Centre - Inflation:
కొండెక్కుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అదనపు చర్యలు తీసుకోనుంది. పెట్రోలు, డీజిలు, మైదా మరికొన్ని ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని భావిస్తోంది. భారతీయ రిజర్వు బ్యాంకు సూచనల మేరకు మోదీ సర్కారు నిర్ణయం తీసుకోబోతోందని తెలిసింది. ఇందుకోసం ఫిబ్రవరి ద్రవ్యోల్బణం గణాంకాలు వచ్చేంత వరకు వేచిచూడనుందని ఇద్దరు అధికారులు రాయిటర్స్‌కు చెప్పారు.
జనవరి నెలలో భారత ద్రవ్యోల్బణం రేటు 6.25 శాతానికి పెరిగింది. డిసెంబర్లో ఇది 5.72 శాతంగా ఉండటం గమనార్హం. 'ఆహార ద్రవ్యోల్బణం కాస్త అధికంగానే ఉండనుంది. పాలు, మైదా, సోయా నూనె ధరలు సమీప కాలంలో ద్రవ్యోల్బణం ఆందోళనను పెంచనున్నాయి' అని ఈ అంశంతో సంబంధం ఉన్న ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు.
'మైదా వంటి ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సాధారణ సుంకంలో 60 శాతం వీటిపైనే ఉంటాయి. చమురు పైనా మరోసారి పన్నులు తగ్గించనున్నారు' అని ఆ అధికారి వెల్లడించారు. కాగా దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇంకా స్పందించలేదని రాయిటర్స్ పేర్కొంది.
అంతర్జాతీయ ముడి చమురు ధరలు (Crude Oil Prices) కొన్నాళ్లుగా స్థిరంగా ఉన్నాయి. బ్యారెల్ ధర 75-85 డాలర్ల మధ్య ఉంటోంది. ప్రస్తుతం దిగుమతులపై తగ్గిన ఖర్చుల ప్రయోజనాన్ని చమురు కంపెనీలు ఇంకా వినియోగదారులకు బదిలీ చేయలేదు. పాత నష్టాలను భర్తీ చేసుకొంటున్నాయి. భారత్ తనకు అవసరమైన చమురులో 2/3 వంతు దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గిస్తే ఆ ప్రయోజనాన్ని పంపు ఆపరేటర్లు రిటైల్ వినియోగదారులకు బదిలీ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుంది.
ఆర్బీఐ లక్షిత గరిష్ఠ ద్రవ్యోల్బణం రేటు 6 శాతంతో పోలిస్తే జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) ఇంకా ఎక్కువగానే ఉంది. అక్టోబర్లోని 5.9 శాతంతో పోలిస్తే ఇదెంతో ఎక్కువ. 'కేంద్ర బ్యాంకు నుంచి మాకు కొన్ని సూచనలు అందాయి. ఇది ఎప్పుడూ ఉండే ప్రక్రియే' అని మరో అధికారి తెలిపారు.
'స్థిరమైన స్థూల ఆర్థిక వాతావరణాన్ని సృష్టించేందుకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం పరస్పరం సహకరించుకుంటాయి. చమురు, మైదాలపై సుంకాలు ఉన్నాయి. ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకొనేందుకు మేం మరో నెల సమాచారం వరకు వేచిచూడొచ్చు' అని ఆ అధికారి పేర్కొన్నారు.
RBI - Inflation: 2022 నవంబర్ & డిసెంబర్ నెలల్లో దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం (Retail inflation) తగ్గింది, RBI టాలరెన్స్ బ్యాండ్ 6 శాతం కంటే దిగువకు వచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5.88 శాతంగా, డిసెంబర్‌లో 5.72 శాతంగా నమోదైంది. కానీ, కొత్త సంవత్సరం తొలి నెలలో (2023 జనవరి) రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ రెక్కలు చాచి పైకి ఎగిరింది. RBI టాలరెన్స్ బ్యాండ్‌ను మళ్లీ దాటి, భారీగా పెరిగి 6.52 శాతానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విఫలమైందా అనే పెద్ద ప్రశ్న తలెత్తుతోంది.
నిజంగానే ఆర్‌బీఐ విఫలమైందా?
ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి, RBI తన రెపో రేటును 2.50 శాతం పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలోని (2022-23) గత 9 నెలల్లోనే పాలసీ రేట్లను 6 దఫాలుగా పెంచింది. అయినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేకపోయింది. దీని వల్ల, ప్రజలు కట్టే నెలవారీ కిస్తీలు (EMIలు) ఖరీదుగా మారడం రివాజైంది. అయితే, ద్రవ్యోల్బణం పెరుగుదలను అదుపు చేయలేదని ఆర్‌బీఐని నిందించడం సరికాదని ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT) డైరెక్టర్ ప్రొఫెసర్ మనోజ్ పంత్ అభిప్రాయపడ్డారు. దేశంలో సరుకుల సరఫరాలో సమస్యల కారణంగానే భారత్‌లో ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. ఆహార పదార్థాలతో పాటు పాలు & పాల సంబంధిత పదార్థాల ధరలు భారీగా పెరిగిన కారణంగా చిల్లర ద్రవ్యోల్బణం పెరిగిందని చెప్పారు.