Byju’s: ముందే ఊహించిన ప్రకారమే బైజూస్‌ (Byju’s) సినిమా స్టోరీ రిలీజైంది. మన దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్ అయిన బైజూస్, 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో (2020-21 లేదా FY21) అత్యంత భారీ నష్టాలను మూటగట్టుకుంది. కేంద్రం మొట్టికాయ వేయడంతో, 18 నెలలు ఆలస్యంగా ఈ ఫలితాలను కంపెనీ బుధవారం ప్రకటించింది. 


రూ.4,588 కోట్ల నష్టం
FY21లో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని రూ.2,280 కోట్లకు మళ్లీ సర్దుబాటు (readjusted) చేసినప్పటికీ, రూ.4,588 కోట్ల నష్టాలను పోస్ట్‌ చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2019-20 లేదా FY20) వచ్చిన నష్టం కేవలం
రూ.262 కోట్లు. అంటే, FY20తో పోలిస్తే FY21లో నష్టం 19 రెట్లు పెరిగింది.  


ఇదే కాలంలో ఆదాయం కూడా  రూ.2,511 కోట్ల నుంచి తగ్గి రూ.2,280 కోట్లకు పరిమితమైంది. బైజూస్‌ను నడుపుతున్న థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ (Think & Learn Pvt Ltd) ఆడిట్ చేయని ఫలితాల్లో పేర్కొన్న సుమారు రూ.4,400 కోట్ల అంచనా ఆదాయంతో పోలిస్తే, ఇది 48% భారీ తగ్గుదల. మొత్తంగా, ఆర్థిక లెక్కల పరీక్షలో బైజూజ్‌ తప్పింది.


బైజూస్ వ్యవస్థాపకుడు & సీఈవో బైజు రవీంద్రన్, గత వారంలో మాట్లాడుతూ కంపెనీ లెక్కల్లో వ్యత్యాసాల గురించి షేర్‌హోల్డర్‌లకు వివరణ ఇచ్చారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వ్యాపార నమూనాలో మార్పులు వచ్చాయి కాబట్టి, ఆదాయ లెక్కల్లోనూ వ్యత్యాసాలు కనిపించాయని చెప్పారు. 2020 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, FY21లో ఆదాయం గణనీయంగా పెరిగిందని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ మొత్తాన్ని FY22కు బదిలీ చేశామని చెప్పుకొచ్చారు.


FY22 ఆదాయం రూ.10,000 కోట్లట!
2022 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం దాదాపు ఐదు రెట్లు పెరిగిందని, 10,000 కోట్ల రూపాయల స్థూల ఆదాయాన్ని సాధించినట్లు ఈ ఎడ్‌టెక్‌ కంపెనీ బుధవారం ప్రకటించింది. అయితే, ఇవి కూడా ఇప్పటికీ ఆడిట్ చేయని ఫలితాలే. వీటి నుంచి ఎంతా లాభాన్ని లేదా నష్టాన్ని గడించారో మాత్రం వెల్లడించలేదు.


బెంగుళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈ ఎడ్‌టెక్‌ కంపెనీ, ప్రస్తుతం 22 బిలియన్‌ డాలర్ల వాల్యుయేషన్‌తో దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్‌గా నిలుస్తోంది. 


FY21 ఫలితాల వెల్లడిలో సుదీర్ఘ ఆలస్యం చేసిన బైజూస్‌ మీద కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) సీరియస్‌ అయింది. FY21 ముగిసి ఏడాదిన్నర గడిచినా ఆ ఆర్థిక సంవత్సరం ఖాతాలను ఇప్పటి వరకు ఎందుకు సమర్పించలేదో వివరించాలని సూచిస్తూ, గత నెలలో బైజూస్‌కి శ్రీముఖం పంపింది. కేంద్ర మంత్రిత్వ శాఖ స్వయంగా రంగంలోకి దిగడం వల్లే బైజూస్‌ దిగి వచ్చింది, ఫలితాలు ప్రకటించింది. లేకపోతే, ఇంకెన్ని నెలలు వాయిదా వేసేదో. 


FY21 ఆడిట్‌ ఆలస్యంగా జరిగినా, అందులో మోసం చేయలేదని తాను చాలా మంది పెట్టుబడిదారులతో మాట్లాడానని రవీంద్రన్‌ వివరించారు. FY21 నంబర్లను వాళ్లు పట్టింటుకోవడం లేదని, FY22 & FY23 గురించి మాత్రమే వాళ్లు ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. 


FY22 లెక్కలు ఎప్పుడో?
మరోవైపు, 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసి ఈ నెలతో 6 నెలలు అయింది. అంటే రెండు త్రైమాసికాలు దాటాయని భావించొచ్చు. ఇప్పటికీ FY22 లెక్కల మీద అతీగతీ లేదు. దీనిని ఎప్పటికి ప్రకటిస్తారో చూడాలి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.