CCI Penalty on Google Case: భారతదేశ మార్కెట్‌లో Googleకు (Alphabet Inc) సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. గూగుల్ చేస్తున్న అనైతిక వ్యాపార కార్యకలాపాల కారణంగా మన దేశంలో భారీ జరిమానాను గూగుల్ ఎదుర్కొంటోంది. వ్యాపార పర్యవేక్షణ సంస్థ అయిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (Competition Commission of India- CCI), గూగుల్ మీద రూ. 1,337.76 కోట్ల జరిమానా విధించింది. 2022 అక్టోబర్ నెలలో ఈ ఆదేశాలను CCI జారీ చేసింది.
సాధారణంగా, తమపై విధించిన పెనాల్టీని సవాల్ చేస్తూ కార్పొరేట్ కంపెనీలు అప్పిలేట్ అథారిటీ దగ్గరకు వెళ్తాయి. CCI జరిమానా విధించిన తేదీ నుంచి 60 రోజుల లోపు NCLATలో అప్పీల్ దాఖలు చేసే హక్కు అన్ని కంపెనీలకు ఉంది. CCI విధించిన జరిమానాను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో (National Company Law Appellate Tribunal - NCLAT) అప్పీల్ చేసే అవకాశం గూగుల్‌కు కూడా ఉంది.
అనైతిక వ్యాపారం చేస్తున్న కారణంతో అక్టోబర్ 20న గూగుల్‌కు రూ. 1,337.76 కోట్ల జరిమానా విధించిన CCI, అదే నెల 25వ తేదీన మరో రూ. 936.44 కోట్ల జరిమానా విధించింది. ఈ ఆదేశం మీద అభ్యంతరం చెబుతూ NCLATలో అప్పీల్ చేసుకోవడానికి సవాల్ చేయడానికి డిసెంబర్ 25 వరకు గూగుల్‌కు సమయం ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ గడువు లోగా, ఈ దిగ్గజం టెక్ కంపెనీ అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించ లేదు. ఇప్పుడు గడువు పూర్తయింది కాబట్టి, కాపింటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించిన జరిమానా మొత్తాన్ని గూగుల్ చెల్లించక తప్పదు.
ఇక గూగుల్ మీద చట్టపరమైన చర్యలు
ఈ కేసులో రూ. 1,337.76 కోట్ల పెనాల్టీ మీద ఎలాంటి అప్పీల్‌కు వెళ్లని గూగుల్, గడువు లోగా ఆ డబ్బును కూడా జమ చేయలేదు. ఈ నేపథ్యంలో, గూగుల్ నుంచి జరిమానా సొమ్మును బలవంతంగానైనా వసూలు చేసే అధికారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు దఖలు పడింది. CCI, గూగుల్ మీద చట్టపరమైన చర్యలు ప్రారంభించవచ్చు.
రూ. 1,337.76 కోట్ల రికవరీ కోసం, ముందుగా, Googleకు ఒక డిమాండ్ లేఖను CCI పంపుతుంది. ఈ లేఖ అందుకున్న గూగుల్, జరిమానా మొత్తాన్ని 30 రోజుల్లోగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ, జరిమానా మొత్తాన్ని ఆ గడువు లోగా గూగుల్ డిపాజిట్ చేయకపోతే... ఆ కంపెనీ బ్యాంకు ఖాతాలు, ఆస్తులను అటాచ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు, కమీషన్ ఆదేశాన్ని పాటించని గూగుల్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.
గూగుల్ ఏం చెప్పింది?
ఈ విషయం మీద గత వారం గూగుల్ అధికార ప్రతనిధి మాట్లాడారు. CCI విధించిన పెనాల్టీకి వ్యతిరేకంగా తాము అప్పీల్ చేయబోతున్నట్లు చెప్పారు. దీంతో పాటు, గూగుల్ ఆండ్రాయిడ్ భద్రత మీద భారతీయ వినియోగదారులకు ఉన్న విశ్వాసం మీద ఈ పెనాల్టీ ఒక దెబ్బ అని అన్నారు. తాము చెప్పాలని అనుకున్న విషయాలను NCLAT ఎదుట ఉంచుతామని ప్రకటించారు. అయితే, ఏ కారణం వాళ్లను అడ్డగించిందో గానీ, 60 రోజుల గడువు లగా NCLAT వద్ద గూగుల్ విజ్ఞప్తి చేయలేదు.