Budget 2024 Expectations: బుధవారం (31 జనవరి 2024) నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గురువారం రోజున (2024 ఫిబ్రవరి 01), మోదీ ప్రభుత్వం తరపున, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశ పెడతారు.
మధ్యంతర బడ్జెట్‌లో రైతులకు గుడ్‌న్యూస్!
ప్రాథమిక రంగమైన వ్యవసాయానికి, ముఖ్యంగా రైతులకు ఈ మధ్యంతర బడ్జెట్‌లో (Interim Budget 2024) గుడ్‌న్యూస్ వినిపిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ రంగం కోసం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్య పథకాల్లో 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (Pradhan Mantri Kisan Samman Nidhi) ఒకటి. రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పథకం ఇది. దీనిని పీఎం కిసాన్ (PM-KISAN) యోజన అని కూడా పిలుస్తున్నారు.
సాగు చేయదగిన భూమి కలిగిన అన్ని రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లక్ష్యం. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి 6 వేల రూపాయలను నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల, దేశవ్యాప్తంగా దాదాపు 11 కోట్ల మంది భూమి కలిగిన రైతులు లబ్ధి పొందుతున్నారు. ఒక్కో విడతలో రూ. 2 వేలు చొప్పున, మొత్తం 3 విడతల్లో, ఒక సంవత్సరంలో 6 వేల రూపాయలను రైతులు అందుకుంటున్నారు. ఈ డబ్బు వ్యవసాయ పెట్టుబడులకు, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగపడుతోంది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం దుర్వినియోగం కాకుండా, ఆధార్‌తో అనుసంధానమైన రైతు బ్యాంక్ అకౌంట్‌లోకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది.
ప్రత్యక్ష నగదు బదిలీ కింద రైతులకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని 2024 మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని, ఈ విషయాన్ని తమకు ప్రభుత్వ వర్గాలు చెప్పాయని వెల్లడిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా (ToI) ఒక వార్తను ప్రచురించింది. ఆ వార్త ప్రకారం, రైతులకు ఏటా ఇస్తున్న పెట్టుబడి సాయం 6 వేల రూపాయలను మోదీ సర్కార్ రూ. 8,000 లేదా రూ. 9,000లుగా చేయవచ్చు. ఈ విషయంలో రైతులకు తీపి కబురు చెప్పే రెండు ఆప్షన్లు బడ్జెట్‌లో ఉంటాయని అధికార్లు చెప్పినట్లు ToI వెల్లడించింది.
రైతులకు సాయంలో రెండు ఆప్షన్లు!
ఆప్షన్ 1) ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కింద చెల్లించే వార్షిక మొత్తం రూ. 8,000కు పెంచితే... తడవకు రూ. 2,000 చొప్పున 4 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
ఆప్షన్ 2) రైతులకు ఏడాదిలో చెల్లించే మొత్తాన్ని రూ. 9,000కు పెంచితే, తడవకు రూ. 3,000 చొప్పున 3 విడతలుగా బ్యాంక్ అకౌంట్లలో క్రెడిట్ చేస్తారు.
మహిళ రైతులకు మరింత ఎక్కువ మొత్తం!
మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రక్రియలో భాగంగా, పురుష రైతుల కంటే మహిళా రైతులకు ఎక్కువ మొత్తాన్ని నిర్మలమ్మ ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే, మహిళా రైతులు ప్రతి సంవత్సరం రూ. 10,000 నుంచి రూ. 12,000 వరకు అందుకొవచ్చు.
ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది?
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద, దేశవ్యాప్తంగా రైతులకు ఏటా బదిలీ చేస్తున్న మొత్తం డబ్బు దాదాపు రూ. 66,000 కోట్లు. ఒక్కో రైతుకు ఏడాదికి ఇచ్చే నగదును రూ. 8,000కు పెంచితే, వార్షిక కేటాయింపుల మొత్తం రూ. 88,000 కోట్లకు పెరుగుతుంది. ఒక్కో రైతుకు రూ. 9,000 చొప్పున ఆర్థిక మద్దతు ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయిస్తే, దాదాపు 11 కోట్ల మంది రైతులకు చెల్లించడానికి మొత్తం దాదాపు రూ. 99,000 కోట్లు కావాలి.
పీఎం కిసాన్ పథకాన్ని 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. అధికార గణాంకాలను బట్టి చూస్తే... గత ఆర్థిక సంవత్సరం 2022-23లో, అర్హత గల లబ్ధిదార్లకు ఈ స్కీమ్ ద్వారా మొత్తం రూ. 58,201.85 కోట్లు పంపిణీ జరిగింది. పథకం ప్రారంభమై తర్వాత, ఇప్పటి వరకు, కేంద్ర ప్రభుత్వం 15 విడతల్లో (ఏడాదికి 3 విడతలు) 11 కోట్ల మందికి పైగా రైతులకు 2.8 లక్షల కోట్ల రూపాయలను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది.
మరో ఆసక్తికర కథనం: పన్నుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు - ఇండస్ట్రీ కోర్కెలు చాలా ఉన్నాయి!