Bank of India Shares: కొన్ని వారాలుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు దూకుడు చూపిస్తున్నాయి. బ్యాంక్ బిజినెస్ మీద పాజిటివ్ ఔట్‌లుక్ వల్ల ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ పెరిగింది. ఇవాళ్టి (గురువారం) ఇంట్రా డే ట్రేడింగ్‌లో, బ్యాంక్ షేర్లు 5 శాతం ర్యాలీ చేసి రూ. 83.25కి చేరుకున్నాయి. ఇది 52 వారాల రికార్డ్ స్థాయి. + 17 నెలల గరిష్ట స్థాయి. ఈ ప్రభుత్వ రంగ రుణదాత షేర్లు 2021 జూన్ తర్వాత ఇప్పుడు గరిష్ట స్థాయిలో కోట్ అవుతున్నాయి.
ఆరు వారాల్లో 80 శాతం జూమ్
గత ఆరు వారాల్లో, శ్రీహరికోట రాకెట్‌లా ఈ స్టాక్ ధర నిట్టనిలువుగా పెరిగింది. అక్టోబర్ 13, 2021 నాటి రూ. 46.30 స్థాయి నుంచి ఇప్పటి వరకు 80 శాతం జూమ్ అయింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టర్లకు కొన్నాళ్లుగా మంచి శకునాలు ఎదురవుతున్నాయి. బుధవారం (నవంబర్ 23న) కూడా, రేటింగ్ ఏజెన్సీ అక్యూట్ రేటింగ్స్ & రీసెర్చ్ (Acuite Ratings & Research) సూపర్ న్యూస్ చెప్పింది. ఈ బ్యాంక్‌కు తానిచ్చే AA రేటింగ్‌ను కంటిన్యూ చేసింది, దీనికి మించి, బ్యాంక్ అదనపు టైర్-1 బాండ్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఔట్‌లుక్‌ను స్టేబుల్ నుంచి పాజిటివ్‌కు అప్‌గ్రేడ్ చేసింది. ఈ న్యూస్ ఇవాళ బాగా వర్కవుట్ అయింది.
గత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంతో (H1FY22) పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో (H1FY23) బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ (NIM) 2.42 శాతం నుంచి 3.04 శాతానికి పెరిగింది.
H1FY23 కాలంలో కార్యాచరణ పనితీరు మెరుగుపడడం, తక్కువ కేటాయింపులు (Provisions) కారణంగా పన్ను తర్వాతి లాభం (PAT) ఆరోగ్యకర స్థాయి చేరింది, రూ. 1,521 కోట్లకు పెరిగింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న మూలధన మద్దతు కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బలం చేకూర్చింది. ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి బ్యాంక్ క్యాపిటలైజేషన్ లెవెల్ 15.51 శాతంగా ఉంది.
తగ్గిన స్లిప్ పేజ్‌లు, క్రెడిట్ ఖర్చుల వల్ల బ్యాంక్ ఆర్థిక పనితీరు మెరుగుపడింది. AA రేటింగ్ కొనసాగించడానికి ఇది కూడా ఒక ప్రధాన అంశంగా రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది.
ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి, 44.12 శాతం CASA మిక్స్‌తో బ్యాంక్ లయబిలిటీ ప్రొఫైల్ హెల్దీగా ఉంది. ఇదే కాలానికి 88.96 శాతం ప్రొవిజన్ కవరేజ్ ఉంది. స్వల్ప - మధ్యకాలంలో ఆస్తుల నాణ్యతకు రిస్క్ వస్తే, ఈ ప్రొవిజన్ కవరేజ్ రక్షణగా నిలుస్తుంది. ఈ అంశాలను కూడా రేటింగ్ ఏజెన్సీ పరిగణనలోకి తీసుకుంది.
ఆస్తి నాణ్యత తగ్గకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకున్నప్పటికీ, కొన్ని మైనస్‌లు కూడా కనిపిస్తున్నాయి. 2022 సెప్టెంబర్ 30 నాటికి బ్యాంక్ GNPAs (Gross non performing assets), NNPA (Net Non Performing Assets) వరుసగా 8.51 శాతం, 1.92 శాతంగా ఉన్నాయి. ఇది కాస్త ఆందోళనకర విషయం.
గత నెల రోజుల కాలంలో ఈ స్టాక్ 45 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 55 శాతం ర్యాలీ చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.