Budget 2025: భారతదేశంలోని విమానయాన రంగం బడ్జెట్ 2025 కోసం ఎదురు చూస్తుంది. ఈ క్రమంలోనే నిపుణులు ఈ రంగం ఎదుగుదల కోసం కొన్ని కీలక చర్యలను ఆశిస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ సప్లై చైన్ సమస్యలు, నూతన ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధి, మైలేజ్ మెయింటెనెన్స్ (MRO) సేవలు, స్థిరమైన ఇంధన పరిజ్ఞానం, టికెట్ ధర నియంత్రణ వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
విమానయాన రంగానికి UDAN పథకంలో మరింత మద్దతు
గ్రాంట్ థార్న్‌టన్ భారత్ భాగస్వామి అశీష్ ఛవ్చరియా మాట్లాడుతూ.. ‘ఉడాన్’ (Ude Desh Ka Aam Nagarik) పథకానికి మరింత నిధులు కేటాయించాలని, కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లను ప్రారంభించాలని, అలాగే స్థిరమైన ఇంధన పరిజ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు బడ్జెట్ 2025 లో చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, విమాన మరమ్మత్తు (MRO) సేవలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా భారతదేశంలోనే ఎయిర్‌క్రాఫ్ట్ మైన్‌టెనెన్స్, రిపేర్ సదుపాయాలను పెంచవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఎయిరిండియా MRO ట్రైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఇందుకు ఒక మంచి ఉదాహరణగా మారిందని ఆయన అన్నారు.
గ్లోబల్ సప్లై చైన్ సమస్యలు
నిపుణులు గ్లోబల్ సప్లై చైన్ ఇబ్బందులు భారత విమానయాన రంగంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యల కారణంగా విమానాలు, ఇంజిన్‌లు, అవసరమైన విడిభాగాల సరఫరాలో తీవ్ర ఆలస్యాలు చోటు చేసుకుంటున్నాయి. జేఎస్ఏ అడ్వకేట్స్ & సోలిసిటర్స్ భాగస్వామి పూనమ్ వర్మా సెంగుప్తా మాట్లాడుతూ.. 100కి పైగా విమానాలు విడిభాగాల సరఫరా ఆలస్యాల కారణంగా గ్రౌండ్ అయ్యాయని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తక్కువ వడ్డీ రుణాలను అందించడంపై దృష్టి పెట్టాలని, అలాగే కేప్ టౌన్ సమావేశం(Cape Town Convention) లాంటి అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా విధానాలను అమలు చేయాలని సూచించారు.
ప్రాంతీయ ఎయిర్‌పోర్ట్‌లకు ప్రోత్సాహం అవసరం
భారతదేశంలోని రెండో, మూడో స్థాయి పట్టణాల్లో విమానయాన వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నా, ప్రయాణికుల తక్కువ డిమాండ్ వల్ల కొంత వెనుకబడిన పరిస్థితి నెలకొంది. వికసిత్ భారత్ 2047(Viksit Bharat 2047) దిశగా దేశవ్యాప్తంగా 350 విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలి అని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ ఆపరేటింగ్ ఖర్చులతో విమానయాన సంస్థలకు ప్రోత్సాహకాలు అందించాలి. ఎయిర్‌పోర్ట్ సదుపాయాలను మెరుగుపరచి ప్రయాణికులను ఆకర్షించాల్సిన అవసరం ఉంది.
బాంబ్ బెదిరింపులు, సైబర్ భద్రత సమస్యలు
ఇటీవల కాలంలో హోక్స్ బాంబ్ బెదిరింపుల కారణంగా విమానయాన కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ బెదిరింపులను అణచివేయడానికి ప్రభుత్వం మరింత సమర్థమైన దర్యాప్తు సంస్థలతో నిఘా పెంచాలి అని సెంగుప్తా సూచించారు. అదనంగా, ఎయిర్‌లైన్ కార్యకలాపాలకు అలాగే ప్రయాణికుల భద్రత కోసం సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
ఫెస్టివ్ సీజన్‌లో టికెట్ ధరల నియంత్రణపై చర్చ
ప్రతీ పండుగ సీజన్‌లో విమాన టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు ఎయిర్‌ఫేర్ నియంత్రణ కోసం ప్రభుత్వం క్వాసి-జ్యుడీషియల్ బాడీని ఏర్పాటు చేయవచ్చు అనే విషయంపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతోంది. ఇది ప్రయాణికుల ప్రయోజనాలకు ఉపయోగపడే నిర్ణయంగా మారవచ్చు. భారత విమానయాన రంగం ప్రపంచస్థాయి సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, బడ్జెట్ 2025లో సరైన విధానాలు, పెట్టుబడులు, ప్రోత్సాహకాల ద్వారా ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయొచ్చు. ముఖ్యంగా, UDAN పథకం, MRO సేవలు, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు, స్థానిక విమాన తయారీ, టికెట్ ధర నియంత్రణ, సైబర్ భద్రత, గ్లోబల్ సప్లై చైన్ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.