Canadian Company Fired 400 Employees: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నత్తలా నడుస్తున్న ఈ రోజుల్లో, అన్ని దేశాల ఉద్యోగులను లే-ఆఫ్‌ల భయం వెంటాడుతోంది. చిన్న కంపెనీల నుంచి MNCల వరకు ఉద్యోగులను శాశ్వతంగా ఇంటికి పంపేందుకు చూస్తున్నాయి. గత కొన్ని నెలలుగా, గూగుల్ సహా చాలా పెద్ద కంపెనీలు తమ ఖర్చులను తగ్గించే పేరుతో వేలాది ఉద్యోగాలు తీసేశాయి. ఇప్పుడు, లే-ఆఫ్‌ల కోసం కొన్ని కంపెనీలు అవలంబిస్తున్న పద్ధతులు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కెనడాకు చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ బెల్ (Bell) కేవలం 10 నిమిషాల వీడియో కాల్‌లో 400 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
కేవలం పేర్లు చదవడానికే వర్చువల్ మీటింగ్
ఉద్యోగాలు పోగొట్టుకున్న 400 మందిలో ఎక్కువ మంది చాలా సంవత్సరాలుగా బెల్‌లో పని చేస్తున్నారు. ఏళ్ల తరబడి పని చేసిన ఉద్యోగులను తొలగించడానికి బెల్ కేవలం 10 నిమిషాలు మాత్రమే తీసుకుంది. అందుకోసమే వర్చువల్ వీడియో కాల్ మీటింగ్ నిర్వహించింది. ఆ 400 మందిని కంపెనీకి భారంగా పరిగణిస్తూ తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కంపెనీకి చెందిన ఒక మేనేజర్ లే-ఆఫ్ లెటర్ పట్టుకుని ఈ సమావేశానికి వచ్చాడు. వర్చువల్ మీటింగ్ ప్రారంభం కాగానే లే-ఆఫ్ లిస్ట్‌లో ఉన్న పేర్లు చదవడం మొదలు పెట్టాడు. కేవలం పేర్లు చదవడానికే ఆ వర్చువల్ మీటింగ్ పెట్టారు. దీనికిముందు ఏ ఉద్యోగితో గానీ, యూనియన్‌తో గానీ కంపెనీ మాట్లాడలేదు. అందరికీ పింక్ స్లిప్స్ ఇచ్చి చేతులు దులుపుకుంది.
కెనడాలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ ఉద్యోగుల సంఘం యూనిఫోర్ (Unifor) ఈ నిర్ణయాన్ని చాలా గట్టిగా వ్యతిరేకించింది. ఉద్యోగులను ఇంత అవమానకరంగా, నిర్దాక్షిణ్యంగా తొలగించే నిర్ణయం పెద్ద తప్పని చెబుతూ ప్రకటన విడుదల చేసింది. బెల్ కంపెనీ అవలంబించిన పద్ధతి సిగ్గుచేటని యూనిఫోర్ విరుచుకుపడింది.
4,800 మంది ఉద్యోగుల తొలగింపు
ఉద్యోగుల్లో 9 శాతం మందిని తొలగిస్తామని కెనడియన్ టెలికాం కంపెనీ ఫిబ్రవరిలో ప్రకటించింది. ఈ నిర్ణయం దాదాపు 4,800 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. ఉద్యోగుల ఖర్చులు తగ్గించుకోవడం కంపెనీకి చాలా ముఖ్యమని కంపెనీ సీఈవో మిర్కో బిబిక్ వివరించారు. ఆ తర్వాత, అదే కంపెనీ తన వాటాదార్లకు అధిక డివిడెండ్ కూడా ప్రకటించింది. ఓవైపు షేర్‌హోల్డర్లకు భారీ స్థాయిలో డివిడెండ్ ప్రకటించి, ఖర్చుల తగ్గింపు పేరిట ఉద్యోగులను రోడ్డుపై నిలబెట్టడం ఏంటని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు.. 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బెల్ 2.3 బిలియన్ డాలర్ల భారీ లాభాన్ని ఆర్జించింది.
జాబ్ లే-ఆఫ్స్ విషయంలో పూర్తిగా పారదర్శకంగా వ్యవహరించినట్లు బెల్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అలాన్ మర్ఫీ చెప్పారు. ప్రస్తుతం, ఉద్యోగుల తొలగింపుపై యూనియన్‌తో చర్చలు జరిగాయి. పింక్ స్లిప్ జారీ అయిన ఉద్యోగులందరితో HR విభాగం కూడా చర్చలు జరిపింది. ఈ చర్చల ఫలితంగా, బాధిత ఉద్యోగులకు ఊరట కలిగించే మొత్తంలో పరిహారం అందుతుంది. బెల్, దాని అనుబంధ సంస్థల్లో దాదాపు 19 వేల మంది ఉద్యోగులు ఎంప్లాయీ యూనియన్ యూనిఫోర్‌లో సభ్యులుగా ఉన్నారు.
మరో ఆసక్తికర కథనం: భారత్‌లో రికార్డ్ స్థాయిలో సంపన్నులు, ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నారబ్బా?