Byjus Loan Default: 


భారత్‌లోనే అత్యంత విలువైన స్టార్టప్‌ కంపెనీల్లో బైజూస్‌ ఒకటి! కరోనా టైమ్‌లో విపరీతంగా బూమ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఎడ్‌టెక్‌ కంపెనీ దివాలా అంచున నిలిచింది. అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడుతోంది.


బైజూస్‌ జూన్‌ 5న ఏకంగా రూ.329 కోట్లు వడ్డీగా చెల్లించాల్సి ఉంది. ఒకవేళ వడ్డీ చెల్లింపులో విఫలమైతే అప్పు ఎగ్గొట్టినట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే సోమవారమూ ఇంతపెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించడం కష్టమేనని ఇంటర్నల్‌ సోర్సెస్‌ ద్వారా తెలిసింది.


ప్రస్తుతం బైజూస్‌ నెత్తిన 1.2 బిలియన్‌ డాలర్ల (రూ.9892 కోట్లు) మేర అప్పు ఉంది. జూన్‌ 5న చెల్లించాల్సిన వడ్డీపై మాట్లాడాల్సిందిగా కోరగా కంపెనీ ప్రతినిధులు స్పందించలేదు. అప్పుల చెల్లింపుపై నియమించుకున్న సలహదారు కంపెనీ హులిహన్ లోకీ సైతం మీడియాకు అందుబాటులో లేదు.


చరిత్రలో ఒక స్టార్టప్‌ కంపెనీకి ఎలాంటి రేటింగ్‌ లేని అతిపెద్ద అప్పు ఇదే! ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు బైజూస్‌ రవీంద్రన్‌ చాలా శ్రమిస్తున్నారని తెలిసింది. లోన్‌ రీ స్ట్రక్చరింగ్‌ కోసం రుణదాతలతో సుదీర్ఘ కాలంగా సంప్రదింపులు జరుపుతున్నారు. కరోనా తర్వాత ఆన్‌లైన్‌ విద్యపై ఆసక్తి తగ్గిపోవడంతో ఆశించిన మేరకు రాబడి లేదు. దాంతో తమ డబ్బుల్ని వెంటనే చెల్లించాల్సిందిగా రుణదాతలు డిమాండ్‌ చేస్తున్నారు. పైగా వీరంతా ఒక సహకార ఒప్పందం చేసుకొని కన్సార్టియంగా ఏర్పడ్డారు.


బైజూస్‌ రుణం సెప్టెంబర్లో డాలర్‌కు 64.5 సెంట్లకు తగ్గిపోగా ప్రస్తుతం 78 సెంట్లకు పెరిగిందని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. తుది గడువైన జూన్‌ 5న వడ్డీ చెల్లిస్తేనే కంపెనీ అదనపు మూలధనం సమీకరించేందుకు అవకాశం ఏర్పడుతుంది.


ప్రస్తుతం కంపెనీ అప్పులు చెల్లించే పనిలో ఉందని ఒకవేళ ఏదైనా ఒక అప్పు ఎగ్గొడితే రుణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవుతుందని సమాచారం. వాస్తవంగా మార్చి 31లోపే కంపెనీ ఫైనాన్షియల్‌ అకౌంట్లను ఫైల్‌ చేయాల్సి ఉండగా... విదేశీ మారక ద్రవ్య విధానాల ఉల్లంఘనపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్‌ చేపట్టడంతో ఆలస్యమైంది.


Also Read: మార్కెట్లో బుల్‌ రన్‌! 18,614 మీదే కొనసాగుతున్న నిఫ్టీ!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది