బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రభుత్వంలోని లోపాలు ఎత్తి చూపుతూ నిలదీసేందుకు విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సభ ప్రారంభమవుతుంది. ఇప్పటికే విపక్షాలు తమ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఆ పార్టీ బాటలోనే ఆప్ నడుస్తూ రాష్ట్రపతి ప్రసంగానికి దూరమైంది.


మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి బడ్జెట్. 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 9 బడ్జెట్లు ప్రవేశపెట్టిన మోదీ ప్రభుత్వం ఈ ఏడాది 10వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ద్రవ్యోల్బణం, చైనా సైనిక చొరబాట్లు, బీబీసీ డాక్యుమెంటరీలు, కశ్మీరీ పండిట్ల భద్రత, హిండన్ బర్గ్ నివేదిక తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్,  అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి. మరికొన్ని పార్టీలు అదే బాటలో ఉండబోతున్నట్టు సమాచారం. 


నేడు కాంగ్రెస్ తో చర్చలు


జనవరి 30వ తేదీ సోమవారం బడ్జెట్ కు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 27 పార్టీలకు చెందిన 37 మంది నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ సభను మరింత మెరుగ్గా నడపడానికి ప్రతిపక్షాల సహకారం అవసరమన్నారు. అయితే, భారత్ జోడో యాత్ర చివరి రోజు కావడంతో కాంగ్రెస్ సమావేశానికి హాజరు కాలేకపోయింది. ఈ నెల 31న అంటే నేడు కాంగ్రెస్‌తో విడివిడిగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.



'కేంద్రం వైఫల్యంపై నిరసన'


బీజేపీ నేతృత్వంలోని కేంద్రం పాలనలో అన్ని రంగాల్లో విఫలమైనందుకు నిరసనగా పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తామని బీఆర్ఎస్ జాతీయ కార్యదర్శి నేత కె.కేశవరావు సోమవారం ప్రకటించారు. సమావేశాల తొలి రోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. 


నేటి నుంచి బడ్జేట్ సమావేశాలు


పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ప్రసంగం అనంతరం ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. బడ్జెట్ సమావేశాల రెండవ రోజున, ఫిబ్రవరి 1 న, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోడీ ప్రభుత్వం ప్రస్తుత టర్మ్ చివరి పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి.


బడ్జెట్ సమావేశాలకు ముందు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో కలిసి లోక్ సభ చాంబర్ నుంచి సెంట్రల్ హాల్ వరకు పరిశీలించి ఏర్పాట్లను మరింత సౌకర్యవంతంగా చేయాలని ఆదేశించారు.


మరి బడ్జెట్ లైవ్‌ ఎక్కడ చూడాలి


బడ్జెట్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే, పార్లమెంటు టీవీ, దూరదర్శన్ లో చూడవచ్చు. బడ్జెట్ లైవ్ టెలికాస్ట్ ను కూడా తమ యూట్యూబ్ ఛానెల్ లో చూడొచ్చు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తన ఆన్లైన్ ప్లాట్ఫామ్‌లో బడ్జెట్ 2023 ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అన్ని న్యూస్‌ ఛానళ్లు దీనిని ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. మీరు బడ్జెట్ 2023 ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి యూట్యూబ్‌లో కూడా చాలా ఛానళ్లు దీన్ని లైవ్‌ పెడతాయి. 


యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్


మొత్తం 14 కేంద్ర బడ్జెట్లతోపాటు రాజ్యాంగం ద్వారా చెప్పిన గ్రాంట్లు, ఆర్థిక బిల్లుల డిమాండ్‌తో పాటు వార్షిక బడ్జెట్‌ను కూడా చూడవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకోసం మీరు యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ లోకి వెళ్లి పార్లమెంటు సభ్యులతో పాటు సాధారణ ప్రజలు కూడా బడ్జెట్ పేపర్స్‌ను చూసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా బడ్జెట్ కు సంబంధించిన అన్ని వివరాలను ఇంగ్లిష్, హిందీ భాషల ద్వారా తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్స్‌లో ఇది అందుబాటులో ఉంది. www.indiabudget.gov.in జనరల్ బడ్జెట్ వెబ్ పోర్టల్ లోకి వెళ్లి కూడా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.