Nellore News: వైసీపీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన రేషన్ దుకాణాన్ని తొలగించారని.. కాళ్లు పట్టుకున్నా కనికరించలేదంటూ ఓ యువకుడు వీడియో విడదుల చేశాడు. అంతే కాకుండా ఎమ్మెల్యే తనపై ఎందుకంత కక్ష పెంచుకున్నారో కూడా తెలియట్లేదని, వైసీపీ ఎమ్మెల్యే, పోలీసుల వేధింపులే తన ఆత్మహత్యకు కారణం అని వివరించాడు. ఆపై ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అసలేం జరిగిందంటే..?
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతలకు చెందిన పైడి శ్రీహర్ష కావలి ఎమ్మెల్యే ఇంటి సమీపాన ఆత్మహత్యా యత్నం చేశాడు. ఎమ్మెల్యే ఇంటికి సమీపంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. పాత్రికేయులు అక్కడికి వెళ్లే లోపు ద్విచక్ర వాహనంపై ఆర్డీఓ కార్యాలయం వద్దకు వెళ్లిపోయారు. అప్పటికే కొంత పురుగుల మందు తాగారు. ఆడ్టీఓ కార్యాలయం వద్ద మరికొంత తాగి కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ నాయకులు, విలేకరులు ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసే ముందు శ్రీహర్ష తన ఆవేదనను వీడియోలో చిత్రీకరించారు. తన ఆత్మహత్యకు ఎమ్మెల్యే, పోలీసులు, వైసీపీ నాయకుల వేధింపులే కారణం అని అందులో పేర్కొన్నారు. వారి వల్ల తన జీవనోపాధి పోయిందని వాపోయారు.
వైసీపీలోకి చేరకపోవడంతో రౌడీషీట్ తెరిపించిన నాయకులు..
శ్రీహర్ష తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు. అయితే అతడిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. అందుకు శ్రీహర్ష నిరాకరించడంతో అతనిపై వేధింపులు ప్రారంభం అయ్యాయి. ఆ కక్ష పెట్టుకుని అతనిపైన పోలీసులతో రౌడీషీట్ తెరిపించారు. దీంతో తీవ్ర వేదనకు గురైన శ్రీహర్ష సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తనను తీవ్రంగా వేధించారని శ్రీహర్ష వివరించారు. ఆయన ముఖ్య అనుచరుడు, కావలి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి సహా మరికొందరు కూడా హెచ్చరించారని చెప్పారు. పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రేషన్ దుకాణాన్ని తొలగించారని, కాళ్లు పట్టుకున్నా కనికరించలేదన్నారు. ఎకరం పొలం విక్రయించగా వచ్చిన సొమ్ముతో పాటు బ్యాంకు రుణం తీసుకొని రెండు టిప్పర్లు, ట్రాక్టర్, పొక్లెయినర్ కొనుక్కొని జీవిస్తున్నానని.. కానీ పోలీసులు తన టిప్పర్లను అడ్డుకుంటున్నారని వివరించారు.
ఫోన్లు లాక్కునే ప్రయత్నం చేసిన పోలీసు
వైసీపీ జెండాలు కడితేనే వాహనాలు తిరగనిస్తామని అధికార పార్టీలు నేతలు వేధిస్తున్నారని ఆరోపించారు. బిట్రగుంట పోలీస్ స్టేషన్ కు పలుమార్లు తీసుకెళ్లారన్నారు. పోలీసులు అడిగినంత ఇచ్చినా వేదింపులు ఆగలేదన్నారు. కావలి రూరల్ సీఐ రాజేశ్ మరింతగా వేధిస్తున్నారని కన్నీరు పెట్టుకున్నాడు. వైసీపీ నాయకులు, పోలీసుల వేధింపులతో తన కుటుంబం పస్తులు ఉంటోందని శ్రీహర్ష వాపోయారు. మామూళ్లు ఇవ్వాలంటూ శ్రీహర్షతో కానిస్టేబుల్ అయోధ్య మాట్లాడినట్లు ఆడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే ఆత్మహత్య విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారని. అక్కడే కావలి ఒకటో పట్టణ ఎస్సై మహేంద్ర.. శ్రీహర్ష భార్య ననుంచి పోన్లు తీసుకునేందుకు యత్నించాడు. విషయం గుర్తించిన టీడీపీ శ్రేణులు కేకలు వేయడంతో వెనక్కి తగ్గారు.