Budget 2024 Date and Time: యావద్దేశం కళ్లన్నీ ఆర్థిక మంత్రి నిర్మలమ్మ (Finance Minister Nirmala Sitharaman) మీదే ఉన్నాయి. ఆమే ప్రత్యక్ష దైవం ఇప్పుడు. వరాలు ఇవ్వాలన్నా, వాతలు పెట్టాలన్నా నిర్మలమ్మ చేతుల్లోనే ఉంది. 


ఈ ఏడాది ఫిబ్రవరి 1న, నిర్మల సీతారామన్ వరుసగా ఆరో బడ్జెట్‌ ప్రకటిస్తారు. లోక్‌సభ ఎన్నికలకు భారతదేశం సమాయత్తం అవుతోంది కాబట్టి, ఈసారి ప్రవేశపెట్టేది మధ్యంతర బడ్జెట్  (Interim Budget 2024). అంటే, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అవసరమయ్యే ఖర్చుల కోసం ఈ బడ్జెట్‌ ప్రకటిస్తారు. కొత్త సర్కారు కొలువుదీరగానే పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్‌ ముందుకు (దేశ ప్రజల ముందుకు) తీసుకొస్తారు. 


2024 ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ‍‌(Budget 2024 Date and Time), తన బడ్జెట్‌ను నిర్మలమ్మ పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. వాస్తవానికి, కొన్నేళ్ల ముందు వరకు బడ్జెట్‌ సమయం & తేదీ అవి కాదు.


బడ్జెట్ సమయం: ఉదయం 11 గంటలకు ఎందుకు?


భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు, బ్రిటిష్‌ పరిపాలన సమయంలో, ఫిబ్రవరి నెలలో చివరి పని దినం నాడు సాయంత్రం 5 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేవారు. ఆ టైమ్‌నే ఎందుకు ఎంచుకున్నారంటే... యునైటెడ్ కింగ్‌డమ్ (UK) సమయం కంటే భారతదేశ సమయం నాలుగున్నర గంటలు ముందుంటుంది. భారత్‌లో సాయంత్రం పూట బడ్జెట్‌ను ప్రవేశపెడితే, యూకే కాలమానం ప్రకారం పగటి పూట బడ్జెట్‌ ప్రకటించినట్లు అవుతుంది. ఈ ప్రకారం, భారత్‌లో సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెడితే, పగటి పూట బడ్జెట్‌ను ప్రకటించారని UK నిర్ధరిస్తుంది.


1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో, అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా  ఈ పద్ధతిని మార్చారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా భారత్‌లో బ్రిటిష్‌ సమయాన్ని పాటించడమేంటన్న ఉద్దేశంతో... ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ సమర్పించాలని ప్రతిపాదించారు. పైగా, ఉదయం పూట బడ్జెట్‌ ప్రవేశపెడితే.. పార్లమెంటులో మంచి చర్చకు అవకాశం దొరుకుందని సిన్హా చెప్పారు.


1999 ఫిబ్రవరి 27న, భారతదేశంలో మొదటిసారిగా ఉదయం 11 గంటలకు ఆర్ధిక బడ్జెట్‌ను యశ్వంత్‌ సిన్హా సమర్పించారు. ఆ విధంగా భారతదేశ బడ్జెట్‌లో బ్రిటిష్‌ వాసనలు కొంత వరకు తగ్గాయి. అప్పటి నుంచి ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది.


బడ్జెట్ తేదీ: ఫిబ్రవరి 1న ఎందుకు?


1999 నుంచి 2017 వరకు, దాదాపు రెండు దశాబ్దాల పాటు, ఫిబ్రవరి నెలలోని చివరి పని దినం రోజున కేంద్ర బడ్జెట్‌ను సమర్పించడం కొనసాగింది. 2017లో, నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ తేదీ మారింది. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ, ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెడతామని ప్రకటించారు. వలసవాద కాలం నాటి ఆచారాన్ని మనమెందుకు అనుసరించాలని ప్రశ్నించారు. 


ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (Financial year) ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి నెలలో చివరి రోజున బడ్జెట్‌ను సమర్పిస్తే, కొత్త ఆర్థిక సంవత్సరానికి సమాయత్తం కావడానికి కేవలం నెల రోజులు (మార్చి నెల) మాత్రమే సమయం ఉంటుంది. దీనివల్ల, కొత్త విధానాలు రూపొందించడానికి కేంద్రానికి తగినంత సమయం ఉండడం లేదని జైట్లీ చెప్పారు. ఫిబ్రవరిలో చివరి పని దినం నాడు కాకుండా, మొదటి రోజున బడ్జెట్‌ సమర్పించడం ప్రారంభించారు. దీంతో, భారతదేశ బడ్జెట్‌లో బ్రిటిష్‌ వాసనలు పూర్తిగా తొలగిపోయాయి. అప్పటి నుంచి, కేంద్ర బడ్జెట్‌ను ఏటా ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు సమర్పించడం సాంప్రదాయంగా మారింది.


మరో ఆసక్తికర కథనం: యాన్యుటీ-పెన్షన్‌ ప్లాన్స్‌పై పన్ను తీసేస్తారా, టర్మ్‌ ప్లాన్స్‌కు ప్రత్యేక మినహాయింపు ఇస్తారా?