Bharti Airtel Q4 Results: 2023 మార్చి త్రైమాసికంలో భారతి ఎయిర్‌టెల్ అంచనాలను మించి లాభపడింది. ఏకీకృత నికర లాభం రూపంలో రూ. 3,006 కోట్లను ఈ టెలికాం కంపెనీ మిగుల్చుకుంది. ETNow ఎక్స్‌పర్ట్స్‌ పోల్‌ అంచనా రూ. 2,881 కోట్లుగా ఉంటే, అంతకంటే ఎక్కువే సంపాదించింది. గత ఏడాది ఇదే కాలంలోని లాభంతో పోలిస్తే ఇప్పుడు 50% (YoY) ఎక్కువ ఆర్జించింది.


కంపెనీ ఏకీకృత ఆదాయం 14.3% వృద్ధితో రూ. 36,009 కోట్లకు చేరుకుంది. అయితే, అంచనా వేసిన రూ. 36,744 కోట్ల కంటే ఇది తక్కువగా ఉంది. 


సీక్వెన్షియల్‌గా (QoQ) చూస్తే, బాటమ్‌లైన్ 89% పైగా పెరిగింది. టాప్‌లైన్ అతి స్వల్పంగా 0.6% పెరిగింది.


ఏకీకృత నిర్వహణ లాభం (EBITDA) దాదాపు 18% పెరిగి రూ. 18,807 కోట్లకు, మార్జిన్‌లు 144 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 52.2%కి చేరాయి. వ్యయాలను తగ్గించుకోవడం ద్వారా లాభదాయకతను ఈ కంపెనీ పెంచుకుంది.


మొత్తం FY23లో, టెలికాం ఆపరేటర్ ఆదాయం 19.4% వృద్ధితో రూ. 1.39 లక్షల కోట్లకు చేరింది. నికర లాభంలో 96% వృద్ధితో రూ. 8,346 కోట్లను మిగుల్చుకుంది.


అన్ని వ్యాపార విభాగాల్లో బలమైన, స్థిరమైన పనితీరు వల్ల మార్చి త్రైమాసికంలో మంచి ఆదాయ వృద్ధి సాధించగలిగామని కంపెనీ తెలిపింది.


మార్చి త్రైమాసికంలో, భారతదేశ వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం 12% పెరిగి రూ. 25,250 కోట్లుగా నమోదైంది. మొబైల్ సర్వీసుల ఆదాయం 11.5% YoY పెరిగింది. కొత్త 4G కస్టమర్లు కంపెనీలోకి వస్తూనే ఉండడం, వినియోగదారు సగటు ఆదాయం (ARPU) పెరగడంతో కంపెనీ రాబడి పెరిగింది.


భారతదేశ వ్యాపారం ఎబిటా మార్జిన్‌లు 225 bps YoY మెరుగుపడి 53.1%కి పెరిగాయి.


రిలయన్స్‌ జియో కంటే ఎక్కువ 'ఆర్పు'
టెలికాం కంపెనీ ఆదాయాల్లో కీలకంగా చూడాల్సిన ఆర్పు (ARPU) విషయానికి వస్తే... మార్చి త్రైమాసికంలో ఆర్పు రూ. 193 వద్ద ఉంది. QoQలో ఫ్లాట్‌గా ఉన్నా, YoYలో రూ. 178 స్థాయి నుంచి మెరుగుపడింది. ప్రత్యర్థి కంపెనీ రిలయన్స్‌ జియో మార్చి త్రైమాసికం ఆర్పు రూ. 178.8 గా ఉంది.


నాణ్యమైన కస్టమర్లను సంపాదించుకోవడంపై దృష్టి పెట్టడం వల్ల, మొత్తం ఆర్థిక ఏడాదిలో 7.4 మిలియన్ల కొత్త 4G కస్టమర్‌లు లభించారని; రూ. 193 ఆర్పుతో పరిశ్రమలో అగ్రగామిగా ఉన్నామని భారతి ఎయిర్‌టెల్‌ MD గోపాల్ విట్టల్ చెప్పారు. 5G రోల్‌అవుట్‌ను పెంచుతూనే ఉన్నామని, ఈ సంవత్సరం చివరి నాటికి అన్ని ప్రధాన పట్టణాలు, ముఖ్య గ్రామాలను కనెక్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.


మార్చి త్రైమాసికంలో 3.1 మిలియన్ కొత్త సబ్‌స్క్రైబర్‌లను ఎయిర్‌టెల్‌ జోడించింది. డిసెంబర్ త్రైమాసికంలోని 4.4 మిలియన్ల చేరికల కంటే ఇప్పుడు తక్కువగా ఉంది.


2023 మార్చి చివరి నాటికి ఎయిర్‌టెల్‌ మొత్తం సబ్‌స్క్రైబర్‌ సంఖ్య 375 మిలియన్లకు చేరింది. 


ఎయిర్‌టెల్‌ డివిడెండ్‌
ఒక్కో షేరుకు రూ. 4 తుది డివిడెండ్‌ చెల్లించాలని ఎయిర్‌టెల్‌ బోర్డు సిఫారసు చేసింది.


ఇది కూడా చదవండి: CVV గుర్తు లేదా?, నో ప్రోబ్లెం, దానితో పని లేకుండానే చెల్లింపు చేయవచ్చు 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.