FIIs Selloff: గత రెండు నెలల పాటు నికర కొనుగోలుదార్లుగా (net buyers) ఉన్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదార్లు (FIIs), 2023 జనవరిలో మళ్లీ ఒరిజినల్‌ క్యారెక్టర్‌ని బయటకు తీశారు, అమ్మకాల జోరు పెంచారు. రేపు (బుధవారం) కేంద్ర బడ్జెట్ రానుండగా, జనవరి నెలలోని తొలి 30 రోజుల్లో దాదాపు రూ. 30,000 కోట్ల విలువైన ఇండియన్‌ స్టాక్స్‌ను ఆఫ్‌లోడ్ చేశారు. సగటున రోజుకు రూ. 1,000 కోట్లు వెనక్కు తీసుకున్నారు.


ఈ నెలలోని చాలా రోజులు ఎఫ్‌ఐఐలు నెట్‌ సెల్లర్స్‌గా నిలవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు ఒత్తిడిలో పడ్డాయి. సోమవారం ఒక్క రోజే, విదేశీ మదుపుదార్లు దాదాపు రూ. 6,792.8 కోట్ల అమ్మకాలు జరిపినట్లు తాత్కాలిక డేటా చూపుతోంది.


దేశీయ సంస్థాగత పెట్టుబడిదార్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి బలమైన కొనుగోలు మద్దతు ఉన్నప్పటికీ.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI), ఏషియన్ పెయింట్స్ ‍‌(Asian Paints), టైటన్ ‍‌(Titan) సహా అనేక బ్లూచిప్స్‌ రెండకెల్లో నష్టపోవడంతో నిఫ్టీ ఈ నెలలో 2.5% క్షీణించింది. మార్కెట్‌లోని మొత్తం కౌంటర్లు, ముఖ్యంగా బ్యాంకులు భారీగా దెబ్బతిన్నాయి.


ఇండియన్‌ ఈక్విటీలను FIIలు ఎందుకు విక్రయిస్తున్నారు?
చైనాలో కరోనా, ఆ తర్వాత అనుసరించిన జీరో కొవిడ్‌ పాలసీ కారణంగా ఆ దేశ స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. గత 3 సంవత్సరాల్లో విస్తృతంగా అమ్మకాలు జరగడంతో చైనీస్ ఈక్విటీలు చాలా చౌకగా మారాయి. హాంగ్‌కాంగ్‌లో లిస్ట్‌ అయిన చైనీస్ స్టాక్స్‌ గేజ్ అయిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ (HSI - Hang Seng Index ) 2020లో 3.4%, 2021లో 14%, 2022లో మరో 15% నష్టపోయింది. అక్కడ, మూడేళ్ల తర్వాత ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరవడం ఆశలను రేకెత్తించింది. 


భారత మార్కెట్ల విషయానికి వస్తే.. నిఫ్టీ 18,000 మార్క్ పైన, చారిత్రాత్మక విలువ స్థాయుల కంటే పైన ఉండటంతో చాలా ఎఫ్‌ఐఐలు ఇక్కడ సౌకర్యవంతంగా ఫీల్‌ అవ్వలేదు. దీంతో, ఎఫ్‌ఐఐల చూపు డ్రాగన్‌ కంట్రీ వైపు వైపు తిరిగింది. ఇండియన్‌ ఈక్విటీలను అమ్మేసి, వేల కోట్లను తీసుకెళ్లి చైనా మార్కెట్లలో పెట్టుబడులుగా పెడుతున్నారు.


FIIల భారీ సెల్లింగ్స్‌లో ఫైనాన్షియల్‌, ఐటీ స్టాక్స్‌ది పెద్ద భాగం. ఈ పరిస్థితుల్లోనూ, మెటల్స్‌ & మైనింగ్ స్టాక్స్‌లో విదేశీ మదుపుదార్లు కొనుగోళ్లు చేస్తూ వచ్చారు.


ఇండియన్‌ ఈక్విటీల నుంచి చైనా మార్కెట్‌కు పెట్టుబడులు తరలి వెళ్లడాన్ని స్ట్రాటెజిక్‌ రిస్క్‌గా చూడాలని చెబుతున్న జెఫరీస్.. ఆసియా & అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారతదేశం అత్యుత్తమ దీర్ఘకాలిక వృద్ధి ప్రధాయినిగా కొనసాగుతుందని నమ్మకంగా ఉంది.


ఎఫ్‌ఐఐల విక్రయాలు కొనసాగుతాయా?
చరిత్రను తిరగేసి, గత 11 ఏళ్లలోని ఫిబ్రవరి నెలలను గమనిస్తే.. 8 సందర్భాల్లో FIIల పెట్టుబడులు సానుకూలంగా ఉన్నాయి. 2016 ఫిబ్రవరి (రూ. 5,521 కోట్లు), 2018 (రూ. 11,037 కోట్లు), 2022లో (రూ. 35,592 కోట్లు) మాత్రం అమ్మకాలు కనిపించాయి.


2022 డిసెంబర్ త్రైమాసిక ఆదాయాల్లో చాలా నిఫ్టీ కంపెనీలు మార్కెట్‌ అంచనాలను అధిగమించాయి. దీనిని బట్టి, మన పరిస్థితి బ్రహ్మాండంగా లేకపోయినా, ద్రరిద్రంగా మాత్రం లేదు. ఇప్పుడు, అందరి దృష్టి రెండు కీలక ఈవెంట్ల మీద ఉంది. అవి.. యూనియన్ బడ్జెట్, ఫెడ్ సమావేశ ఫలితం.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.