Budget 2024 Expectations: కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ముందు, 2024 ఫిబ్రవరి 1న, మోదీ 2.0 గవర్నమెంట్‌లో చివరి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటిస్తారు. ఆదాయ పన్నుకు సంబంధించి... మినహాయింపు పరిమితిని పెంచడం నుంచి మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు వరకు.. మధ్యంతర బడ్జెట్‌ మీద పారిశ్రామికవర్గాలకు చాలా అంచనాలు ఉన్నాయి. 


పన్ను రాయితీ పరిమితి ‍‌(Tax Rebate Limit)
ఆదాయ పన్ను సెక్షన్ 87A కింద, వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకు రూ.7 లక్షల పన్ను రాయితీ లభిస్తోంది. ఆ పరిమితిని నిర్మలమ్మ రూ.8 లక్షలకు పెంచుతారేమోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వ్యక్తిగత పన్ను పరిమితిని పెంచితే, పన్ను చెల్లింపుదార్ల చేతిలో కొంత డబ్బు మిగులుతుంది. దానిని వస్తువులు కొనడానికి, పొదుపు/పెట్టుబడుల కోసం ఉపయోగిస్తారు. ఫైనల్‌గా, టాక్స్‌పేయర్ల దగ్గర మిగిలే డబ్బు పారిశ్రామిక రంగంలోకి ప్రవహిస్తుంది, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఉపయోగపడుతుంది.


పెద్ద, చిన్న పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం ఒకే గాటన కట్టకూడదని భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ NG ఖైతాన్ చెబుతున్నారు. దీర్ఘకాలిక పన్నుల విధానం ఉండాలని అంటున్నారు. ప్రస్తుతం, పెద్ద ఉత్పత్తి కంపెనీలతో సమానంగా MSMEలపైనా (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) అధిక పన్నుల భారం ఉంది. GDP వృద్ధిలో, ఉపాధి కల్పనలో భారీ సహకారం అందిస్తున్న MSMEలపై అంత బరువు పెట్టకూడదన్నది ఖైతాన్ అభిప్రాయం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై టాక్స్‌ బర్డెన్‌ తగ్గిస్తే, వర్ధమాన పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహించినట్లేనని ఆయన చెబుతున్నారు.


వ్యక్తిగత పన్నుల విషయంలో ఒక హైబ్రిడ్ విధానాన్ని కూడా మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఆశిస్తున్నారు. దీనికోసం, ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌లో ఒక రోడ్‌మ్యాప్‌ ప్రకటిస్తారని భావిస్తున్నారు. 


మన దేశంలో హరిత ఇంధనాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తులను పెంచడానికి PLI వంటి స్కీమ్‌ల రూపంలో కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి క్యాపిటల్‌ గూడ్స్‌ మీద,  ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీల వంటి ముడి వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించవచ్చని ఇండస్ట్రీ ఆశిస్తోంది. 


కస్టమ్స్ వివాదాలను సులభంగా పరిష్కరించేందుకు ఒక యంత్రాంగాన్ని, GST సంబంధిత సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని నిర్మలమ్మ పరిశీలించవచ్చని పారిశ్రామిక రంగం నమ్మకంతో ఉంది.


మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను రాయితీలు ‍‌(Tax Relaxations For Women Entrepreneurs)
మహిళా పారిశ్రామికవేత్తలపై పన్నులను తగ్గించే అంశంపై నిర్మలమ్మ దృష్టి పెట్టవచ్చని పారిశ్రామిక రంగ నిపుణులు భావిస్తున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను రాయితీలు కల్పించడంతోపాటు... ఉద్యోగాలు చేసే తల్లులకు వేతనంతో కూడిన సెలవుల సంఖ్యను పెంచితే బాగుంటుందని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్‌పర్సన్ రాధికా దాల్మియా చెబుతున్నారు. రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన (Rashtriya Swasthya Bima Yojana) అలవెన్స్‌ పెంచడం, బాలికల విద్య కోసం  ప్రయోజనాలను పెంచడం వంటివి కూడా ఈ బడ్జెట్‌లోని ముఖ్యాంశాలుగా నిలవాలని ఆశిస్తున్నారు. 


రాబోయేది మధ్యంతర బడ్జెట్‌ అయినా.. పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రయోజనాలపై ఇది కొన్ని హింట్స్‌ ఇచ్చే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.


మరో ఆసక్తికర కథనం: