లడించింది.


ముంబయిలో కిలో టమాట రూ.200


టమాట ధరలు చంద్రయాన్‌-3 దశలను తలపిస్తున్నాయి. నెల రోజుల క్రితం కిలో 10 రూపాయాలు ఉండేవి. 15 రోజుల క్రితం కిలో రూ.50కి చేరాయి. మరో రెండు రోజులకే సెంచరీ కొట్టాయి. వారం రోజుల నుంచి రూ.150 వద్ద కదలాడుతున్నాయి. ఇప్పుడేమో ఏకంగా రూ.200ను టచ్‌ చేశాయి. కిలో టమాటాలు డబుల్‌ సెంచరీ దాటడం చరిత్రలో ఇదే తొలిసారి!


ముంబయి మార్కెట్లో కిలో టమాట ధర రూ.200కు చేరుకుంది. పెరిగిన ధరలతో (Tomato Prices) అటు కస్టమర్లు ఇటు వ్యాపారులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. వినియోగదారులు కొనుగోలు చేయడం లేదు. గిరాకీ లేకపోడంతో కొందరు వ్యాపారులు తాత్కాలికంగా దుకాణాలు మూసేస్తున్నారని తెలిసింది. నగరంలోని ఏపీఎంసీ వాషీ రైతుమండిలో పరిస్థితి దారుణంగా ఉంది.


Also Read: ఈపీఎఫ్‌ వడ్డీరేటు డిక్లేర్‌! FY 2022-23కి ఎంత చెల్లిస్తున్నారంటే?