Gen Z Expactation From Budget 2024 : మరో పదిహేను రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికల(General Elections 2024) షెడ్యూల్ విడుదలకానుంది. కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం ఫైనల్‌ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంది. ఈ టైంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌(Nirmala Sitaraman) ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై అందరి చూపు నెలకొని ఉంది. ఇది పేరుకే తాత్కాలిక బడ్జెట్(InterimBudget) అయినా చాలా వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో నిర్మలమ్మ ఎలాంటి కోతలు, వాతలు పెడతారో అన్న ఆసక్తి నెలకొంది. 


భారీగా అంచనాలు పెట్టుకున్న జనరేషన్ జెడ్‌ 


ముఖ్యంగా జనరేషన్ జెడ్‌లో ఈ బడ్జెట్‌పై భారీ అంచనాలో ఉన్నాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యోగ కల్పన, విద్యాసంస్కరణలు, పన్ను రాయితీపై అంశాలపై వీళ్ల ఫోకస్ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. 2000 తర్వాత పుట్టిన వారిని జెడ్‌ జనరేషన్ అంటారు. ఈ జెడ్‌ జనరేషన్ టెక్నికల్‌ సావీగా ఉంటారు. జీవితంపై క్లారిటీతో సమాజం పట్ల పూర్తి అవగాహనతో ఉంటారు. ప్రపంచ జనాభాలో వీళ్లదే పైచేయి. సుమారు 45 నుంచి 50 శాతం వరకు జనరేషన్ జెడ్‌ ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. అందుకే ప్రభుత్వాలు తీసుకుంటున్న పాలసీలు వీళ్లను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. 


లేఫ్‌ ఆఫ్‌లకు అడ్డుకట్ట పడేలా


ప్రస్తుతం లేఆఫ్‌ల దశ నడుస్తోంది. గతేడాది కార్పొరేట్ ఉద్యోగాల్లో భారీగాకోతలు పడ్డాయి. ఈ ఏడాది కూడా అంతకు మించి ఉంటాయన్న టాక్ నడుస్తోంది. ఇలాంటి టైంలో వాటికి అడ్డుకట్ట పడేలా ప్రభుత్వం చర్యలు ఉండాలని ఆశిస్తోందీ జనరేషన్. అందుకే బడ్జెట్‌లో అద్భుతాలు ఉండాలని కోరుకుంటున్నారు. 


విద్యపై మరింత ఫోకస్‌


ప్రస్తుత కాలంలో విద్య చాలా భారంగా మారిపోతోంది. ఓ దశ దాటి తర్వాత చదవాలని యువతరానికి ఉన్నప్పటికీ చదివించే స్థాయిలో పేరెంట్స్ ఉండటం లేదు. ఆర్థిక కమిట్‌మెంట్స్‌లో పై చదువులు చదవలేక ఏదో జాబ్‌లో సెటిల్‌ అయిపోతున్నారు. అందుకే అలాంటి వారికి వెసులుబాటు కలిగేలా విద్యారుణాలపై కరుణించాలని ఆశిస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో విద్యకు ఇచ్చే కేటాయింపులు పెంచాలని కోరుతున్నారు. విద్యాసంబంధిత వస్తుసేవలపై జీఎస్టీ స్లాబ్స్ విషయంలో కూడా కాస్త కనికరించాలని కోరుతున్నారు. 


విద్యారుణాలపై భారం పడకుండా 


విద్యతోపాటు నైపుణ్యాభివృద్ధి విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచిస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను అప్‌స్కిల్‌ చేయాలంటే ప్రభుత్వం చొరవ తప్పనిసరి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
విద్యాసంబంధిత వస్తుసేవలపై జీఎస్టీ భారాన్ని తగ్గించాలని ఉత్పత్తిదారులు కోరుకుంటున్నారు. దీని వల్ల విద్యార్థుల తల్లిదండ్రులపైనే భారం పడుతోందని అంటున్నారు. స్లాబ్స్‌లో మార్పులు చేర్పులు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం 18 శాతం స్లాబ్‌లో ఉన్న వాటికిని 5 శాతానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు. 


ఆన్‌లైన్‌ స్టడీస్‌కు మరింత ప్రాధాన్యత


నేటి విద్యా విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌ స్టడీస్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకే ఆ దిశగా కూడా కార్యచరణ ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా మారుమూల పల్లెల్లో ఉన్న ప్రజలకు విద్య అందేలా సాంకేతికత పెంచాలని అంటున్నారు. ఆ దిశగా దేశంలో మౌలిక సదుపాయాలు పెంపొందించాలని వేడుకుంటున్నారు. 


మారుమాల ప్రాంతాలకు చేరువయ్యేలా 


మారుమూల పల్లెల్లో ఉన్న విద్యార్థులు కూడికలు తీసివేతలు చేయడంలో ఇబ్బంది పడుతున్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి వారిని గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణిచ్చేలా సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు. అదే టైంలో వారికి ఇష్టమైన రంగంలో నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చూడాలంటున్నారు. దీని కోసం ప్రభుత్వ ప్రైవేట భాగస్వామ్యంతో ఈ గ్యాప్‌ను ఫుల్‌ఫిల్‌ చేయాలని హితవు పలుకుతున్నారు. పరిశ్రమకు కావాల్సిన స్కిల్స్‌ను విద్యార్థుల్లో పెంపొందించేలా ఓ వారధి ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. 


న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి ఊతం ఇచ్చేలా


2020లో తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మరింతగా అమలు కావాలంటే కూడా విద్యపై పెట్టే ఖర్చు మరింత పెరగాలని సూచిస్తున్నారు విద్యా నిపుణులు. ఈ విద్యా విధానంలో తీసుకొచ్చిన డ్యూయల్‌ డిగ్రీ, క్రెడిట్ బేస్డ్‌ సిస్టమ్‌ ఇప్పటికే జనాల్లోకి వెళ్లింది. విద్యార్థులు కూడా దానికి తగినట్టుగానే సిద్ధమవుతున్నారు. ఇలాంటి టైంలో విద్యారుణాలపై కాస్త కరుణిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు. వారివారి నైపుణ్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అవుతుందని చబుతున్నారు.