Byjus News: ఒకప్పుడు, భారతదేశ అంకుర సంస్థల వ్యవస్థకు ముఖచిత్రంగా నిలిచిన బైజూస్‌ కష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి. బైజూస్‌ సీఈఓ రవీంద్రన్‌తో (Byju's CEO Raveendran) సహా కంపెనీ ఫౌండర్లను అనర్హులుగా ప్రకటించాలని, వారిని కుర్చీల నుంచి దింపేయాలని కోరుతూ NCLTలో (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) పిటిషన్‌ దాఖలైంది. 


పాత వాళ్లను తీసేయండి - కొత్త వాళ్లను నియమించండి         
రవీంద్రన్‌ సహా బైజూస్‌ ఫౌండర్లందరినీ తొలగించి, ఆ స్థానాల్లో కొత్త వారిని నియమించాలని కోరుతూ నలుగురు బైజూస్‌ ఇన్వెస్టర్లు NCLT బెంగళూరు బెంచ్‌ను ఆశ్రయించారు. కంపెనీ మేనేజ్‌మెంట్‌ అణచివేత ధోరణితో (oppression) వ్యవహరిస్తోందని, అధికార దుర్వినియోగం (mismanagement) చేసిందని ఆరోపించారు. 


కంపెనీ ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ గురించి కూడా ఇన్వెస్టర్లు తమ దావాలో ప్రస్తావించారు. ఫోరెన్సిక్ ఆడిట్‌ జరిపించడంతో పాటు కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని ఇన్వెస్టర్లతో పంచుకునేలా మేనేజ్‌మెంట్‌ను ఆదేశించాలని ఇన్వెస్టర్ల బృందం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. గురువారం సాయంత్రం ఈ పిటిషన్‌ దాఖలైంది.


ప్రోసస్, GA, సోఫినా, పీక్ XV అనే నాలుగు పెట్టుబడి కంపెనీలు ఈ పిటిషన్‌ వేశాయి. టైగర్ అండ్‌ ఔల్ వెంచర్స్‌ సహా మరికొందరు వాటాదార్లు కూడా పిటిషన్‌పై సంతకాలు చేసినట్లు సమాచారం.


రైట్స్‌ ఇష్యూ రద్దు కోసం విజ్ఞప్తి
ఇటీవలే ముగిసిన రైట్స్‌ ఇష్యూ చెల్లుబాటు కాదని ప్రకటించాలని, పెట్టుబడిదార్ల హక్కులకు భంగం కలిగించే ఎలాంటి నిర్ణయాన్ని కంపెనీ తీసుకోకుండా ఆదేశించాని ఇన్వెస్టర్లు NCLTని కోరారు. 


కంపెనీ విలువ పతనాన్ని అడ్డుకోవడానికి; షేర్‌హోల్డర్లు, ఉద్యోగులు, కస్టమర్ల ప్రయోజనాలు కాపాడేందుకే రైట్స్‌ ఇష్యూ రద్దు కోసం అభ్యర్థిస్తున్నట్లు పిటిషనర్లు వెల్లడించారు. ఇటీవలే, ముగిసిన రైట్స్‌ ఇష్యూలో, 200 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు బైజూస్‌కు హామీ లభించింది.


కంపెనీ డబ్బును ఫౌండర్లు దుర్వినియోగం చేశారని, అనుబంధ సంస్థ ఆకాష్‌పై నియంత్రణ కోల్పోయారని, బైజూస్ ఆల్ఫా తీసుకున్న రుణం కట్టలేక డిఫాల్ట్‌ కావడం, CFOను & స్వతంత్ర డైరెక్టర్‌ను నియమించకపోవడం వంటి పాలనపరమైన లోపాలను తమ పిటిషన్‌లో ప్రస్తావించారు. కంపెనీ చెల్లించని రుణాల్లో ఉద్దేశుపూర్వకంగా ఎగ్గొట్టిన అప్పులు కూడా ఉన్నాయని పిటిషనర్లు ఆరోపించినట్లు తెలుస్తోంది.


ఈ రోజు EGM          
మరోవైపు.. ఈ రోజు (శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024), వాటాదార్ల అసాధారణ సమావేశం (EGM) జరుగుతుంది. బైజు రవీంద్రన్‌ను CEO కుర్చీ నుంచి దించేయడంతో పాటు, కొత్త డైరెక్టర్ల బోర్డ్‌ను ఎన్నుకునే అజెండాతో వాటాదార్ల అసాధారణ సమావేశానికి ఇన్వెస్టర్‌ కంపెనీలు పిలుపునిచ్చాయి. 


EGMను నిలిపేయాలని కర్ణాటక హైకోర్టును బైజూస్‌ ఆశ్రయించినా భరోసా దక్కలేదు. ఈజీఎం రద్దుకు అంగీకరించిన కోర్ట్‌.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయొద్దని ఆదేశించింది.


ఆర్థికంగా తీవ్ర గడ్డు పరిస్థితుల్లో ఉన్న బైజూస్‌, ఇప్పుడు, తన ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంది. ఖర్చులు తగ్గించుకోవడానికి తన కార్యాలయాలను మూసేస్తోంది.


మరో ఆసక్తికర కథనం: బ్యాంక్‌, పోస్టాఫీస్‌ ఖాతాదార్లకు అలెర్ట్‌ - మార్చి 31లోగా ఈ పని చేయకపోతే జరిమానా