భారత ఆర్థిక పురోగతికి సంబంధించి ఈ బడ్జెట్ సమావేశాలు ప్రపంచంలో ఆత్మవిశ్వాసం నింపుతాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సమావేశాల్లో చర్చలు ఆరోగ్యవంతంగా జరిగేలా చూడాలని ప్రతిపక్షాలకు ఆయన పిలుపునిచ్చారు. సమావేశాలపై ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదన్నారు. కానీ బడ్జెట్ ఈ ఏడాదికి సంబంధించిన అంశమని వెల్లడించారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
'ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ సెషన్‌కు ఎంపీలందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. ప్రపంచం నేడు ఉన్న పరిస్థితుల్లో భారత్‌కు ఎన్నో సువర్ణావకాశాలు ఉన్నాయి. మన దేశ ఆర్థిక పురోగతి, కరోనా టీకా పథకం, స్వదేశీ టీకాలకు సంబంధించి ఈ బడ్జెట్ సమావేశాలు ప్రపంచంలో ఆత్మవిశ్వాసం నింపుతాయి' అని ప్రధాని మోదీ అన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం బడ్జెట్ సమావేశాలపై కచ్చితంగా ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. 'నిజమే, ఎన్నికలు బడ్జెట్ సమావేశాలు, చర్చలపై ప్రభావం చూపుతాయి. కానీ ఎన్నికల ప్రక్రియ నిరంతరం కొనసాగే ప్రక్రియ అని సభ్యులందరికీ విన్నవిస్తున్నా. బడ్జెట్ సమావేశాలు ఏడాది మొత్తానికి ఒక బ్లూప్రింట్‌గా ఉంటాయి. ఈ సమావేశాలు ఎంత బాగాసాగితే దేశానికి ఆర్థికంగా అంత మేలు జరుగుతుంది' అని ఆయన పేర్కొన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో చర్చలు ఆరోగ్యవంతంగా సాగేలా చూడాలని రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలను నరేంద్ర మోదీ కోరారు. సభ్యులు కచ్చితంగా తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చని, కీలక అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. 'ఈ సెషన్‌లోనూ చర్చలను ఓపెన్ మైండ్‌తో చేద్దాం. ప్రపంచంపై మనదైన ముద్ర వేసేందుకు ఇదో మంచి అవకాశం. దేశం వేగంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన చర్చలు చేపట్టాలని రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలను కోరుతున్నా' అని తెలిపారు.
బడ్జెట్ సమావేశాలకు ముందు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి మొదట ప్రసగించడం ఆనవాయితీ. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 2-11 వరకు లోక్‌సభ సాయంత్రం 4-9 మధ్య జరుగుతుంది. రాజ్యసభ ఉదయం మొదలవుతుంది. కరోనా నేపథ్యంలో సభ్యుల మధ్య భౌతిక దూరాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. గ్యాలరీలు, ఛాంబర్లలోనూ సీటింగ్ ఏర్పాటు చేశారు.