Bank Locker Rules: బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేసినట్లే.. నగలు, నట్రా, కీలక పత్రాలు, విలువైన వస్తువులను దాచుకోవడానికి ప్రజలు బ్యాంక్‌ లాకర్లు తీసుకుంటారు. ఆ లాకర్‌ పూర్తిగా మీ పర్సనల్‌. అందులో ఏం ఉందన్నది మీరు చెబితే తప్ప అన్యులకు తెలీదు. బ్యాంక్‌ లాకర్లకు పటిష్టమైన భద్రత ఉంటుంది. కాబట్టి, దొంగతనం/నష్ట భయం చాలా తక్కువ. బ్యాంక్‌ లాకర్‌ తీసుకుంటే, ఏటా కొంత మొత్తాన్ని అద్దె రూపంలో బ్యాంక్‌కు చెల్లించాలి.


మీరు మొదటిసారి బ్యాంక్‌ లాకర్‌ తీసుకోవాలని భావిస్తుంటే, ముందుగా లాకర్‌ రూల్స్‌ గురించి తెలుసుకోవాలి. ఒక వ్యక్తికి బ్యాంకులో ఖాతా ఉంటే, అతను ఆ బ్యాంకులో లాకర్‌ పొందడం సులభం. మీకు ఆ బ్యాంకులో ఖాతా లేకుంటే లాకర్‌ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఒక్కోసారి ఈ వెయిటింగ్ పిరియడ్‌ మీ సహనానికి పరీక్ష పెడుతుంది, 6 నెలల నుంచి ఒక సంవత్సరం వరకు ఎదురుచూడాల్సి రావచ్చు. 


లాకర్‌ పొందడానికి, ముందుగా మీరు బ్యాంక్‌ బ్రాంచ్‌ను సంప్రదించాలి. అక్కడ, 'మెమోరాండం ఆఫ్ లెట్టింగ్'పై (memorandum of letting) సంతకం చేయాలి. లాకర్‌ రూల్స్‌ గురించిన సమస్త సమాచారం అందులో ఉంటుంది. బ్యాంక్‌ విధించే షరతుల వివరాలు కూడా అందులో ఉంటాయి. వాటిని సమగ్రంగా చదివిన తర్వాతే సంతకం చేయడం మంచిది.


జాయింట్ లాకర్ ఎలా పొందాలి?
సింగిల్‌గానే కాదు, జాయింట్ లాకర్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆ వ్యక్తులు బ్యాంకుకు వెళ్లి జాయింట్‌ మెమోరాండంపై సంతకాలు చేయాలి. అయితే, మీరు ఏ బ్యాంక్‌లో లాకర్‌ కోసం వెళ్లారో, అక్కడ సేవింగ్స్ బ్యాంక్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేయమని బ్యాంకర్‌ మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఆ బ్యాంకులో ఖాతా తెరవవలసి ఉంటుంది.


లాకర్ అద్దె ఎంత ఉంటుంది?
మీ బ్యాంక్‌ ఏ ప్రాంతంలో ఉందన్న అంశంపై ఆధారపడి లాకర్ అద్దె నిర్ణయం అవుతుంది. లాకర్ సైజును బట్టి కూడా ఛార్జీలు ఉంటాయి. మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు లాకర్‌ అద్దెలు భిన్నంగా ఉంటాయి. సాధారణంగా, బ్యాంకులు కస్టమర్ల నుంచి 2 నుండి 3 సంవత్సరాల అద్దెను అడ్వాన్స్‌గా తీసుకుంటాయి. ఈ ఛార్జి 1,500 రూపాయల నుంచి 20,000 రూపాయల మధ్య ఉండవచ్చు. అద్దె కాకుండా, రిజిస్ట్రేషన్ ఫీజ్‌ సహా కొన్ని రకాల పేర్లతో ఛార్జీలు వసూలు చేస్తారు. ప్రైవేట్‌ బ్యాంకుల్లో లాకర్ల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల లాకర్ల అద్దె తక్కువగా ఉంటుంది.


లాకర్‌ను ఎలా ఆపరేట్ చేయాలి?
బ్యాంక్ లాకర్ తీసుకున్న తర్వాత, బ్యాంకర్‌ మీకు ఒక తాళం చెవి ఇస్తాడు, బ్యాంక్‌ దగ్గర మరో కీ ఉంటుంది. ఈ రెండూ ఉంటేనే లాకర్‌ ఓపెన్‌ చేయగలం. మీరు బ్యాంక్‌ లాకర్‌ తెరవాలనుకుంటే, బ్యాంక్‌కు వెళ్లి లాకర్‌ రిజిస్టర్‌లో వివరాలు నింపాలి. బ్యాంక్‌ క్లర్క్ మీతో పాటు లాకర్ రూమ్‌కు వచ్చి తన దగ్గరున్న తాళం చెవితో లాకర్‌ను సగం ఓపెన్‌ చేసి అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత, మీ దగ్గర ఉన్న రెండో కీతో లాక్‌ను పూర్తిగా ఓపెన్‌ చేస్తారు. మీ పని పూర్తయిన తర్వాత, మీ దగ్గరున్న తాళంతో లాకర్‌ క్లోజ్‌ చేయాలి. ఆ తర్వాత బ్యాంక్‌ క్లర్క్ మళ్లీ వచ్చి ఈ లాకర్‌ను పూర్తిగా మూసివేస్తాడు.


మరో ఆసక్తికర కథనం: మసకబారిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు