Canadian Pension Funds: 


కెనడా, భారత్‌ మధ్య దౌత్య సంబంధాలు హీన దశకు చేరుకుంటున్నాయి. ఖలిస్థానీ అతివాద భావజాలం రెండు దేశాల మధ్య చిచ్చుపెట్టింది. పదేపదే కోరినప్పటికీ జస్టిన్‌ ట్రూడో అతివాదాన్ని అణచివేయడంలో విఫలమయ్యారు. తాజాగా ఆ దేశంలో జరిగిన ఖలిస్థాన్‌ టైగర్ ఫోర్స్‌ నేత హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనక భారత్‌ పాత్ర ఉన్నట్టు ఆయన ఆరోపించడం సంచలనంగా మారింది.


అంతేకాకుండా మన దేశ ఇంటెలిజెన్స్‌ అధికారిని జస్టిన్‌ ట్రూడో బహిష్కరించారు. మోదీ ప్రభుత్వం సైతం అంతే దీటుగా స్పందించింది. కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. దాంతో ఇక్కడి కంపెనీల్లో కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు (CPPIB) పెట్టిన పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనన్న ఆందోళన మొదలైంది. బుధవారం స్టాక్‌ మార్కెట్లు మొదలయ్యాక వీటిపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది.


భారత కంపెనీల్లో కెనడా పెన్షన్‌ బోర్డు ప్రత్యక్షంగా, పరోక్షంగా పెట్టుబడులు పెట్టింది. ఈ విలువ రూ.లక్ష కోట్ల వరకు ఉంటుందని తెలిసింది. జూన్‌ త్రైమాసికానికి డెల్హీవరీలో కెనడా ఫెన్షన్‌ ఫండ్‌కు ఆరుశాతం వాటా ఉంది. సోమవారం నాటి ముగింపు ధరతో పోలిస్తే ఈ విలువ రూ.1878  కోట్ల వరకు ఉంటుంది. ఇక కొటక్‌ మహీంద్రాలో 1.15 బిలియన్ల కెనడా డాలర్లను ఇన్వెస్ట్‌ చేసింది. అంటే మొత్తం కంపెనీలో దీని వాటా 2.68 శాతం. జూన్‌ త్రైమాసికంలో 1.66 శాతం వాటా అమ్మినప్పటికీ తన వాటా విలువ రూ.9,582 కోట్ల మేరకు ఉంటుంది.


జొమాటో, పేటీఎం, నైకా వంటి కంపెనీల్లోనూ సీపీపీఐబీ పెట్టుబడులు పెట్టింది. జొమాటలో రూ.2,078 కోట్లు, పేటీఎంలో రూ.973 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. ప్రస్తుతం పేటీఎంలో సీఈవో విజయ శేఖర శర్మకే అధిక వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్‌ టవర్స్‌లో కెనడా పెన్షన్‌ ఫండ్‌ 2.18 శాతం వాటా ఉంది. సోమవారం నాటి ముగింపు ధరతో లెక్కిస్తే ఈ విలువ రూ.1,085 కోట్లుగా తేలింది. ఫ్యాషన్‌, దుస్తులు, సౌందర్య సాధనాల విక్రయాల కంపెనీ నైకాలో సీపీపీఐబీకి 1.47 శాతం వాటా ఉంది. దీని విలువ జూన్‌ త్రైమాసికానికి రూ.625 కోట్లు.


సాఫ్ట్‌వేర్‌ కంపెనీ విప్రోలో కెనడా పెన్షన్‌ ఫండ్‌కు 11.92 మిలియన్ల వాటా ఉంది. అమెరికా లిస్టెడ్‌ షేర్లను కొనుగోలు చేసింది. ఇక ఇన్ఫోసిస్‌లో ఏకంగా 21.7 మిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. రెండు అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకులో 10 మిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడి పెట్టింది. స్టాక్‌ మార్కెట్లో నమోదవ్వని కంపెనీల్లోనూ కెనడా పెన్షన్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేసింది. పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫ్రా డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ఉన్నాయి.


మార్కెట్లో నిన్న ఏం జరిగిందంటే?


స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. హాంకాంగ్‌, సింగ్‌పూర్‌, కొరియా సూచీలు ఎరుపెక్కగా మొన్నటి వరకు పతనమైన చైనా సూచీలు పుంజుకున్నాయి. ఈ వారం యూఎస్‌ ఫెడ్‌ సమావేశం కానుండటం, ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు పెరుగుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పైగా భారత సూచీలన్నీ గరిష్ఠాల్లోనే ఉండటంతో ప్రాఫిట్‌ బుకింగ్‌కు పాల్పడే సూచనలు కనిపిస్తున్నాయి. నిఫ్టీ 50 కీలకమైన 20,100 లెవల్‌ను నిలబెట్టుకుంది. సెన్సెక్స్‌ 241 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలహీనపడి 83.27 వద్ద స్థిరపడింది.